తిరుపతి యూనివర్సిటీ కల నెరవేరింది.. ఇక వైజాగ్, గుంటూరులో కాలేజీలు పెట్టాలి: మల్లారెడ్డి
- తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మల్లారెడ్డి
- యూనివర్సిటీకి పర్మిషన్ రావడంతో మొక్కు చెల్లించుకునేందుకు వచ్చానన్న మల్లారెడ్డి
- తాను ఏది అడిగినా స్వామివారు అనుగ్రహిస్తున్నారని వ్యాఖ్య
తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ సీనియర్ నేత మల్లారెడ్డి ఈరోజు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తన 74వ పుట్టినరోజు సందర్భంగా శ్రీవారికి చేసుకున్న ఒక ప్రత్యేక మొక్కు తీరడంతో స్వామివారి దర్శనానికి వచ్చినట్లు ఆయన వెల్లడించారు. దర్శనానంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడిన మల్లారెడ్డి... విద్యా రంగంలో తన నూతన విస్తరణ ప్రణాళికలు, శ్రీవారిపై తనకున్న భక్తిప్రపత్తులను పంచుకున్నారు.
"తిరుపతిలో మా మల్లారెడ్డి విశ్వవిద్యాలయానికి అనుమతులు లభిస్తే కొండపైకి మోకాళ్లపై వచ్చి గుండు కొట్టించుకుంటానని స్వామివారికి మొక్కుకున్నాను. ఆ వడ్డీకాసులవాడు దయతలిచి నా కోరిక నెరవేర్చాడు. పర్మిషన్ రావడంతో నా మొక్కు చెల్లించుకోవడానికి ఇక్కడకు వచ్చాను. నేను ఏది అడిగినా స్వామివారు వెంటనే అనుగ్రహిస్తున్నారు" అని మల్లారెడ్డి సంతోషం వ్యక్తం చేశారు.
రాయలసీమ ప్రాంత విద్యార్థులకు ఏఐ విద్యను అందుబాటులోకి తీసుకొచ్చామని మల్లారెడ్డి తెలిపారు. 70 ఏళ్లుగా ఇంజనీరింగ్ విద్య ఉన్నప్పటికీ, ప్రస్తుత సాంకేతిక విప్లవానికి అనుగుణంగా విద్యార్థులకు ఏఐ, స్కిల్స్ నేర్పించి గ్లోబల్ ఇంజనీర్లుగా తీర్చిదిద్దుతామన్నారు. భవిష్యత్తులో వైజాగ్, గుంటూరు ప్రాంతాల్లో కూడా తమ విద్యాసంస్థలను నెలకొల్పేందుకు శ్రీవారిని ప్రార్థించినట్లు ఆయన తెలిపారు.