కేంద్ర సెన్సార్ బోర్డు సభ్యురాలిగా నాగార్జున మేనకోడలు సుప్రియ

కేంద్ర సెన్సార్ బోర్డు సభ్యురాలిగా నాగార్జున మేనకోడలు సుప్రియ

Nagarjunas niece Supriya appointed as Central Censor Board member
  • మూడేళ్ల కాలపరిమితితో 18 మంది సభ్యుల నియామకం
  • ప్రీతి జింటా, సునీల్ శెట్టి, పంకజ్ త్రిపాఠిలకు కూడా చోటు
  • టాలీవుడ్ నుంచి సుప్రియకు ప్రాతినిధ్యం లభించడంపై హర్షం
  • తమిళ పరిశ్రమకు ప్రాతినిధ్యం లేకపోవడంపై విమర్శలు
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత, అన్నపూర్ణ స్టూడియోస్ ప్రతినిధి సుప్రియ యార్లగడ్డకు కేంద్ర ప్రభుత్వంలో కీలక పదవి లభించింది. కేంద్ర సెన్సార్ బోర్డు (సీబీఎఫ్‌సీ) సభ్యురాలిగా ఆమె నియమితులయ్యారు. కేంద్ర ప్రభుత్వం సెన్సార్ బోర్డును పునర్‌వ్యవస్థీకరిస్తూ 18 మంది సభ్యులతో కూడిన నూతన జాబితాను విడుదల చేయగా, తెలుగు చలనచిత్ర పరిశ్రమ నుంచి సుప్రియకు చోటు దక్కింది.

ఈ మేరకు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ సెప్టెంబర్ 16న అధికారిక నోటిఫికేషన్ జారీ చేసింది. సినిమాటోగ్రాఫ్ చట్టం నిబంధనల మేరకు ఈ నియామకాలు చేపట్టినట్లు వెల్లడించింది. నూతన సభ్యుల పదవీకాలం మూడేళ్ల పాటు కొనసాగుతుందని, ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని నోటిఫికేషన్‌లో స్పష్టం చేసింది.

కొత్తగా నియమితులైన వారిలో సుప్రియతో పాటు బాలీవుడ్ నటులు ప్రీతి జింటా, సునీల్ శెట్టి, పంకజ్ త్రిపాఠి, ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్, బెంగాలీ నటుడు ప్రసేన్‌జిత్ ఛటర్జీ, వినోద్ అనుపమ్, మనోజ్ జోషి, అభిషేక్ జైన్, రిక్కీ కేజ్, హన్సరాజ్ హన్స్, యతీంద్ర మిశ్రా, రూపాలీ గంగూలీ, నీల మదబ్ పాండా, పల్లవి జోషి, నిషిగంద వాద్, వామన్ కేండ్రే, రమేశ్ పతంగె వంటి సినీ ప్రముఖులు ఉన్నారు.

అయితే, ఈ నియామకాలపై ప్రస్తుతం మిశ్రమ స్పందనలు వ్యక్తమవుతున్నాయి. దేశంలోని అతిపెద్ద చిత్ర పరిశ్రమల్లో ఒకటైన తమిళ సినీ పరిశ్రమకు తగిన ప్రాతినిధ్యం కల్పించకపోవడంపై సోషల్ మీడియా వేదికగా కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు.
Advertisement
Supriya Yarlagadda
CBFC
Central Board of Film Certification
Annapurna Studios
Nagarjuna niece
Tollywood

More Telugu News