పోలీసు విచారణకు హాజరైన యూట్యూబర్ నందన.. అద్దంకిలో కూడా మరో కేసు నమోదు
- విదేశాల్లో ఉద్యోగాల పేరుతో మోసం చేసినట్టు నందనపై ఆరోపణలు
- ఇబ్రహీంపట్నం పీఎస్ లో న్యాయవాదులతో కలిసి విచారణకు హాజరైన నందన
- రూ. 13 లక్షలు తీసుకుని మోసం చేసిందంటూ క్రాంతి అనే వ్యక్తి ఫిర్యాదు
వీసాలు, విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ డబ్బులు వసూలు చేసి మోసం చేసిందన్న ఆరోపణల కేసులో ప్రముఖ యూట్యూబర్ రమానందన చిక్కుల్లో పడింది. ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో నమోదైన వీసా చీటింగ్ కేసులో ఆమె తన న్యాయవాదులతో కలిసి పోలీసుల ఎదుట విచారణకు హాజరైంది. విదేశాల్లో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి రమానందన దంపతులు తన వద్ద నుంచి రూ.13 లక్షలు వసూలు చేసి మోసం చేశారని బాధితుడు క్రాంతి కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. యూకే నుంచి హైదరాబాద్ చేరుకున్న వెంటనే విచారణకు హాజరుకావాలని పోలీసులు నోటీసులు జారీ చేయడంతో ఆమె పీఎస్‌కు వచ్చింది.
మరోవైపు, రమానందనపై ప్రకాశం జిల్లా అద్దంకి పోలీస్ స్టేషన్ లో కూడా మరో వీసా స్కామ్ కేసు నమోదు కావడం సంచలనం సృష్టిస్తోంది. 'డెస్టినీ కన్సల్టెన్సీ' పేరిట వీసా రెన్యువల్, సర్టిఫికెట్ ఆఫ్ స్పాన్సర్‌షిప్ ఇప్పిస్తామని నమ్మించి 2023లో తమ వద్ద భారీగా డబ్బులు వసూలు చేసి మోసం చేశారని బాధితులు పోలీసులను ఆశ్రయించారు. వరుస కేసులు నమోదవ్వడంతో బాధితులను ఇబ్రహీంపట్నం పీఎస్‌కే రావాలని రమానందన కోరినట్లు సమాచారం. దీంతో హైదరాబాద్‌తో పాటు అద్దంకికి చెందిన బాధితులు కూడా భారీగా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌కు చేరుకుంటున్నారు.