ఎల్‌నినో స్పీడ్ బ్రేకర్ లాగా వచ్చింది.. చంద్రబాబు నాయకత్వంలో ఎదుర్కొంటాం: మంత్రి అచ్చెన్నాయుడు

ఎల్‌నినో స్పీడ్ బ్రేకర్ లాగా వచ్చింది.. చంద్రబాబు నాయకత్వంలో ఎదుర్కొంటాం: మంత్రి అచ్చెన్నాయుడు

Atchannaidu says El Nino is a speed breaker for development in Andhra Pradesh
  • ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో 56 శాతం వర్షపాతం లోటు
  • విపత్కర పరిస్థితుల్లో చంద్రబాబు సమర్థవంతమైన నాయకత్వం అందిస్తున్నారన్న అచ్చెన్న
  • రైతులను గొడ్డలి పార్టీ నేతలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపణ
  • కూటమి ప్రభుత్వం 46 లక్షల మంది రైతులకు పంటల బీమా కల్పించిందని వెల్లడి
  • గత ప్రభుత్వం ఐదేళ్లుగా పంటల బీమా ప్రీమియం కూడా చెల్లించలేదని ఆగ్రహం
రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావం తీవ్రంగా ఉందని, ఇది అభివృద్ధికి స్పీడ్ బ్రేకర్ లాగా పరిణమించిందని రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. అయితే, ముఖ్యమంత్రి చంద్రబాబు సమర్థవంతమైన నాయకత్వంలో ఈ విపత్తును ఎదుర్కొని రైతులకు అండగా నిలుస్తామని ఆయన భరోసా ఇచ్చారు. లీడర్‌షిప్ కాన్‌క్లేవ్‌లో పాల్గొన్న ఆయన, రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితులు, ప్రభుత్వ చర్యలపై ప్రసంగించారు.

ఎల్‌నినో కారణంగా రాష్ట్రవ్యాప్తంగా 56 శాతం తక్కువ వర్షపాతం నమోదైందని మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. కొన్ని జిల్లాల్లో పరిస్థితి మరింత తీవ్రంగా ఉందని, అన్నమయ్య జిల్లాలో 76 శాతం, ప్రకాశంలో 70 శాతం, చిత్తూరులో 65 శాతం, విశాఖపట్నంలో 60 శాతం వర్షపాతం లోటు ఉందని గణాంకాలతో సహా వివరించారు. రాష్ట్రంలోని 680 మండలాల్లో వర్షాలు లేక కరవు ఛాయలు అలుముకున్నాయని తెలిపారు. అయితే, ఈ పరిస్థితిని ముందుగానే అంచనా వేసి గత ఏడాదే చెరువులను నింపడం వంటి ముందుజాగ్రత్త చర్యలు తీసుకున్నామని గుర్తుచేశారు.

ఈ కష్టకాలంలో కొందరు ‘గొడ్డలి పార్టీ’ నాయకులు రైతులను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని అచ్చెన్నాయుడు విమర్శించారు. గతంలో పట్టిసీమను వ్యతిరేకించి, ఐదేళ్ల పాటు ఉచిత పంటల బీమా అని చెప్పి కనీసం ప్రీమియం కూడా చెల్లించని వారు ఇప్పుడు రైతుల గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. తమ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 46 లక్షల మంది రైతులకు పంటల బీమా సౌకర్యం కల్పించిందని, ఇప్పటికే రూ.4,800 కోట్లు బీమా చేశామని స్పష్టం చేశారు.

27 నెలల క్రితం అన్ని వ్యవస్థలు చిన్నాభిన్నమైన రాష్ట్రాన్ని చంద్రబాబు మళ్లీ గాడిన పెట్టారని అచ్చెన్నాయుడు కొనియాడారు.గతంలో రాజమండ్రి సూపర్ సైక్లోన్, శ్రీకాకుళంలో తితిలి తుపాను వంటి భయంకరమైన విపత్తులను చంద్రబాబు సమర్థంగా ఎదుర్కొన్నారని అచ్చెన్నాయుడు గుర్తుచేశారు. 30 ఏళ్ల క్రితమే నీటి సమస్యపై ఆయన దృష్టి సారించారని, 2014-19 మధ్య సాగునీటి ప్రాజెక్టులపై రూ.65 వేల కోట్లు ఖర్చు చేశారని తెలిపారు. 2019లో టీడీపీ గెలిచి ఉంటే రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులు పూర్తయ్యేవని అభిప్రాయపడ్డారు.  ప్రజాప్రతినిధులు వాస్తవాలు గ్రహించి రైతులకు ధైర్యం చెప్పాలని ఆయన సూచించారు.

Advertisement
Kinjarapu Atchannaidu
Chandrababu Naidu
El Nino Andhra Pradesh
AP Drought Relief
Farmers Crop Insurance
Andhra Pradesh Irrigation Projects

More Telugu News