విజయవాడ వినాయక మండపం అన్నదానంలో అపశ్రుతి.. వేడి సాంబారులో పడి మహిళ మృతి.. సీసీటీవీలో రికార్డైన దృశ్యం!

విజయవాడ వినాయక మండపం అన్నదానంలో అపశ్రుతి.. వేడి సాంబారులో పడి మహిళ మృతి.. సీసీటీవీలో రికార్డైన దృశ్యం!

Woman dies after falling into hot sambar vessel during Vijayawada Vinayaka Mandapam Annadanam
  • విజయవాడలో వినాయక చవితి వేడుకల్లో తీవ్ర విషాదం
  • అన్నదానం చేస్తుండగా సాంబారు పాత్రలో పడిపోయిన మహిళ
  • ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయిన సుజాత
  • ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
  • బయటకు వచ్చిన ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్
విజయవాడలో వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో తీవ్ర అపశ్రుతి చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు వేడి సాంబారు ఉన్న పాత్రలో పడి తీవ్రంగా గాయపడిన మహిళ, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన నగరంలో విషాదాన్ని నింపింది.

వివరాల్లోకి వెళితే.. కేఎల్‌రావునగర్‌ ఐదో వీధికి చెందిన మద్ది సుజాత తన చిన్న కుమారుడితో కలిసి నివసిస్తోంది. సెప్టెంబర్ 20న తమ వీధిలో ఏర్పాటు చేసిన వినాయక నిమజ్జనం సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం కోసం సుజాత తన బంధువులతో కలిసి వంట పనుల్లో సాయం చేస్తున్నారు. 

ఈ క్రమంలో పొయ్యి మీద నుంచి దించిన పెద్ద సాంబారు పాత్రను మరో మహిళతో కలిసి పక్కకు తరలిస్తుండగా సుజాత పట్టుతప్పి అదుపుకోల్పోయారు. దీంతో ఆమె నేరుగా ఆ వేడి సాంబారు పాత్రలోనే పడిపోయారు.

ఈ దుర్ఘటనలో సుజాత ముఖం, ఛాతీతో పాటు శరీరం మొత్తం తీవ్రంగా కాలిపోయింది. వెంటనే అప్రమత్తమైన స్థానికులు ఆమెను పాత్రలో నుంచి బయటకు తీసి, హుటాహుటిన సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న ఆమె, పరిస్థితి విషమించడంతో సోమవారం తుదిశ్వాస విడిచారు.

ఈ సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ కూడా బయటకు వచ్చింది. ఈ ఘటనతో స్థానికంగా విషాద ఛాయలు అలముకున్నాయి.
Advertisement
Maddi Sujatha
Vijayawada
Hot sambar accident
Vinayaka Chavithi Annadanam
Woman dies in Vijayawada
CCTV footage accident

More Telugu News