కత్రినా కైఫ్‌పై ట్రోలింగ్.. మద్దతుగా నిలిచిన నటి సోనారికా
- ప్రసవానంతరం బరువు పెరిగారంటూ కత్రినాపై ట్రోలింగ్
- మహిళల శరీరంలో సహజసిద్ధమైన మార్పులను ప్రశ్నించడం బాధాకరమన్న సోనారికా
- బిడ్డకు జన్మనివ్వడం అత్యంత సంక్లిష్టమైన ప్రక్రియ అని వ్యాఖ్య
బాలీవుడ్ ప్రముఖ నటి కత్రినా కైఫ్ ప్రసవానంతరం బరువు పెరిగారంటూ సోషల్ మీడియా వేదికగా సాగుతున్న విమర్శలు, ట్రోలింగ్‌పై టాలీవుడ్, బాలీవుడ్ నటి సోనారికా భడోరియా తీవ్రస్థాయిలో స్పందించారు. మాతృత్వం పొందిన మహిళల శరీరంలో వచ్చే సహజ సిద్ధమైన మార్పులను ప్రశ్నించడం, వారి రూపాన్ని బట్టి విమర్శించడం అత్యంత విచారకరమని పేర్కొంటూ కత్రినాకు పూర్తి మద్దతు ప్రకటిస్తూ సామాజిక మాధ్యమాల్లో సుదీర్ఘ పోస్ట్ చేశారు.
బిడ్డకు జన్మనివ్వడం అనేది అత్యంత సంక్లిష్టమైన ప్రక్రియ అని, ఆ సమయంలో మహిళ శరీరం ఎన్నో మార్పులకు లోనవుతుందని సోనారికా గుర్తుచేశారు. ఒక నటిగా సమాజంలో ఎంతటి గుర్తింపు ఉన్నప్పటికీ, ఆమె ప్రసవం తర్వాత ఎలా కనిపిస్తోంది లేదా ఎంత బరువు పెరిగింది అనే దానికంటే ఒక బిడ్డకు జన్మనివ్వడానికి ఆమె పడిన శ్రమను, గడిపిన నిద్రలేని రాత్రులను అర్థం చేసుకోవడం ముఖ్యమని చెప్పారు. మాతృత్వం కోసం సర్వస్వం త్యాగం చేయాలని కోరుకునే ఈ ప్రపంచం, ప్రసవానంతరం మహిళ శరీరం మారకూడదని ఆశించడం సిగ్గుచేటని దుయ్యబట్టారు.
ఈ తరహా ట్రోలింగ్ వల్ల ప్రసవానంతరం మహిళలు తీవ్ర మానసిక ఒత్తిడికి లోనయ్యే ప్రమాదం ఉందని, నెటిజన్లు కాస్త సున్నితంగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు. ‘జాదుగాడు’, ‘స్పీడున్నోడు’, ‘ఈడోరకం-ఆడోరకం’ వంటి తెలుగు చిత్రాలతో గుర్తింపు పొందిన సోనారికా వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.