అభినయ కృష్ణ .. 'అదిరే అభి'గా ప్రేక్షకులకు తెలుసు. 'జబర్దస్త్' వేదిక ద్వారా మంచి పేరు సంపాదించుకున్న ఆర్టిస్టులలో అదిరే అభి ఒకరు. దర్శకుడిగా ఆయన ఇంతకుముందు 'చిరంజీవ' అనే ఒక సినిమా చేశారు. ఆ తరువాత సినిమాగా చేసినదే 'కర్మాఖ్య'. మిస్టీరియస్ థ్రిల్లర్ గా ఆయన చేసిన ఈ సినిమా, జులై 31వ తేదీన థియేటర్లకు వచ్చింది. 'సమైరా' ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సినిమా, ఈ రోజు (సెప్టెంబర్ 18) నుంచి 'జియో హాట్ స్టార్' లో స్ట్రీమింగ్ అవుతోంది.
'కామాఖ్య' (సమైరా) చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోతుంది. వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ లో ఉంటూ జాబ్ కోసం ట్రై చేస్తూ ఉంటుంది. 'ప్రవల్లిక' (శరణ్య ప్రదీప్) ఆమె రూమ్మేట్. ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉంటుంది. ప్రవల్లిక ఒక ఇన్సూరెన్స్ కంపెనీలో పనిచేస్తూ ఉంటుంది. ఒక రోజున ప్రవల్లికకి ఒక ఫంక్షన్ ఉండటంతో, ఆమె చేయవలసిన ఒక పాలసీ పనిమీద కామాఖ్యను పంపిస్తుంది.
అది 'విశాఖ'లోని సరోజిని (అభిరామి) ప్రభాకర్ (ఆనంద్) ఇల్లు. చనిపోయిన వారి కూతురు 'ప్రజ్ఞ' చేసిన పాలసీ గురించి మాట్లాడటానికి కామాఖ్య వెళుతుంది. వారి కొడుకు సాత్విక్ ( వైష్ణవ్)కి మానసిక స్థితి సరిగ్గా లేదనే విషయం, వెళ్లిన కాసేపటికే కామాఖ్యకి అర్థమవుతుంది. సరోజని దంపతులు ఎంతో ఆత్మీయంగా కామాఖ్యను పలకరిస్తారు. భోజనం చేసి వెళ్లవలసిందేనని పట్టుపడతారు. దాంతో మొహమాటంతో అక్కడ ఆమె భోజనం చేస్తుంది. ఆ వెంటనే ఆమె కళ్లు తిరిగి పడిపోతుంది.
ఆ దంపతులు కామాఖ్యను ఒక గదిలో బంధిస్తారు. 10 నెలల క్రితం చనిపోయిన 'ప్రజ్ఞ' బాడీ ఆ గదిలోనే ఉండటం చూసి కామాఖ్య భయపడిపోతుంది. ఆమెను 'బలి' ఇచ్చి తమ కూతురును బ్రతికించుకోవాలని అనుకుంటున్నట్టుగా సరోజినీ చెప్పడంతో కామాఖ్య భయపడిపోతుంది. అందుకు సంబంధించిన క్షుద్రపూజలు వాళ్లు మొదలుపెడతారు. అప్పుడు కామాఖ్య ఏం చేస్తుంది? ఆమెనే ఎందుకు 'బలి' ఇవ్వాలని అనుకున్నారు? అక్కడి నుంచి ఆమె బయటపడగలుగుతుందా? అనేది మిగతా కథ.
ఆ మధ్య అందరినీ విస్తుపోయేలా చేసే ఒకటి రెండు సంఘటనలు వెలుగు చూశాయి. మళ్లీ పుడతామనే నమ్మకంతో ఒక కుటుంబం ఆత్మహత్య చేసుకుంటే, చనిపోయిన వ్యక్తిని బ్రతికించడం కోసం మరొకరు నరబలిని ఇవ్వడానికి ప్రయత్నించారు. యథార్థ సంఘటనలను ఆధారంగా చేసుకుని, ఇలాంటి ఒక మూఢ నమ్మకం చుట్టూ అల్లుకున్న కథనే ఇది.
