కార్తీ కథానాయకుడిగా గతంలో వచ్చిన 'సర్దార్' హిట్ టాక్ తెచ్చుకుంది. అప్పటి నుంచి సీక్వెల్ కి సంబంధించిన వార్తలు ఊరిస్తూనే వచ్చాయి. 2022లో విడుదలైన ఆ సినిమాకి ఇంతకాలానికి సీక్వెల్ కుదిరింది. 'సర్దార్ 2' పేరుతో ఈ సినిమాను నిర్మించారు. ఆషికా రంగనాథ్ .. రజీషా విజయన్ .. మాళవిక మోహనన్ కథానాయికలుగా నటించిన ఈ సినిమా, ఈ రోజు (సెప్టెంబర్ 10)న థియేటర్లలో విడుదలైంది. స్పై యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాకి, పీఎస్ మిత్రన్ దర్శకత్వం వహించాడు.
1981లో జపాన్ కి సంబందించిన ఒక కాప్సిల్ ఇండియాలో ఉండిపోతుంది. అది ఒక భయంకరమైన బయో వెపన్. అడవీ ప్రాంతంలో వదిలివేయబడిన ఆ కాప్సిల్ నుంచి విషవాయువు లీక్ అవుతూ ఉంటుంది. దాంతో అడవిని నమ్ముకుని జీవిస్తున్న వారంతా చిత్రమైన వ్యాధితో బాధపడుతూ చనిపోతూ ఉంటారు. ఆ కాప్సిల్ ను యాక్టివేట్ చేయాలన్నా .. డీ యాక్టివేట్ చేయాలన్నా మూడు తాళాలు అవసరమవుతాయి. ఆ మూడు తాళాలు గతంలో 'రా'లో పనిచేసిన వాల్ రస్ .. జారా .. ఏజెంట్ టైగర్ దగ్గర ఉంటాయి. ఆ కాప్సిల్ ను ఓపెన్ చేయాలంటే, ఈ మూడు కీస్ ను ఒకేసారి ఉపయోగించవలసి ఉంటుంది.
'రా' టీమ్ కి సహకరిస్తూ వస్తున్న సర్దార్, అడవిలోని గిరిజనులను చూసి చలించిపోతాడు. ఆ బయో వెపన్ కి నుంచి వెలువడుతున్న విషవాయువుల వలన వస్తున్న జబ్బులకు విరుగుడు కూడా జపాన్ దగ్గరే ఉందని తెలుసుకుంటాడు. ఆ మెడిసిన్ ను దక్కించుకోవాలని అనుకుంటాడు. ఇండియా మీదుగా తరలించబడుతున్న ఆ మెడిసిన్ కి సంబంధించిన బాక్సులను, ఇండియాలోనే ఆపేసి గిరిజనుల కోసం ఉపయోగించాలని నిర్ణయించుకుంటాడు.
అయితే వాళ్లు చేపట్టిన 'ఆపరేషన్ డోకు' అసంపూర్తిగా ఆగిపోతుంది. సర్దార్ ఏమైపోయాడనేది ఎవరికీ తెలియదు. కాప్సిల్ కి సంబంధించిన తాళాలు కలిగిన వాల్ రస్ ఒక దాడిలో చనిపోతాడు .. 'జారా' కూడా చనిపోయిందనే వార్తలు వస్తాయి. ఇక ఏజెంట్ టైగర్ మాఫియా ముఠా నాయకుడైన 'బ్లాక్ డాగర్' (ఎస్ జె సూర్య) చేతికి బందీగా చిక్కుతాడు. ఏజెంట్ టైగర్ దగ్గరున్న ఒక 'కీ'ని బ్లాక్ డాగర్ సొంతం చేసుకుంటాడు. మిగతా రెండు 'కీస్' కోసం అతను ప్రయాత్నిస్తూ ఉంటాడు. జపాన్ కాప్సిల్ ను యాక్టివేట్ చేసి,దేశాన్ని నాశనం చేయాలనేది అతని ప్లాన్.
