మ‌ళ్లీ అదే సెంటిమెంట్‌తో... జగన్ పాదయాత్ర 2.Oకు ముహూర్తం ఖరారు

మ‌ళ్లీ అదే సెంటిమెంట్‌తో... జగన్ పాదయాత్ర 2.Oకు ముహూర్తం ఖరారు

YS Jagan Mohan Reddy targets 2029 elections and fixes date for Padayatra 2-0
  • మరోసారి సుదీర్ఘ పాదయాత్రకు సిద్ధమైన వైఎస్ జగన్
  • 2027 సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో యాత్ర ప్రారంభం
  • బాపట్ల జిల్లా పర్చూరు కార్యకర్తల సమావేశంలో ప్రకటన
  • 2029 ఎన్నికలే లక్ష్యంగా రెండో విడత యాత్రకు వ్యూహరచన
  • 'ప్రజా సంకల్ప యాత్ర' సెంటిమెంట్‌నే మళ్లీ ఫాలో అవుతున్న జగన్
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోసారి సుదీర్ఘ పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. 2029 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రజల్లోకి వెళ్లేందుకు ఆయన ప్రణాళికలు రచిస్తున్నారు. ఇందులో భాగంగా తాను చేపట్టబోయే రెండో విడత పాదయాత్రకు ముహూర్తం ఖరారు చేశారు. 2027 సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో తన పాదయాత్ర ప్రారంభమవుతుందని స్పష్టత ఇచ్చారు. నేడు బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గ వైసీపీ కార్యకర్తల సమావేశంలో జగన్ ఈ కీలక ప్రకటన చేశారు.

గతంలో అధికారం కోసం జగన్ ఇదే ఫార్ములాను అనుసరించిన విషయం తెలిసిందే. 2017 నవంబర్ 6న కడప జిల్లా ఇడుపులపాయలో 'ప్రజా సంకల్ప యాత్ర' పేరుతో ఆయన తన తొలి పాదయాత్రను ప్రారంభించారు. ఆ యాత్ర 341 రోజుల పాటు ఏకధాటిగా సాగి, 3,648 కిలోమీటర్ల దూరం కొనసాగింది. 2019 జనవరి 9న శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో యాత్ర ముగిసింది.

ఈ యాత్రలో భాగంగానే ఆయన 'నవరత్నాలు' పథకాలను ప్రకటించారు. ప్రజల నుంచి వచ్చిన అపూర్వ స్పందన, యాత్రలో తెలుసుకున్న సమస్యల ఆధారంగా రూపొందించిన ఈ హామీలు 2019 ఎన్నికల్లో వైసీపీకి చారిత్రాత్మక విజయాన్ని అందించాయి.

మళ్లీ అదే సెంటిమెంట్‌తో 2029 ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా జగన్ ఈ రెండో పాదయాత్రకు సిద్ధమయ్యారు. 2027లో యాత్ర ప్రారంభించి, ఎన్నికల వరకు దాదాపు రెండేళ్ల పాటు ప్రజల మధ్యే ఉండాలని ఆయన భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ యాత్ర ద్వారా ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకోవడంతో పాటు ప్రస్తుత కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని జగన్ వ్యూహరచన చేస్తున్నారు. 

త్వరలోనే ఈ పాదయాత్రకు సంబంధించిన పూర్తి షెడ్యూల్, రూట్‌మ్యాప్‌పై స్పష్టత రానుంది. మొత్తం మీద 2029 ఎన్నికల సమరానికి జగన్ ఇప్పటినుంచే 'పాదయాత్ర 2.O'తో సిద్ధమవుతున్న సంకేతాలు పంపారు.
Advertisement
YS Jagan Mohan Reddy
Padayatra 2-0
YSRCP
2029 Andhra Pradesh Elections
Andhra Pradesh Politics
Praja Sankalpa Yatra

More Telugu News