కామాఖ్యాదేవి శక్తిపీఠం .. అక్కడ జరిగే తాంత్రిక పూజలు .. తాంత్రిక పూజలు చేసే ఒక వంశానికి చెందిన కుటుంబం ఆంధ్రకి తరలిరావడం వంటి సన్నివేశాలతో దర్శకుడు ఆరంభంలోనే ఈ కథపై ఆసక్తిని రేకెత్తించే ప్రయత్నం చేశాడు. ఇక ఆ తరువాత స్నేహితురాలి కోసం, మానసికస్థితి సరిగ్గాలేని ఒక ఫ్యామిలీ మధ్యలోకి కామాఖ్య అమాయకంగా అడుగుపెట్టడం .. అక్కడ చిక్కుబడటం ఆడియన్స్ లో కుతూహలాన్ని పెంచుతుంది.
కామాఖ్యను బలి ఇవ్వడానికి ఆ సైకో ఫ్యామిలీ చేసే హడావిడి .. అక్కడి నుంచి తప్పించుకోవడానికి ఆమె చేసే ప్రయత్నాలు ప్రేక్షకులలో భయాన్ని కలిగిస్తాయి. ఇక్కడే కథకి మరో ట్విస్ట్ యాడ్ అవుతుంది. దాంతో అక్కడి నుంచి కథ మరింత పుంజుకుంటుంది. కథ ప్రీ క్లైమాక్స్ కి చేరుకుంటూ ఉండగా, పోలీస్ ఆఫీసర్ 'తిరుపతి'గా సముద్రఖని ఆ ఇంటివైపుకు వస్తాడు. లంచాలు తీసుకుంటూ ఆడుతూ పాడుతూ తన డ్యూటీ చేసుకునే అతనిని కలుపుకుంటూ కథ క్లైమాక్స్ దిశగా పరుగులు పెడుతుంది.
మొదటి నుంచి చివరి వరకూ 'అభి' ఈ కథను పట్టుగా నడిపించాడనే చెప్పాలి. కథనం ఎక్కడా సడల లేదు. ప్రీ క్లైమాక్స్ .. క్లైమాక్స్ తో ఈ సినిమాకి మరింత బలాన్ని చేకూర్చాడు. సమైరా .. శరణ్య ప్రదీప్ .. సముద్రఖని .. అభిరామి .. ఆనంద్ అనే ఈ ఐదుగురు ఆర్టిస్టులతోనే ఆయన ఈ కథను నడిపించిన తీరు .. వారి పాత్రలను మలచిన విధానం మెప్పిస్తుంది. తక్కువ బడ్జెట్ లో నే అభి ఒక ఇంట్రెస్టింగ్ కంటెంట్ ను అందించాడని చెప్పాలి.
తాంత్రిక పూజలకు సంబంధించిన నేపథ్యానికి 'కామాఖ్యాదేవి' శక్తిపీఠం ప్రస్తావన ఆసక్తికరంగానే అనిపిస్తుంది. అయితే 'కర్మాఖ్య' అనే టైటిల్ మాత్రం పలకడం దగ్గర నుంచి ఇబ్బంది పెడుతుంది. సాధారణ ప్రేక్షకులకు ఈ టైటిల్ కనెక్ట్ అవుతుందని చెప్పలేము. అలా కాకుండా తేలికైనా టైటిల్ మరేదేనా ట్రై చేసి ఉంటే బాగుండేదేమో అనిపిస్తుంది. ఇక ఫొటోగ్రఫీ .. నేపథ్య సంగీతం .. ఎడిటింగ్ ఫరవాలేదనే చెప్పాలి.
'కర్మాఖ్య' (జియో హాట్ స్టార్) మూవీ రివ్యూ!
Karmakhya Review
Movie Details
Movie Name: Karmakhya
Genre: Mystery, Thriller
Release Date: 2026-09-19
Cast: Samira, Samudrakhani, Abhirami, Anand, Sharanya Pradeep
Director: Abhinaya Krishna
PRO: -
Music: Gnani
Banner: My Flim productions
Review By: Peddinti
Disclaimer:
This review is based on the reviewer’s individual perspective. Audience opinions may vary.
Trailer