ఇంటర్ బోర్డులో డిజిటలైజేషన్, రిటైర్మెంట్ వయోపరిమితి పెంపు: మంత్రి లోకేశ్ నిర్ణయాలు
- లోకేశ్ నివాసంలో ఇంటర్ బోర్డు పాలకవర్గం సమావేశం
- 1978 నుంచి జారీ చేసిన ఇంటర్ సర్టిఫికెట్లను డిజిటలైజ్ చేయాలని నిర్ణయం
- ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు 60 నుంచి 62కి పెంచాలని తీర్మానం
ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యారంగంలో పారదర్శకత, జవాబుదారీతనం పెంచడమే లక్ష్యంగా వైవిధ్యమైన సంస్కరణలకు తెరలేపారు. ఉండవల్లిలోని తన నివాసంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ అధ్యక్షతన జరిగిన ఇంటర్ బోర్డు 78వ పాలకవర్గ సమావేశంలో విద్యార్థుల భవిష్యత్తుతో పాటు ఉద్యోగుల సంక్షేమాన్ని పరిగణనలోకి తీసుకుంటూ అనేక కీలక నిర్ణయాలకు ఆమోద ముద్ర వేశారు.
నకిలీ సర్టిఫికెట్ల అక్రమాలకు శాశ్వతంగా ముగింపు పలకాలనే దృఢ సంకల్పంతో 1978 నుంచి జారీ చేసిన ఇంటర్మీడియట్ విద్యార్హత పత్రాలన్నింటినీ సమగ్రంగా డిజిటలైజ్ చేయాలని ప్రతిపాదించారు. భద్రతను మరింత కట్టుదిట్టం చేసేందుకు ఈ రికార్డులను అత్యాధునిక ‘బ్లాక్‌చైన్ టెక్నాలజీ’తో అనుసంధానించనున్నారు.
విద్యా పునర్నిర్మాణంతో పాటు ఇంటర్మీడియట్ బోర్డు పరిధిలో పనిచేస్తున్న సిబ్బందికి తీపి కబురు అందిస్తూ వారి పదవీ విరమణ వయోపరిమితిని 60 సంవత్సరాల నుంచి 62 ఏళ్లకు పెంచుతూ తుది తీర్మానం చేశారు. దీనికితోడు పరీక్షల నిర్వహణ ప్రక్రియను వేగవంతం చేసే క్రమంలో ఇన్విజిలేటర్లు, మూల్యాంకనదారుల శ్రమను గుర్తించి వారు అందుకునే భత్యాలను ఏకంగా 25 శాతం వరకు పెంచే ప్రతిపాదనకు ఆమోదం తెలిపారు.
పరీక్షల్లో విద్యార్థుల సౌకర్యార్థం థియరీ సబ్జెక్టులకు 32 పేజీల బుక్‌లెట్లను అందించనున్నారు. మూల్యాంకనంలో ఏమాత్రం అలసత్వం వహించినా లేదా తీవ్రమైన తప్పులకు పాల్పడినా సంబంధిత సిబ్బందిపై కఠిన చర్యలు తప్పువని విద్యాశాఖ స్పష్టమైన హెచ్చరికలు జారీ చేసింది.