ఈ మధ్య కాలంలో డిఫరెంట్ కంటెంట్ ను టచ్ చేయడానికే మేకర్స్ ఉత్సాహాన్ని చూపుతున్నారు. కాన్సెప్ట్ కొత్తగా అనిపిస్తే చాలు చూడటానికి ఆడియన్స్ ఆసక్తిని కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలో వచ్చిన సినిమానే 'రామ్ అండ్ లీలా'. రియో రాజ్ - వర్తిక జైన్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమా, ఆగస్టు 21వ తేదీన థియేటర్లకు వచ్చింది. ఇప్పుడు ఈ సినిమా తమిళంతో పాటు, తెలుగు .. మలయాళ .. కన్నడ భాషల్లో అందుబాటులోకి వచ్చింది. ఈ నెల 18వ తేదీ నుంచి 'అమెజాన్ ప్రైమ్'లో స్ట్రీమింగ్ అవుతోంది.
రఘురామ్ (రియో రాజ్) ఒక మిడిల్ క్లాస్ కుటుంబానికి చెందిన యువకుడు. తండ్రి ఆర్టీసీలో డ్రైవర్ గా పనిచేస్తూ ఉంటాడు. కొన్ని కారణాల వలన, తండ్రికి .. కొడుకుకి మధ్య మాటలు ఉండవు. ఇద్దరి మధ్య తల్లి .. చెల్లి రాయబారం చేస్తుంటారు. వయసు 30 దాటుతున్నా పెళ్లి కాకపోవడంతో రఘురామ్ టెన్షన్ పడుతూ ఉంటాడు. తాను నచ్చలేదని చెబుతున్న అమ్మాయిల సంఖ్య పెరిగిపోతూ ఉండటంతో, ఇక ఎవరినైనా ముగ్గులోకి లాగేసి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు.
అమ్మాయిలు ఎక్కువమంది తారసపడతారనే ఉద్దేశంతోనే అతను లోకల్ ట్రైన్ లో తిరగడం మొదలుపెడతాడు. మొత్తానికి అతని ప్రయత్నం ఫలించి, 'లీలా'( వర్తిక జైన్) పరిచయమవుతుంది. సాయంత్రం 6 గంటల తరువాత తనని కలిసే ప్రయత్నం చేయవద్దనీ, అలా అయితేనే అతనిని ప్రేమిస్తానంటూ ఆమె షరతు పెడుతుంది. అందుకు రఘురామ్ ఒప్పుకుంటాడు. తన ఫ్యామిలీకి పరిచయం చేస్తాడు. అందమైన అమ్మాయి కోడలిగా రాబోతున్నందుకు ఆమె ఎంతో సంతోష పడుతుంది.
ఇక లీలా తన ఇంటికి రావొద్దని చెప్పినా వినిపించుకోకుండా రఘురామ్ వాళ్ల ఇంటికి వెళతాడు. సాయంత్రం 6 గంటల తరువాత ఆమెను ఎందుకు కలవకూడదో చెప్పమని నిలదీస్తాడు. తన పూర్వీకులు ఏలియన్స్ అనీ, సాయంత్రం 6 దాటిన తరువాత తాను అబ్బాయిగా మారిపోతానని చెబుతుంది లీలా. అప్పుడు రఘురామ్ ఏం చేస్తాడు? లీలను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటాడా ? అనేది మిగతా కథ.
వయసు ముదిరిపోతుందని కంగారుపడిపోయిన రఘు రామ్, నానా కష్టాలుపడి ఒక అమ్మాయిని లైన్లో పెడతాడు. ఆ అమ్మాయినే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. తన ప్రేమను పెళ్లి పీటల దిశగా తీసుకుని వెళుతున్న సమయంలో, ఆమె ఏలియన్ ఫ్యామిలీ నుంచి వచ్చిన అమ్మాయని తెలుస్తుంది. అప్పుడు అతను ఎలా రియాక్ట్ అవుతాడనే అంశం చుట్టూ దర్శకుడు ఈ కథను అల్లుకున్నాడు.