'సర్దార్' కొడుకైన విజయ్ ( కార్తీ) తన తండ్రి జాడ తెలుసుకునే ప్రయత్నాన్ని ప్రారంభిస్తాడు. ఆ సమయంలోనే అతనికి 'మిషన్ డోకు' గురించిన విషయం తెలుస్తుంది. ఆ ఆపరేషన్ విషయంలో తన తండ్రి ఎందుకు విఫలమయ్యాడనేది తెలుసుకుని దానిని పూర్తి చేయాలని భావిస్తాడు. అందుకోసం అతను ఏం చేస్తాడు? ఆ ప్రయత్నంలో అతనికి ఎలాంటి సవాళ్లు ఎదురవుతాయి? అసలు బ్లాక్ డాగర్ ఎవరు? బయో వెపన్ ద్వారా అందరి నాశనాన్ని అతను ఎందుకు కోరుకుంటున్నాడు? అనేది మిగతా కథ.
క్షణాల్లో మానవాళిని అంతం చేసే ఒక బయో వెపన్, ఒక అటవీ ప్రాంతంలో ఉంటుంది. జపాన్ కి చెందిన ఆ కాప్సిల్ నుంచి విషవాయువులు లీక్ అవుతూ ఉంటాయి. ఆ కాప్సిల్ ను యాక్టివేట్ చేసి అందరినీ నాశనం చేయాలనేది విలన్ కి గల బలమైన కోరిక. ఆ కాప్సిల్ ను డీయాక్టివేట్ చేసి అందరి ప్రాణాలను కాపాడలనేది 'సర్దార్' ఆలోచన. అందుకోసం రెండు వైపుల నుంచి సాగే పోరాటమే ఈ సినిమా.
విజయ్ తన తండ్రి కోసం అన్వేషణ మొదలుపెట్టడం, తన తండ్రి ఆశయాన్ని ముందుకు తీసుకువెళ్లాలనే నిర్ణయానికి రావడం వంటి సన్నివేశాలతో ఫస్టాఫ్ నడుస్తుంది. విలన్ నేపథ్యం ఏమిటి? మానవాళికి చెడు జరగాలని అతను ఎందుకు కోరుకుంటున్నాడు? అనే సందేహాలకు తెరదించడంతో ఇంటర్వెల్ బ్యాంగ్ పడుతుంది. ఇక ఆ తర్వాత హీరో - విలన్ తలపడే సన్నివేశాలతో సెకండాఫ్ కొనసాగుతుంది.
ఈ మొత్తం కథలో ఒక మూడు అంశాలు కీలకమైనవిగా కనిపిస్తూ ఆసక్తిని పెంచుతాయి. తన తండ్రి 'సర్దార్' ఆచూకీ తెలుసుకోవడం కోసం విజయ్ ప్రయత్నాలు చేస్తుండటం. కాప్సిల్ ను ఓపెన్ చేయడానికి అవసరమైన మూడు కీస్ ఎవరెవరి దగ్గర ఉన్నాయనేది తెలుసుకోవడం .. అవి విలన్ చేతికి దొరక్కుండా చేయడం. ఈ మూడు అంశాల చుట్టూనే ఈ కథ తిరుగుతూ ఉంటుంది. ఈ అంశాలు ఆసక్తికరంగానే అనిపిస్తాయి. కాకపోతే అందుకు సంబంధించిన సన్నివేశాల ఆవిష్కరణ ఆ స్థాయిలో లేకపోవడం నిరాశను కలిగిస్తాయి.
హీరో - విలన్ .. బయో వెపన్ చుట్టూ అల్లుకున్న సన్నివేశాలు అంతగా ఉత్కంఠను రేకేత్తించలేకపోయాయి. భారీతనం గురించిన ఆలోచన చేశారే తప్ప, బలమైన సన్నివేశాలకు సంబంధించిన కసరత్తు చేయలేకపోయారని అనిపిస్తుంది. ఎక్కువగా యాక్షన్ సన్నివేశాలపైనే ఫోకస్ పెడుతూ, వినోదపరమైన అంశాలను పూర్తిగా వదిలేశారు. అందుకే యోగిబాబు పాత్ర మనకి నామమాత్రంగా కనిపిస్తుంది.
