తిరుమల భక్తులకు ఇకపై రూ.10 లక్షల బీమా

తిరుమల భక్తులకు ఇకపై రూ.10 లక్షల బీమా

TTD increases insurance for Tirumala devotees to 10 lakh rupees
  • భక్తుల ప్రమాద బీమా రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంపు
  • సహజ మరణానికి రూ.2 లక్షల బీమా
  • బీమా పథకానికి ఎల్‌ఐసీకి రూ.2.12 కోట్ల ప్రీమియం చెల్లింపు
  • లడ్డూ తయారీకి 400 అదనపు పోస్టులకు ప్రతిపాదనలు
  • ఆహార వ్యర్థాలతో బయోగ్యాస్‌ తయారీకి ప్లాంట్‌
శ్రీవారి దర్శనానికి వచ్చి ప్రమాదవశాత్తూ మరణించే భక్తుల కుటుంబాలకు అందించే బీమా మొత్తాన్ని రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచాలని ‘తిరుమల తిరుపతి దేవస్థానం’ (టీటీడీ) బోర్డు నిర్ణయించింది. సహజ మరణం సంభవించినా రూ.2 లక్షలు అందించేలా గ్రూప్‌ ఇన్సూరెన్స్‌ పథకాన్ని అమలు చేయనుంది. దేశంలోనే తొలిసారిగా ఎల్‌ఐసీ ద్వారా ఈ సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు టీటీడీ వెల్లడించింది.

తిరుమలలో జరిగిన పాలకమండలి సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు. అనంతరం టీటీడీ ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు వివరాలను వెల్లడించారు. భక్తులు, ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తూ పలు నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు. బీమా పథకం అమలుకు టీటీడీ నిధుల నుంచి ఎల్‌ఐసీకి రూ.2.12 కోట్లు చెల్లించేందుకు ఆమోదం తెలిపినట్లు చెప్పారు.

సీపీఎస్‌, ఎన్‌పీఎస్‌ పెన్షనర్లు, వారి కుటుంబాలకు ఈహెచ్‌ఎఫ్‌ సౌకర్యం కల్పించేందుకు రూ.2 కోట్ల యాజమాన్య వాటాకు ఆమోదం తెలిపారు. టీటీడీలోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న 48 మంది ఉద్యోగుల వేతనాలు పెంచాలని నిర్ణయించారు. శ్రీవారి పోటులో లడ్డూల తయారీ వేగం పెంచేందుకు 400 అదనపు అవుట్‌సోర్సింగ్‌ పోస్టుల భర్తీకి ప్రభుత్వ అనుమతి కోరుతూ ప్రతిపాదనలు పంపనున్నారు.

తిరుమలలోని అన్నప్రసాద కేంద్రం, క్యాంటీన్లు, హోటళ్ల నుంచి వచ్చే ఆహార వ్యర్థాలతో బయోగ్యాస్‌ తయారు చేయనున్నారు. ఇందుకోసం ప్లాంట్‌ నిర్వహణ బాధ్యతలను రూ.2.80 కోట్లతో జీపీఎస్‌ రెన్యువబుల్స్‌కు అప్పగించేందుకు ఆమోదం తెలిపారు. పారిశుద్ధ్య సిబ్బందికి రవాణా ఛార్జీల కోసం మూడేళ్లకు రూ.1.60 కోట్లు కేటాయించారు.

నారాయణవనం ఆలయంలో అమ్మవారి పద్మపీఠానికి బంగారు తాపడం చేయాలని నిర్ణయించారు. చెన్నైలోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ ధ్వజస్తంభం, బలిపీఠానికి బంగారు తాపడం కోసం రూ.17.05 కోట్లకు ఆమోదం తెలిపారు. 

తిరుపతిలోని తెలుగు, సంస్కృత అకాడమీకి కేటాయించిన టీటీడీ భవనం లైసెన్స్‌ గడువును మరో మూడేళ్లు పొడిగించారు. తిరుపతి మున్సిపల్‌ కార్పొరేషన్‌కు ఆమోదించిన రూ.49 కోట్ల ఆర్థిక సహాయంలో రెండో విడతగా రూ.7.56 కోట్లు విడుదల చేయాలని నిర్ణయించారు.
Advertisement
Tirumala Tirupati Devasthanams
TTD Insurance Scheme
BR Naidu
Tirupati Laddu
LIC Insurance for Devotees
Tirumala Temple News

More Telugu News