ప్రసంగం మధ్యలో ఫిలిప్పీన్స్‌ మంత్రికి చైనా స్లిప్‌.. తర్వాత షాకింగ్‌ ఘటన!

ప్రసంగం మధ్యలో ఫిలిప్పీన్స్‌ మంత్రికి చైనా స్లిప్‌.. తర్వాత షాకింగ్‌ ఘటన!

Philippines Minister handed Chinese note during speech followed by shocking incident
  • సియోల్‌ డిఫెన్స్‌ డైలాగ్‌లో చైనా తీరుపై టియోడోరో మండిపాటు
  • ప్రసంగం మధ్యలో ఆయనకు నోట్‌ రూపంలో అందిన చైనా వైఖరి
  • 2016 తీర్పును చైనా అంగీకరించదని నోట్‌లో పేర్కొన్న వైనం
  • నోట్‌ ఇవ్వడాన్ని టియోడోరో బెదిరింపులు, దౌర్జన్యంగా అభివర్ణన
  • దక్షిణ కొరియా సదస్సు నిర్వాహకుల్ని చైనా గౌరవించాలని హితవు
అంతర్జాతీయ వేదికపై చైనా తీరుపై ఫిలిప్పీన్స్‌ రక్షణ మంత్రి గిల్బర్టో సి. టియోడోరో తీవ్రంగా మండిపడ్డారు. దక్షిణ చైనా సముద్రంపై బీజింగ్‌ వైఖరిని వివరిస్తూ ఓ వ్యక్తి తనకు నోట్‌ అందించడాన్ని ఆయన బహిరంగంగానే ప్రశ్నించారు. ఇది బెదిరింపు, దౌర్జన్యం, దాడి చేయడంతో సమానమని వ్యాఖ్యానించారు.

దక్షిణ కొరియాలో జరుగుతున్న సియోల్‌ డిఫెన్స్‌ డైలాగ్‌ 2026లో టియోడోరో ప్రసంగిస్తున్నారు. ఆ సమయంలో తెల్ల కోటు ధరించిన ఓ వ్యక్తి ఆయన వద్దకు వచ్చి టేబుల్‌పై ఓ కాగితం పెట్టాడు. అది చైనా తరఫున వచ్చిన నోట్‌ అని భావించిన టియోడోరో.. సభను ఉద్దేశించి ‘‘దీన్ని చదవాలా?’’ అని అడిగారు.

ఆ నోట్‌లో దక్షిణ చైనా సముద్రంపై చైనా అధికారిక వైఖరిని పేర్కొన్నారు. 2016లో ఫిలిప్పీన్స్‌కు అనుకూలంగా వచ్చిన అంతర్జాతీయ మధ్యవర్తిత్వ తీర్పును చైనా అంగీకరించదని అందులో స్పష్టం చేశారు. ఆ తీర్పు అంతర్జాతీయ చట్టానికి విరుద్ధమని, చెల్లుబాటు కాదని చైనా పేర్కొంటున్నట్లు టియోడోరో చదివి వినిపించారు.

అనంతరం ఆయన చైనా తీరును తీవ్రంగా తప్పుబట్టారు. తాను ఒక ప్రశ్నకు సమాధానం ఇస్తున్న సమయంలో ఇలాంటి నోట్‌ ఇవ్వడం సరైనదేనా? అని ప్రశ్నించారు. అంతర్జాతీయ వేదికపై నిర్వాహక దేశమైన దక్షిణ కొరియాను, అక్కడి ప్రేక్షకులను గౌరవించాల్సిన బాధ్యత ఉందని అన్నారు.

‘‘ఇది బెదిరింపు, దౌర్జన్యం, దాడి కిందకే వస్తుంది. చైనా కనీస మర్యాద, ప్రవర్తన నేర్చుకోవాలి’’ అని టియోడోరో ఘాటు వ్యాఖ్యలు చేశారు. నోట్‌ అందించిన వ్యక్తిని ఉద్దేశించి.. ఈ కాగితాన్ని చైనా ఎంత నిరాశలో ఉందో గుర్తు చేసే జ్ఞాపకంగా ఉంచుకుంటానని చెప్పారు.

దక్షిణ చైనా సముద్రంలో ఫిలిప్పీన్స్‌ ప్రతిరోజూ చైనా నుంచి సవాళ్లు ఎదుర్కొంటోందని టియోడోరో తెలిపారు. తమ ప్రత్యేక ఎకానమిక్‌ జోన్‌లోకి చైనా అక్రమంగా చొరబడేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఈ ఒత్తిళ్లను ఎదుర్కొనేందుకు ఫిలిప్పీన్స్‌ భద్రతా భాగస్వామ్యాలను బలోపేతం చేసుకుంటోందన్నారు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఫిలిప్పీన్స్‌ రక్షణ శాఖ తన అధికారిక ‘ఎక్స్‌’ ఖాతాలో పోస్ట్‌ చేసింది. దక్షిణ చైనా సముద్రం విషయంలో చైనా, ఫిలిప్పీన్స్‌ మధ్య చాలాకాలంగా ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి.
Advertisement
Gilberto Teodoro
Philippines Defense Minister
South China Sea Dispute
China Philippines Tensions
Seoul Defense Dialogue
International Law

More Telugu News