బంగ్లాదేశ్‌లో హిందువులపై మళ్లీ అఘాయిత్యాలు.. ఇద్దరి దారుణ హత్య

బంగ్లాదేశ్‌లో హిందువులపై మళ్లీ అఘాయిత్యాలు.. ఇద్దరి దారుణ హత్య

Two Hindus killed as attacks on minorities continue in Bangladesh
  • బంగ్లాదేశ్‌లో వేర్వేరు ఘటనల్లో ఇద్దరు హిందువులు హత్య
  • నౌగావ్‌లో స్వర్ణకారుడు అలీఫ్‌ చంద్ర దత్తాపై దుండగుల దాడి
  • దత్తా వద్ద నుంచి బంగారం, నగదు దోపిడీ
  • కాక్స్‌బజార్‌లో రాణి సుశీల్‌ను ఇంట్లోనే కత్తితో పొడిచిన దుండగుడు
  • దొంగతనానికి వచ్చిన వ్యక్తే దాడి చేసినట్లు పోలీసుల నిర్ధారణ
బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై దాడులు ఆందోళనకరంగా మారుతున్న వేళ.. వేర్వేరు ఘటనల్లో ఇద్దరు హిందువులు దారుణ హత్యకు గురయ్యారు. మృతుల్లో ఓ మహిళ కూడా ఉంది. తాజా ఘటనలతో హిందూ మైనారిటీల భద్రతపై మరోసారి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

నౌగావ్‌ జిల్లా మహాదేవ్‌పూర్‌లో 45 ఏళ్ల హిందూ స్వర్ణకారుడు అలీఫ్‌ చంద్ర దత్తా హత్యకు గురయ్యాడు. సోమవారం రాత్రి 8.30 గంటలకు మహాదేవ్‌పూర్‌ బజార్‌లోని తన నగల దుకాణం నుంచి ఇంటికి బయలుదేరాడు. రాత్రి 9 గంటల సమయంలో దులాల్‌పారా ప్రాంతంలోకి రాగానే కొందరు దుండగులు అతడిని అడ్డుకున్నారు. పదునైన ఆయుధంతో దాడి చేశారు. అనంతరం అతడి వద్ద ఉన్న బంగారం, 7 లక్షల బంగ్లాదేశీ టాకాలను దోచుకుని పారిపోయారు.

తీవ్రంగా గాయపడిన దత్తాను కుటుంబ సభ్యులు, స్థానికులు రాజ్‌షాహీ మెడికల్‌ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ దత్తా మృతి చెందారు. ఇది కేవలం దోపిడీ ఘటననా? మరేదైనా కక్ష ఉందా? అన్నది ఇంకా తేలలేదని మహాదేవ్‌పూర్‌ పోలీస్‌ స్టేషన్‌ ఓసీ ఒమర్‌ ఫరూక్‌ తెలిపారు. దర్యాప్తు కొనసాగుతోందన్నారు.

కాక్స్‌బజార్‌ జిల్లా మహేశ్‌ఖాలీ ఉపజిల్లాలో 45 ఏళ్ల హిందూ మహిళ రాణి సుశీల్‌ హత్యకు గురైంది. సోమవారం రాత్రి 7.30 గంటల సమయంలో హోనాక్‌ యూనియన్‌లోని తన ఇంట్లో ఆమె వంట చేస్తోంది. దొంగతనం కోసం ఓ గుర్తుతెలియని వ్యక్తి ఇంట్లోకి చొరబడేందుకు ప్రయత్నించాడు. అతడిని గమనించిన రాణి కేకలు వేయడంతో ఆమె ముఖాన్ని పట్టుకుని పలుమార్లు కత్తితో పొడిచి పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన ఆమెను చకారియా ఆసుపత్రికి తరలించారు. కొద్దిసేపటి తర్వాత మృతిచెందినట్లు వైద్యులు ప్రకటించారు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

ఈ ఘటనలకు కొన్ని రోజుల ముందే రంగ్‌పూర్‌లో రిటైర్డ్‌ హిందూ ఉపాధ్యాయుడు గణపతి చక్రవర్తి, ఆయన కుటుంబంలోని మరో ముగ్గురు హత్యకు గురయ్యారు. బంగ్లాదేశ్‌లో హిందువులతో పాటు ఇతర మైనారిటీలపై దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో తాజా హత్యలు మరింత కలకలం రేపుతున్నాయి.
Advertisement
Bangladesh Hindus
Alif Chandra Dutta
Rani Sushil
Minority attacks Bangladesh
Naogaon murder case
Coxs Bazar violence

More Telugu News