విద్యుత్ లైన్లు తగిలి ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు అన్ని విధాలా సాయం అందిస్తాం: మంత్రి గొట్టిపాటి

విద్యుత్ లైన్లు తగిలి ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు అన్ని విధాలా సాయం అందిస్తాం: మంత్రి గొట్టిపాటి

Gottipati Ravi Kumar promises full support to families of electric shock victims
  • విద్యుత్ ప్రమాదాలు, భారీ వర్షాలపై గొట్టిపాటి సమీక్షా సమావేశం
  • విద్యుదాఘాతంతో నలుగురు ప్రాణాలు కోల్పోవడంపై దిగ్భ్రాంతి
  • విద్యుత్ వైర్లు తెగిపడితే వెంటనే ఫిర్యాదు చేయాలా వ్యవస్థను పటిష్ఠం చేయాలని ఆదేశం

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల సంభవించిన విద్యుత్ ప్రమాదాలు, ఉత్తరాంధ్రలో వాయుగుండం ప్రభావంతో తలెత్తిన పరిస్థితులపై రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. బాపట్ల మండలంలో తెగిపడిన ఎల్‌టీ విద్యుత్ లైన్ తాకి తల్లి, కుమారుడు మృతి చెందిన ఘటనతో పాటు, నర్సీపట్నం నాతవరంలో విద్యుదాఘాతంతో ఇద్దరు మహిళలు ప్రాణాలు కోల్పోవడంపై మంత్రి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులకు ప్రభుత్వం నుంచి అన్ని విధాలా సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. గాయపడిన నాగరాజుకు అత్యుత్తమ వైద్యం అందించాలని ఆదేశించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా విద్యుత్ వైర్లు, స్తంభాల స్థితిగతులను నిరంతరం పరిశీలించాలని స్పష్టం చేశారు.


వాయుగుండం వల్ల ఉత్తరాంధ్ర జిల్లాల్లో గంటకు 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తుండటంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడిందని అధికారులు మంత్రికి వివరించారు. ఈ నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తగా ఈపీడీసీఎల్ పరిధికి అవసరమైన అదనపు సిబ్బందిని, విద్యుత్ మెటీరియల్‌ను ఎస్‌పీడీసీఎల్ నుంచి పంపించినట్లు తెలిపారు.


ఎక్కడైనా విద్యుత్ స్తంభాలు కూలినా, వైర్లు తెగిపడినా తక్షణమే సంబంధిత సమీప కార్యాలయాలకు ఫిర్యాదు చేసేలా సమాచార వ్యవస్థను పటిష్ఠం చేయాలని ఆదేశించారు. విద్యుత్ అంతరాయం ఉన్న చోట వాతావరణం అనుకూలించిన వెంటనే పునరుద్ధరణ పనులు చేపట్టి, ఎక్కడా ప్రాణ నష్టం జరగకుండా అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని దిశానిర్దేశం చేశారు.

Advertisement
Gottipati Ravi Kumar
Andhra Pradesh Electricity Department
Bapatla Electric Shock Deaths
North Andhra Cyclone Power Supply
AP Energy Minister Review
EPDCL SPDCL Emergency Services

More Telugu News