మంచు కొండలు కరగకుండా గొర్రె ఉన్ని కవచం.. స్విస్ శాస్త్రవేత్తల వినూత్న ప్రయోగం

మంచు కొండలు కరగకుండా గొర్రె ఉన్ని కవచం.. స్విస్ శాస్త్రవేత్తల వినూత్న ప్రయోగం

Swiss Scientists Use Sheep Wool Blankets To Stop Glaciers From Melting
  • స్విట్జర్లాండ్‌లో మంచు కొండలు కరగకుండా గొర్రె ఉన్నితో ప్రయోగం
  • ప్లాస్టిక్ షీట్లకు బదులుగా సహజసిద్ధమైన ఉన్నిని వాడిన శాస్త్రవేత్తలు
  • ప్లాస్టిక్‌తో సమానంగా మంచు కరగడాన్ని తగ్గించిన గొర్రె ఉన్ని
  • పర్యావరణానికి హాని చేయని ఉన్నితో వ్యర్థాలకు పరిష్కారం
  • ఇది చిన్న ప్రాంతాలకే పరిమితమని, పూర్తి పరిష్కారం కాదని వెల్లడి
పర్యావరణ మార్పుల కారణంగా హిమనీనదాలు వేగంగా కరిగిపోతున్న నేపథ్యంలో, స్విట్జర్లాండ్‌ శాస్త్రవేత్తలు ఒక వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. హిమనీనదాల (గ్లేసియర్ల)ను పరిరక్షించేందుకు ఇప్పటివరకు వాడుతున్న ప్లాస్టిక్ షీట్లకు ప్రత్యామ్నాయంగా గొర్రె ఉన్నితో తయారు చేసిన దుప్పట్లను ఉపయోగిస్తున్నారు. స్విట్జర్లాండ్‌లోని త్సాన్‌ఫ్ల్యూరాన్ గ్లేసియర్‌పై నిర్వహించిన ఈ ప్రయోగంలో ఆశాజనక ఫలితాలు వచ్చాయి.

లాసెన్ విశ్వవిద్యాలయం, స్విస్ గ్లేసియర్ మానిటరింగ్ నెట్‌వర్క్ (గ్లామోస్) సహకారంతో నలుగురు విద్యార్థులు తమ మాస్టర్స్ థీసిస్‌లో భాగంగా ఈ ఆలోచనకు రూపకల్పన చేశారు. స్థానిక టెక్స్‌టైల్ సంస్థ ఫిసోలాన్ దీనికి అవసరమైన ఉన్నిని సరఫరా చేసింది. జూన్ నెలలో 100 చదరపు మీటర్ల విస్తీర్ణంలో రెండు భారీ ఉన్ని దుప్పట్లను, వాటికి సమీపంలోనే సంప్రదాయ ప్లాస్టిక్ కవర్లను అమర్చి పరిశీలించారు.

ఈ పరిశోధనలో గొర్రె ఉన్ని కూడా ప్లాస్టిక్ షీట్ల మాదిరిగానే అత్యంత సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు తేలింది. ఈ ఉన్ని కవర్లు మంచు కరగడాన్ని సుమారు 50 నుంచి 70 శాతం వరకు నిరోధించగలిగాయి. సాధారణంగా ప్లాస్టిక్ షీట్లు యూవీ కిరణాలు, గాలి ప్రభావంతో కాలక్రమేణా విచ్ఛిన్నమై మైక్రోప్లాస్టిక్స్‌ను నీటిలో కలుపుతాయి. కానీ, ఉన్ని సహజసిద్ధమైనది కావడంతో పర్యావరణంలో సులభంగా కలిసిపోతుంది. స్విట్జర్లాండ్‌లో సుమారు 40 నుంచి 70 శాతం గొర్రె ఉన్నికి సరైన మార్కెట్ లేక వ్యర్థంగా పారేస్తున్నారు. ఈ తాజా ప్రయోగంతో అటు వ్యవసాయ వ్యర్థాలను సద్వినియోగం చేస్తూనే, ఇటు పర్యావరణ పరిరక్షణకు బాటలు వేసే అవకాశం ఏర్పడింది.

అయితే, ఈ పద్ధతి కేవలం పరిమితమైన, అత్యంత విలువైన మంచు ప్రాంతాలకు మాత్రమే అనుకూలమని పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం స్విట్జర్లాండ్‌లోని మొత్తం హిమనీనదాల్లో కేవలం 0.02 శాతం మేర మాత్రమే ఇలాంటి కవర్లతో రక్షణ కల్పిస్తున్నారు. ఇవి ఏర్పాటు చేయడం ఆర్థికంగా భారంతో కూడుకున్నది కావడమే కాకుండా, అధిక శ్రమతో కూడిన పని. భారీ స్థాయిలో హిమానీనదాలు కరిగిపోవడాన్ని ఇవి పూర్తిగా అడ్డుకోలేవని, శిలాజ ఇంధనాల వాడకాన్ని తగ్గించడమే వాతావరణ మార్పులకు అసలైన పరిష్కారమని శాస్త్రవేత్తలు తేల్చిచెప్పారు.
Advertisement
Switzerland Glaciers
Sheep Wool Blankets
Glacier Melting Solution
University of Lausanne
Environmental Conservation

More Telugu News