ఇక కాప్సిల్ వెదజల్లే విషవాయువులు .. విరుగుడు మందుకి సంబంధించిన విషయాలను ప్రస్తావిస్తూ, ప్లాస్టిక్ వాటర్ బాటిల్ లో నీళ్లు .. యాంటిబయాటిక్ మాత్రలను ఎక్కువగా వాడటం .. అందువలన కలిగే దుష్ఫలితాలపై విలన్ ఇచ్చే క్లాస్ ఆడియన్స్ ఓపికకు పరీక్ష పెడుతుంది. తెరపై భారీ యాక్షన్ సీన్లు పడుతూ ఉంటాయి. కానీ అందుకు తగిన ఎమోషనల్ సీన్స్ ను రాసుకోలేకపోయారు . రాసుకున్నవి కనెక్ట్ చేయలేకపోయారు.
విమానాలు .. కేబుల్ కార్లు .. సొరంగ మార్గాలు అంటూ నానా హడావిడి చేశారు. అయినా ఎక్కడా ఎమోషన్ ను టచ్ చేయలేకపోయారు. చివరికి వచ్చేసరికి దసరా నవరాత్రులు .. మైసూర్ ఉత్సవాలు అంటూ క్లైమాక్స్ కి మరింత భారీతనం తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అయితే ఆ సన్నివేశాలు కూడా ఆడియన్స్ ఎక్స్ ప్రెషన్స్ ను మార్చలేకపోయాయి. చివరికి గతంలో వచ్చిన 'సర్దార్'కి దగ్గరలో కూడా లేకుండా, ఒక రొటీన్ స్పై యాక్షన్ థ్రిల్లర్ గానే ఈ సినిమా మిగిలిపోయేలా చేశాయని చెప్పచ్చు.
తండ్రీ కొడుకులుగా కార్తీ నటన .. ఎస్ జె సూర్య విలనిజంలో కనిపించే 'అతి' మామూలే. ఇక ఆషికా రంగనాథ్ తెరపై కనిపించింది అంతే. రజీషా విజయన్ పాత్ర కూడా నామమాత్రమే. ఈ ఇద్దరి మీద మాళవిక మోహనన్ పాత్ర కాస్త బెటర్. వయసు పై బడిన గెటప్ మాత్రం కుదరలేదు. జార్జ్ విలియమ్స్ ఫొటోగ్రఫీ .. సామ్ సీఎస్ నేపథ్య సంగీతం ఫరవాలేదు. విజయ్ వేల్ కుట్టి ఎడిటింగ్ ఓ మాదిరిగా అనిపిస్తుంది.
ఆడియన్స్ ను వెయిటింగులో పెట్టి పెట్టి, 'సర్దార్' చాలా ఆలస్యంగా తెరపైకి వస్తాడు. అప్పటివరకూ ఆయన కొడుకు చేసింది .. ఆ తరువాత కొడుకుతో కలిసి ఆయన చేసింది కూడా రొటీన్ కి భిన్నంగా ఏమీ ఉండదు. ఫైటింగులు గట్టిగానే ఉన్నాయి గానీ, ఎమోషన్స్ కనెక్ట్ కాకపోవడం వలన, ఆడియన్స్ వాటిని విన్యాసాలుగానే చూస్తూ కూర్చున్నారు అంతే.
'సర్దార్ 2' - మూవీ రివ్యూ!
Sardar 2 Review
Movie Details
Movie Name: Sardar 2
Genre: Action
Release Date: 2026-09-10
Cast: Karthi, S J Suryah, Malavika Mohanan, Ashika Ranganath, Rajisha Vijayan
Director: P S Mithran
PRO: -
Music: Sam C S
Banner: Prince Pictures
Review By: Peddinti
Disclaimer:
This review is based on the reviewer’s individual perspective. Audience opinions may vary.
Trailer