సినీ ప్రయాణంలో 48 ఏళ్లు పూర్తి.. ‘శివశంకర వర ప్రసాద్’ నుంచి ‘చిరంజీవి’ వరకు అపూర్వ ప్రయాణంపై మెగాస్టార్ భావోద్వేగం
- ఇండస్ట్రీలోకి సామాన్యుడిగా అడుగుపెట్టి అసామాన్యుడిగా ఎదిగిన చిరంజీవి
- 1978లో ఇదే రోజున విడుదలైన 'ప్రాణం ఖరీదు' చిత్రాన్ని గుర్తు చేసుకున్న మెగాస్టార్
- అభిమానుల ప్రేమాభిమానాలే తన జీవితంలో అతిపెద్ద విజయమని వ్యాఖ్య
తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి ఒక సామాన్యుడిగా అడుగుపెట్టి, ఎన్నో విజయాలను సొంతం చేసుకుని మెగాస్టార్ గా అవతరించిన చిరంజీవి... తన సినీ ప్రయాణంలో 48 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన సోషల్ మీడియా వేదికగా అత్యంత భావోద్వేగపూరిత పోస్ట్‌ను పంచుకున్నారు. 1978 సెప్టెంబర్ 22న తాను నటించిన తొలి చిత్రం ‘ప్రాణం ఖరీదు’ వెండితెరపై విడుదలైన రోజే తన జీవితంలో సరికొత్త అధ్యాయం ప్రారంభమైందని ఆయన గుర్తు చేసుకున్నారు. ఆ రోజున కొణిదెల శివశంకర వరప్రసాద్ అనే తన అసలు పేరును ‘చిరంజీవి’గా మార్చుకున్నానని, నేడు అదే పేరు తనకు కోట్లాది మంది అభిమానుల గుండెల్లో శాశ్వత గుర్తింపుగా మిగిలిపోయిందని ఆనందం వ్యక్తం చేశారు.
సుదీర్ఘమైన ఈ 48 ఏళ్ల పయనంలో ఎన్నో రకాల పాత్రలను పోషించానని, లెక్కలేనన్ని అపూర్వ విజయాలు, గౌరవాలు, జాతీయ అంతర్జాతీయ అవార్డులను అందుకున్నానని చిరంజీవి పేర్కొన్నారు. తనకు నటుడిగా అవకాశాలు ఇచ్చిన నిర్మాతలు, తనలోని సరికొత్త నటనను ఆవిష్కరించిన దర్శకులు, అహర్నిశలు శ్రమించిన సాంకేతిక నిపుణులు, తోటి నటీనటులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
ఇవన్నీ ఒకెత్తయితే తనపై కోట్లాది మంది అభిమానులు చూపిస్తున్న నిరంతర ప్రేమాభిమానాలే తన జీవితంలో అతిపెద్ద విజయమని, అభిమానులను తన సొంత కుటుంబ సభ్యులుగా భావిస్తూ శిరస్సు వంచి ధన్యవాదాలు అర్పిస్తున్నానని వెల్లడించారు. కాగా, చిరు నటించిన మొదటి సినిమా 'పునాది రాళ్లు' అయినప్పటికీ, 'ప్రాణం ఖరీదు' ముందుగా విడుదలైంది. ప్రస్తుతం ఆయన ‘కాకా’, ‘విశ్వంభర’ వంటి భారీ ప్రాజెక్టులతో వరుస సినిమాలతో బిజీగా కొనసాగుతున్నారు.