పసికూన జపాన్ చేతిలో చిత్తయ్యే ప్రమాదం.. చివరికి గట్టెక్కిన టీమిండియా

పసికూన జపాన్ చేతిలో చిత్తయ్యే ప్రమాదం.. చివరికి గట్టెక్కిన టీమిండియా

Team India survives major scare against Japan to secure narrow two run victory
  • జపాన్‌తో ఉత్కంఠ పోరులో 2 పరుగుల తేడాతో గెలిచిన భారత్
  • టీ20 ఫార్మాట్‌లో టీమిండియాకు ఇది 200వ చారిత్రక విజయం
  • 5 ఓవర్ల మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 32/4 స్కోరుకే పరిమితం
  • 33 పరుగుల లక్ష్య ఛేదనలో అద్భుతంగా పోరాడిన జపాన్
  • కట్టుదిట్టమైన బౌలింగ్‌తో జట్టును గట్టెక్కించిన సుందర్, అక్షర్ పటేల్
రెండుసార్లు ప్రపంచ ఛాంపియన్ అయిన టీమిండియా, పసికూన జపాన్ చేతిలో ఓటమి అంచులదాకా వెళ్లింది. సానో అంతర్జాతీయ క్రికెట్ గ్రౌండ్‌లో జరిగిన ఏకైక టీ20 మ్యాచ్‌లో, ఆఖరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగిన పోరులో కేవలం 2 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. వర్షం కారణంగా 5 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో గెలుపుతో టీమిండియా అంతర్జాతీయ టీ20ల్లో 200వ విజయాన్ని నమోదు చేసుకుంది. సూపర్ ఓవర్ విజయాలతో కలిపి భారత్ ఈ మైలురాయిని అందుకుంది.

దాదాపు రెండున్నర గంటల ఆలస్యం తర్వాత మ్యాచ్ ప్రారంభం కాగా టాస్ గెలిచిన భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే, పరిస్థితులను సద్వినియోగం చేసుకున్న జపాన్ స్పిన్నర్లు భారత బ్యాటర్లను కట్టడి చేశారు. ఓపెనర్‌గా వచ్చిన అభిషేక్ శర్మ (0) తొలి బంతికే ఔట్ కాగా, ఇషాన్ కిషన్ (3), సంజూ శాంసన్ (9) విఫలమయ్యారు. కెప్టెన్ అయ్యర్ (16) కాస్త ఫర్వాలేదనిపించడంతో భారత్ నిర్ణీత 5 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 32 పరుగులు మాత్రమే చేయగలిగింది. తిలక్ వర్మ (1) నాటౌట్‌గా నిలిచాడు. జపాన్ బౌలర్లలో చార్లీ హింజ్ రెండు వికెట్లు పడగొట్టాడు.

కేవలం 33 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన జపాన్, భారత జట్టుకు చుక్కలు చూపించింది. తమ క్రికెట్ చరిత్రలోనే అతిపెద్ద సంచలనం నమోదు చేసే దిశగా సాగింది. అయితే, కీలక సమయంలో వాషింగ్టన్ సుందర్ రెండు వికెట్లు తీసి జపాన్ జోరుకు బ్రేకులు వేశాడు. అనుభవజ్ఞుడైన అక్షర్ పటేల్ కూడా కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి ఒత్తిడి పెంచాడు. దీంతో జపాన్ లక్ష్యానికి 2 పరుగుల దూరంలో నిలిచిపోవడంతో టీమిండియా ఊపిరి పీల్చుకుంది.

ఈ మ్యాచ్‌లో ఓ వివాదాస్పద ఘటన కూడా చోటుచేసుకుంది. జపాన్ ఛేదనలో నాలుగో ఓవర్లో అంపైర్ వైడ్ ఇవ్వగా, బ్యాటర్ రివర్స్ స్వీప్ ఆడేందుకు ప్రయత్నించాడని కెప్టెన్ అయ్యర్, బౌలర్ అక్షర్ వాదించారు. దీంతో అంపైర్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. ఓటమి పాలైనప్పటికీ, ఆసియా క్రీడల ముందు జపాన్ ప్రదర్శన వారికి ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. మరోవైపు టీమిండియా ఈ మ్యాచ్‌లో ఓటమి నుంచి త్రుటిలో తప్పించుకుని గట్టెక్కింది.
Advertisement
Team India
Japan Cricket Team
Shreyas Iyer
India vs Japan T20
200th T20 International Win
Sano International Cricket Ground

More Telugu News