దానం నాగేందర్ రాజీనామా చేయాలి: ఏలేటి
- పార్టీ ఫిరాయింపు వ్యవహారంలో దానంపై అనర్హత వేటు వేసిన హైకోర్టు
- ఈ తీర్పుపై దానం సుప్రీంకోర్టుకు వెళ్లకూడదన్న ఏలేటి
- కాంగ్రెస్ కుట్రలకు హైకోర్టు తీర్పు చెంపపెట్టు అని వ్యాఖ్య
పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన సంచలన తీర్పును బీజేపీ తీవ్రంగా స్వాగతించింది. ఈ నేపథ్యంలో దానం నాగేందర్ సుప్రీంకోర్టుకు వెళ్లే ప్రయత్నం చేయకుండా వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి డిమాండ్ చేశారు. దానం నాగేందర్ ఈ తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశం ఉన్నందున, రేపే బీజేపీ తరఫున కేవియట్ పిటిషన్ దాఖలు చేస్తామని స్పష్టం చేశారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలను విలీనం చేసుకోవాలనే కాంగ్రెస్ కుట్రలకు ఈ తీర్పు చెంపపెట్టు అని, ఇప్పటికైనా అధికార కాంగ్రెస్ ప్రభుత్వం బుద్ధి తెచ్చుకుని పార్టీ మారిన మిగిలిన ఎమ్మెల్యేలతో కూడా రాజీనామాలు చేయించి ఉపఎన్నికలకు వెళ్లాలని సవాల్ విసిరారు.
మరోవైపు మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి కూడా హైకోర్టు నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తూ, ఇది ప్రజాస్వామ్య విజయమని అభివర్ణించారు. ఆరు నెలల వ్యవధిలోనే రాజ్యాంగబద్ధమైన తీర్పు రావడం చారిత్రాత్మకమని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ తీరుకు ఈ తీర్పు సరైన సమాధానమని పేర్కొన్నారు. భారత రాజ్యాంగ పరిరక్షణ కోసం, విలువలతో కూడిన రాజకీయం కోసం హైకోర్టు ఇచ్చిన ఈ ఆదేశాలు ప్రజాస్వామ్య వ్యవస్థపై నమ్మకాన్ని మరింత పెంచాయని అభిప్రాయపడ్డారు.