మెగా డీఎస్సీ: కూటమి ప్రభుత్వంపై జగన్ మరోసారి ఫైర్

మెగా డీఎస్సీ: కూటమి ప్రభుత్వంపై జగన్ మరోసారి ఫైర్

Mega DSC Jagan Mohan Reddy fires at Alliance government once again
  • డీఎస్సీ పోస్టింగ్‌లో అక్రమాలు జరిగాయంటూ వైసీపీ అధినేత జగన్ ఆరోపణలు
  • 65 మార్కుల నుంచి 77 మార్కులకు మారిన వైనంపై సందేహాలు
  • అర్హత లేని టెట్ పేపర్‌తో ఉద్యోగం ఇచ్చారని విమర్శ
  • ఈ స్కాంపై చంద్రబాబు నైతిక బాధ్యత వహించాలని డిమాండ్
టీడీపీ ప్రభుత్వం చేపట్టిన మెగా డీఎస్సీ నియామక ప్రక్రియలో భారీ స్కాం జరిగిందంటూ వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ ఆరోపిస్తుండడం తెలిసిందే. దీనిపై ఆయన సోషల్ మీడియా వేదికగా మరోసారి ధ్వజమెత్తారు. ఓ అభ్యర్థి విషయంలో జరిగింది సరైన, పారదర్శక విధానమేనా? అని ముఖ్యమంత్రి చంద్రబాబును నిలదీశారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా పలు ప్రశ్నలు సంధించారు.

జగన్ తన పోస్టులో పేర్కొన్న వివరాల ప్రకారం, ఒక అభ్యర్థికి 65 టెట్ మార్కులతో, ఏడు దశల వెరిఫికేషన్ తర్వాత ఉద్యోగం కేటాయించారు. అయితే, ఆ తర్వాత అదే అభ్యర్థి అనర్హుడని డీఈవో నిర్ధారించారని తెలిపారు. అలాంటప్పుడు ఆ ఏడు దశల వెరిఫికేషన్‌లో ఏం జరిగిందని ప్రశ్నించారు. తనకు ఉద్యోగం ఎలా వచ్చిందో తెలియదని అభ్యర్థే చెప్పిన విషయాన్ని కూడా జగన్ ప్రస్తావించారు.

విమర్శలు వెల్లువెత్తిన తర్వాత, ఆ అభ్యర్థికి 2018 టెట్‌లో 77 మార్కులు వచ్చాయని అధికారులు చెప్పడంపై జగన్ సందేహాలు లేవనెత్తారు. ఆ మార్కులు ముందే ఉంటే, డీఈవో ఎందుకు అనర్హుడని ప్రకటించారని ప్రశ్నించారు. అంతేకాకుండా, ఆ 77 మార్కులు ఎస్‌జీటీ పోస్టుకు అవసరమైన పేపర్-I-Aకు బదులుగా, స్కూల్ అసిస్టెంట్ స్పెషల్ ఎడ్యుకేషన్‌కు సంబంధించిన పేపర్-II-Bలో వచ్చాయని, అయినా ఎలా అర్హత కల్పించారని నిలదీశారు.

2018 టెట్ స్కోర్‌తోనే ఉద్యోగానికి అర్హత ఉంటే, ఆ అభ్యర్థి 2025లో మళ్లీ టెట్ ఎందుకు రాశారని జగన్ ప్రశ్నించారు. ఇన్ని మలుపుల తర్వాత ఈ నియామక ప్రక్రియను పారదర్శకంగా జరిగిందని చెప్పగలరా? అని అన్నారు. ఇది డీఎస్సీ స్కామ్‌ను ప్రోత్సహించడం కాదా? అని ప్రశ్నిస్తూ, దీనికి చంద్రబాబు నైతిక బాధ్యత వహించాలని జగన్ డిమాండ్ చేశారు.
Advertisement
YS Jagan Mohan Reddy
Mega DSC Scam Allegations
Chandrababu Naidu
Andhra Pradesh Teacher Recruitment
TET Marks Controversy
AP Alliance Government

More Telugu News