హీరో పెళ్లి లేటైపోతోందని టెన్షన్ పడిపోతూ అమ్మాయిల వెంటపడుతూ ఉండటం, అందమైన అమ్మాయి లైన్లో పడగానే మురిసిపోవడం వంటి సన్నివేశాలతో ఫస్టాఫ్ చాలా సరదాగా .. సందడిగా నడిచిపోతుంది. ఆ అమ్మాయి ఏలియన్ ఫ్యామిలీకి చెందింది అనే విషయం తెలిసిన తరువాత మొదలయ్యే గందరగోళంతో సెకండాఫ్ కి సంబంధించిన సన్నివేశాలు పరుగులు పెడుతూ ఉంటాయి.
హీరో అందమైన అమ్మాయి వెంటపడుతూ ఉండటం, సాయంత్రం 6 గంటల తరువాత తనని కలిసే ప్రయత్నం చేయవద్దని ఆమె తప్పించుకుంటూ తిరుగుతూ ఉండటం వంటి సన్నివేశాలు సరదాగా అనిపించడమే కాకుండా, అందుకుగల కారణం ఏమిటనేది తెలుసుకోవాలనే కుతూహలం పెరుగుతూ పోతుంటుంది. అయితే ఆ కారణం ఏమిటనేది తెలిసిన తరువాత, కంటెంట్ పై ఆడియన్స్ కి ఇంట్రెస్ట్ పోతుంది. అక్కడి నుంచి గ్రాఫ్ పడిపోవడం మొదలవుతుంది.
లీలా తాను ఏలియన్ ఫ్యామిలీకి చెందినదానిగా చెప్పుకోవడం వలన కొంత ఆసక్తి తగ్గితే, సాయంత్రం 6 గంటల తరువాత తాను అబ్బాయిగా మారిపోతానని చెప్పడం .. కంటెంట్ ను మరింత నీరు గారుస్తుంది. దర్శకుడు ఇక్కడి నుంచి ఒక గందరగోళాన్ని క్రియేట్ చేసి అందులో నుంచి కామెడీని రాబట్టాలని చూశాడు. కానీ ఆశించిన స్థాయిలో అది వర్కౌట్ కాలేదు.
ఎప్పుడైతే తాను ఏలియన్ ఫ్యామిలీ నుంచి వచ్చానని హీరోయిన్ చెప్పిందో అక్కడి నుంచే ఈ కథ ఆడియన్స్ కి దూరంగా వెళుతుంది. ఇక సాయంత్రం 6 గంటలు దాటగానే అబ్బాయిగా మారిపోతాననే విషయం కనెక్ట్ కాలేకపోయింది. ఈ కథలో కొత్త పాయింట్ అని దర్శకుడు దేనినైతే అనుకున్నాడో, ఆ పాయింట్ వాస్తవానికి దూరంగా వెళ్లిపోయింది. కామెడీని వర్కౌట్ చేయలేక కుంటుపడింది.
రియోరాజ్ - వర్తికతో పాటు మిగతా ఆర్టిస్టులంతా బాగానే చేశారు. మల్లికార్జున్ ఫొటోగ్రఫీ .. అంకిత్ మీనన్ సంగీతం .. శివ ఎడిటింగ్ ఓ మాదిరిగా అనిపిస్తాయి. ఫస్టాఫ్ సరదాగా అనిపించిన ఈ సినిమా, సెకండాఫ్ లో గందరగోళంలో పడేస్తుంది. నమ్మలేని విషయాలను జీర్ణించుకోలేకపోయిన ఆడియన్స్, గండం గడిచిందిరా బాబూ అనుకునేలా చేస్తుంది.
'రామ్ అండ్ లీలా' (అమెజాన్ ప్రైమ్) మూవీ రివ్యూ!
Ram and Leela Review
Movie Details
Movie Name: Ram and Leela
Genre: Comedy, Sci-Fi
Release Date: 2026-09-18
Cast: Rio Raj,Vartika Jain,Balaji Thiyagarajan,Chetan,Munishkanth,Malavika Avinash
Director: Ramachandrran Kannan
PRO: -
Music: Ankit Menon
Banner: Trident Arts
Review By: Peddinti
Disclaimer:
This review is based on the reviewer’s individual perspective. Audience opinions may vary.
Trailer