ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా 80ల నాటి ఫ్యాషన్ కనిపిస్తోంది. పెద్ద జుట్టు, ఫ్యాషన్‌గా ఉండే కళ్లద్దాలు, అదిరిపోయే పోజులతో నెటిజన్లు అదరగొడుతున్నారు. అయితే ఇందకు గాను వాళ్లు పాత బట్టల కోసం వెతకడం లేదు. తమ ఆధునిక సెల్ఫీలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాయంతో పాతకాలం నాటి ఫొటోలుగా మార్చేసి ఆశ్చర్యపరుస్తున్నారు. ముఖ్యంగా చాట్‌జీపీటీ (ChatGPT) ఈ కొత్త ట్రెండ్‌కు కేంద్రంగా మారింది.

ఏమిటీ 80ల ఫొటో ట్రెండ్?
ఇది చాలా సులభమైన ప్రక్రియ. యూజర్లు తమకు నచ్చిన సెల్ఫీని చాట్‌జీపీటీకి అప్‌లోడ్ చేసి, తమ ముఖ కవళికలు, పోలికలు ఏమాత్రం మారకుండా 80ల నాటి శైలిలోకి మార్చమని సూచనలు (prompts) ఇస్తున్నారు. దీంతో ఏఐ టెక్నాలజీ ఆ ఫొటోను డిజిటల్ టైమ్ మెషీన్‌లా కొన్ని దశాబ్దాల వెనక్కి తీసుకెళుతోంది. ఆ కాలానికి చెందిన ఫ్యాషన్, హెయిర్‌స్టైల్స్, యాక్సెసరీలు, స్టూడియో లైటింగ్, వార్మ్ టోన్స్ వంటి అంశాలను జోడించి అద్భుతమైన రెట్రో పోర్ట్రెయిట్‌ను అందిస్తోంది.

ఈ ట్రెండ్‌లో అసలైన సరదా ఇక్కడే మొదలవుతుంది. యూజర్లు తమకు నచ్చినట్టుగా ఫొటోలను మార్చుకోవచ్చు. డిస్కో ఫ్లోర్, పాతకాలం నాటి కార్లు, రెట్రో స్టూడియో వంటి బ్యాక్‌గ్రౌండ్‌లను సెట్ చేసుకోవచ్చు. పెద్ద సైజు సన్‌గ్లాసెస్ కావాలనో, హెయిర్‌స్టైల్ మార్చాలనో, పాత మ్యాగజైన్ కవర్‌పై కనిపించేలా గ్లామరస్ లుక్ ఇవ్వాలనో సూచనలు ఇవ్వడం ద్వారా తమకు నచ్చిన 80ల అవతార్‌ను సృష్టించుకుంటున్నారు.

ఎందుకింత ఆదరణ?
సోషల్ మీడియాలో ఎప్పుడూ ఆదరణ పొందే రెండు అంశాలు ఈ ట్రెండ్‌కు ప్రాణం పోశాయి. ఒకటి, పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకోవడం, రెండు, కొత్తగా కనిపించాలనే కోరిక. 1980ల కాలానికి ఫ్యాషన్, సంగీతం, సినిమాల పరంగా ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఆనాటి బాలీవుడ్, టాలీవుడ్ సినిమాల్లోని హీరోహీరోయిన్ల స్టైలింగ్‌ను ఏఐ సులభంగా పునఃసృష్టిస్తోంది. మనకు తెలిసిన ముఖం ఒక పాత ఫొటోలో, సినిమా స్టిల్‌లో లేదా మ్యాగజైన్ కవర్‌పై కనిపిస్తే కలిగే ఆనందమే ఈ ట్రెండ్‌ను వైరల్ చేస్తోంది.

ఇన్‌స్టాగ్రామ్, 'ఎక్స్' వంటి ప్లాట్‌ఫామ్‌లలో ఈ ట్రెండ్ శరవేగంగా వ్యాపించింది. ఇన్‌ఫ్లుయెన్సర్ల నుంచి సామాన్యుల వరకు అందరూ తమ ఏఐ ట్రాన్స్‌ఫర్మేషన్ ఫొటోలను, రీల్స్‌ను షేర్ చేస్తున్నారు. ఈ ట్రెండ్ రాజకీయ వర్గాలకు కూడా పాకింది. కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, కిరణ్ రిజిజు, అసోం మంత్రి అశోక్ సింఘాల్ వంటి ప్రముఖులు కూడా తమ రెట్రో ఏఐ అవతార్‌లను పంచుకున్నారు. మొత్తానికి మన 80ల నాటి రూపం ఎలా ఉండేదో మనమే ఊహించుకుని సృష్టించుకునే అవకాశం ఉండటమే ఈ ట్రెండ్ విజయానికి కారణం.