సిద్దిపేట భూముల్లో కాషాయ జెండాలు పాతుతాం: కాంగ్రెస్, బీఆర్ఎస్‌లపై బండి సంజయ్ తీవ్ర ధ్వజం
- భూకబ్జా ఆరోపణలకు ఆధారాలు ఉంటే భూములు స్వాధీనం చేసుకోవాలన్న బండి సంజయ్
- కేసీఆర్ కు పుట్టుకతోనే వందల ఎకరాలు లేవనే విషయం అర్థమవుతోందని వ్యాఖ్య
- కేసీఆర్ గతమంతా అవినీతి, భూదందాలతో నిండిపోయిందని ఆరోపణ
సిద్దిపేట భూముల వ్యవహారంపై తెలంగాణ రాజకీయం మరింత వేడెక్కింది. ఈ వివాదంపై కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కరీంనగర్‌లో మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. భూకబ్జాలకు సంబంధించి నిజంగా ఆధారాలు ఉంటే వెంటనే ఆ భూములను స్వాధీనం చేసుకుని కేసీఆర్ కుటుంబంతో సహా బాధ్యులైన బీఆర్ఎస్ నేతలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సవాల్ విసిరారు. ఆరు గ్యారంటీల అమలు నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే కాంగ్రెస్ ఈ డ్రామాలకు తెరలేపిందని, కేసీఆర్‌తో లాలూచీ పడేందుకే అసెంబ్లీలో ప్రత్యేక విచారణ కమిషన్ వేశారా అని ఎద్దేవా చేశారు.
కేసీఆర్ గతమంతా అక్రమాలు, అవినీతి, భూదందాలతోనే నిండిపోయిందని బండి సంజయ్ ఆరోపించారు. ఎన్నికల అఫిడవిట్లను పరిశీలిస్తే కేసీఆర్ పుట్టుకతోనే వందల ఎకరాల యజమాని కాదనే విషయం స్పష్టమవుతుందన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ ఒకే బాటలో పయనిస్తూ పరస్పర ఆరోపణలతో కాలయాపన చేస్తున్నాయని, ఈ భూదోపిడీపై త్వరలోనే బీజేపీ ఆధ్వర్యంలో ‘దండయాత్ర’ చేపడతామని హెచ్చరించారు. ఆక్రమిత భూముల్లో కాషాయ జెండాలు పాతి పేదలకు పంచుతామని స్పష్టం చేసిన బండి సంజయ్, భవిష్యత్తులో బీజేపీ అధికారంలోకి వస్తే రెండు పార్టీల అవినీతి, భూఆక్రమణలపై కఠిన విచారణ జరిపిస్తామని చెప్పారు.