పాక్‌లో నిరుద్యోగం, పేదరికం విలయం.. బలూచిస్థాన్‌లో దయనీయ స్థితి

పాక్‌లో నిరుద్యోగం, పేదరికం విలయం.. బలూచిస్థాన్‌లో దయనీయ స్థితి

Pakistan unemployment and poverty crisis Balochistan in miserable condition
  • 2026 ఆర్థిక సంవత్సరంలో పాకిస్థాన్‌లో తీవ్రమైన ఆర్థిక సంక్షోభం
  • గతేడాది 21.9శాతం ఉన్న పేదరికం ఈసారి 28.9 శాతానికి పెరుగుదల
  • నిరుద్యోగుల సంఖ్య 45 లక్షల నుంచి 59 లక్షలకు చేరినట్టు వెల్లడి
  • సంక్షేమ పథకాలకు భారీ కేటాయింపులు చేసినా ఫలితం శూన్యం
  • బలూచిస్థాన్‌లో 47 శాతంతో అత్యధిక పేదరికం నమోదు
పొరుగు దేశం పాకిస్థాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. ప్రభుత్వం సంక్షేమ పథకాలపై భారీగా ఖర్చు చేస్తున్నప్పటికీ, 2026 ఆర్థిక సంవత్సరంలో పేదరికం, నిరుద్యోగం రికార్డు స్థాయిలో పెరిగాయని ఒక నివేదిక వెల్లడించింది. కుటుంబాలపై ఆర్థిక ఒత్తిడి విపరీతంగా పెరిగిపోయిందని, ప్రజల జీవనం దుర్భరంగా మారిందని ఆ నివేదిక స్పష్టం చేసింది.

పాకిస్థాన్ ఎకనామిక్ సర్వే 2025-26ను ఉటంకిస్తూ 'ది ఫ్రైడే టైమ్స్' ప్రచురించిన కథనం ప్రకారం.. గత ఆర్థిక సంవత్సరంలో 21.9 శాతంగా ఉన్న జాతీయ పేదరికం రేటు, ఈ ఏడాది 28.9 శాతానికి భారీగా పెరిగింది. దేశంలోని అన్ని ప్రధాన రాష్ట్రాల్లోనూ పరిస్థితి మరింత దిగజారినట్టు గణాంకాలు చెబుతున్నాయి. పంజాబ్ ప్రావిన్స్‌లో పేదరికం 16.5శాతం నుంచి 23.3శాతానికి పెరిగింది. సింధ్‌లో 24.5శాతం నుంచి 32.6శాతానికి, ఖైబర్ పఖ్తుంఖ్వాలో 28.7శాతం నుంచి 35.3శాతానికి ఎగబాకింది. దేశంలోనే అత్యంత పేద ప్రావిన్స్‌గా ఉన్న బలూచిస్థాన్‌లో పేదరికం 41.8శాతం నుంచి 47 శాతానికి చేరింది.

పేదరికంతో పాటు నిరుద్యోగం కూడా తీవ్రస్థాయికి చేరింది. గత ఏడాది 45 లక్షలుగా ఉన్న నిరుద్యోగుల సంఖ్య, ఈ ఏడాది 59 లక్షలకు పెరిగింది. నిరుద్యోగిత రేటు 6.3శాతం నుంచి 7.1శాతానికి పెరిగినట్టు నివేదిక పేర్కొంది. ఉపాధి అవకాశాలు కల్పించడంలో, ప్రజల ఆదాయాలు పెంచడంలో ప్రభుత్వం విఫలమవుతోందనడానికి ఈ గణాంకాలే నిదర్శనం.

ప్రభుత్వం తన ప్రధాన సామాజిక భద్రతా పథకమైన 'బెనజీర్ ఇన్‌కం సపోర్ట్ ప్రోగ్రామ్' (బీఐఎస్‌పీ) కోసం ఈ ఆర్థిక సంవత్సరంలో 722.9 బిలియన్ల పాకిస్థానీ రూపాయ‌లు (రూ.24,773కోట్లు) కేటాయించింది. ఇందులో ఇప్పటికే 540.27 బిలియన్ల పాకిస్థానీ రూపాయ‌లు (రూ.18,466కోట్లు) విడుదల చేసింది. ఈ పథకం కింద పేద కుటుంబాలకు నగదు బదిలీ చేస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి మెరుగుపడటం లేదు.

కేవలం నగదు బదిలీ పథకాలతో పేదరికాన్ని నిర్మూలించడం సాధ్యం కాదని నివేదిక స్పష్టం చేసింది. ఉద్యోగాల కల్పన, విద్య-నైపుణ్యాభివృద్ధిలో పెట్టుబడులు, మెరుగైన ఆరోగ్య సంరక్షణ, గ్రామీణ పారిశ్రామికీకరణ, చిన్న తరహా పరిశ్రమల ప్రోత్సాహం వంటి చర్యలు తీసుకుంటేనే దీర్ఘకాలిక ప్రయోజనాలు ఉంటాయని సూచించింది. కార్మిక మార్కెట్ అవసరాలకు అనుగుణంగా విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురావడం ద్వారా సంక్షేమ పథకాలపై ఆధారపడటాన్ని తగ్గించవచ్చని నిపుణులు అభిప్రాయపడ్డారు.
Advertisement
Pakistan
Pakistan Economic Crisis
Balochistan Poverty
Pakistan Unemployment Rate
Benazir Income Support Programme
Pakistan Economic Survey

More Telugu News