దానం నాగేందర్ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు
- పార్టీ ఫిరాయింపుల కేసులో దానంను అనర్హుడిగా ప్రకటించిన హైకోర్టు
- హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసిన దానం
- దానం పిటిషన్ ను బుధవారం విచారించనున్న సుప్రీంకోర్టు
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ను పదవి నుంచి అనర్హుడిగా ప్రకటిస్తూ తెలంగాణ హైకోర్టు ఇటీవల ఇచ్చిన సంచలన తీర్పుపై దేశ అత్యున్నత న్యాయస్థానంలో విచారణ ప్రక్రియ ప్రారంభమైంది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ దానం నాగేందర్ దాఖలు చేసిన పిటిషన్‌ను అత్యవసరంగా విచారణకు స్వీకరించడానికి సుప్రీంకోర్టు సమ్మతించింది.
భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఎదుట దానం నాగేందర్ తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి ఈ అంశాన్ని ప్రస్తావించగా, ఈ పిటిషన్‌ను బుధవారం (సెప్టెంబర్ 23) విచారించనున్నట్లు ధర్మాసనం వెల్లడించింది. హైకోర్టు తీర్పు వల్ల ఖైరతాబాద్ స్థానం ఖాళీగా మారి ఉపఎన్నిక నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నందున, హైకోర్టు ఉత్తర్వులపై వెంటనే స్టే విధించాలని దానం తరఫు న్యాయవాదులు సుప్రీంకోర్టులో వాదనలు వినిపించనున్నారు.
గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసి విజయం సాధించిన దానం నాగేందర్... ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరడమే కాకుండా 2024 లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు.
ఒక పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచి మరో పార్టీ తరఫున పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయడాన్ని రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ నిబంధనల ఉల్లంఘనగా పరిగణిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. అసెంబ్లీ స్పీకర్ ఇచ్చిన పాత ఆదేశాలను పక్కనపెట్టిన రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం దానం నాగేందర్‌ను ఎమ్మెల్యే పదవికి అనర్హుడిగా ప్రకటించడంతో ఈ వివాదం ఇప్పుడు దేశ అత్యున్నత న్యాయస్థానం మెట్లు ఎక్కింది.