ట్రంప్‌ మరోసారి అధికారంలోకి.. అమెరికా ముక్కలు.. ‘చైనా నోస్ట్రడామస్‌’ సంచలన జోస్యాలు

ట్రంప్‌ మరోసారి అధికారంలోకి.. అమెరికా ముక్కలు.. ‘చైనా నోస్ట్రడామస్‌’ సంచలన జోస్యాలు

Trump in power again America in pieces China Nostradamus sensational predictions
  • 2027పై జియాంగ్‌ జ్యూకిన్‌ సంచలన అంచనాలు
  • పశ్చిమాసియాలో అమెరికా భూతల యుద్ధం చేస్తుందన్న జియాంగ్‌
  • అమెరికాలో మళ్లీ తప్పనిసరి సైనిక సేవ రావచ్చని అంచనా
  • అమెరికాలో అంతర్యుద్ధ పరిస్థితులు రావచ్చని హెచ్చరిక
  • ట్రంప్‌ మూడోసారి అధ్యక్షుడయ్యే అవకాశం ఉందన్న జియాంగ్‌
భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే ప్రయత్నాలు ఎప్పటి నుంచో జరుగుతూనే ఉన్నాయి. అయితే కొన్ని అంచనాలు మాత్రం సోషల్‌ మీడియాలో ఒక్కసారిగా కలకలం రేపుతుంటాయి. ఇప్పుడు అలాంటి చర్చకు కారణమయ్యారు చైనా-కెనడాకు చెందిన విద్యావేత్త ప్రొఫెసర్‌ జియాంగ్‌ జ్యూకిన్‌. ‘చైనా నోస్ట్రడామస్‌’గా పేరుగాంచిన ఆయన.. 2027లో అమెరికా ఎదుర్కొనే పరిణామాలపై చేసిన అంచనాలు ఇప్పుడు వైరల్‌గా మారాయి.

యుద్ధంతో మొదలై.. సంక్షోభంగా మారుతుందా?
జియాంగ్‌ అంచనాల ప్రకారం పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు మరింత ముదిరే అవకాశం ఉంది. వైమానిక దాడులతో సమస్య పరిష్కారం కాకపోతే అమెరికా నేరుగా భారీ స్థాయిలో భూతల యుద్ధంలోకి దిగే పరిస్థితి రావచ్చని ఆయన భావిస్తున్నారు. ఈ యుద్ధం ఏళ్ల తరబడి కొనసాగుతుందని చెబుతున్నారు.

అమెరికాలో మళ్లీ సైనిక నియామకాలా?
యుద్ధం సుదీర్ఘంగా సాగితే అమెరికా సైన్యంలో సిబ్బంది కొరత ఏర్పడొచ్చని జియాంగ్‌ అంచనా. దీంతో తప్పనిసరి సైనిక సేవకు సంబంధించిన చట్టపరమైన వ్యవస్థను 2027 నాటికి సిద్ధం చేసే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. యువతను సైన్యంలోకి తీసుకునే పరిస్థితి రావచ్చని అన్నారు.

ఐసీఈకి మరింత అధికారం?
అమెరికాలో అంతర్గత పరిస్థితులు కూడా ఉద్రిక్తంగా మారొచ్చని ఆయన అంచనా వేశారు. ఇమ్మిగ్రేషన్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సంస్థ ఐసీఈ అధికారాలు మరింత పెరగవచ్చని అన్నారు. ప్రధాన నగరాల్లో నేషనల్‌ గార్డ్‌ మోహరింపులు తరచుగా కనిపించే అవకాశం ఉందని పేర్కొన్నారు.

చమురు షాక్‌
హర్మూజ్‌ జలసంధిలో రవాణాకు అంతరాయం ఏర్పడితే దాని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఉంటుందని జియాంగ్‌ చెబుతున్నారు. చమురు, గ్యాస్‌, ఎరువుల ధరలు భారీగా పెరగొచ్చని అంచనా వేశారు. సరఫరా వ్యవస్థలు దెబ్బతింటే ఆహార కొరత, ద్రవ్యోల్బణం పెరిగే ప్రమాదం ఉందన్నారు.

అమెరికాలో ‘సివిల్‌ వార్‌’ పరిస్థితులా?
ఆర్థిక ఇబ్బందులు, తప్పనిసరి సైనిక సేవపై వ్యతిరేకత, వీధుల్లో భద్రతా బలగాల మోహరింపులు కలిసి అమెరికాలో తీవ్ర అశాంతికి దారితీయొచ్చని జియాంగ్‌ అభిప్రాయపడ్డారు. 2027లో అంతర్యుద్ధానికి దారితీసే పరిస్థితులు ఏర్పడతాయని ఆయన పేర్కొన్నారు.

ట్రంప్‌నకు మూడోసారి అవకాశం ఉంటుందా?
జియాంగ్‌ మరో సంచలన అంచనా కూడా వెలువరించారు. డొనాల్డ్‌ ట్రంప్‌ మూడోసారి అమెరికా అధ్యక్షుడయ్యే అవకాశం ఉందని అన్నారు. ప్రస్తుత అమెరికా రాజ్యాంగంలోని 22వ సవరణ ప్రకారం ఒక వ్యక్తి రెండు పర్యాయాలకు మించి అధ్యక్షుడిగా ఎన్నిక కావడానికి వీల్లేదు. అయినప్పటికీ ట్రంప్‌ మూడోసారి అధికారంలోకి రావచ్చని జియాంగ్‌ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

అమెరికా విడిపోతుందా?
అమెరికాలో అంతర్యుద్ధం జరిగితే దేశం చిన్న చిన్న ప్రాంతాలుగా విడిపోయే పరిస్థితి రావచ్చని ఆయన మరోసారి వ్యాఖ్యానించారు. దీన్నే ‘బాల్కనైజేషన్‌’గా పేర్కొన్నారు. దాదాపు 20 ఏళ్ల తర్వాత అమెరికా క్రిస్టియన్‌ ఏఐ థియోక్రసీగా మారుతుందని కూడా ఆయన అంచనా వేశారు. ఆస్టిన్‌ భవిష్యత్తులో అమెరికాకు కొత్త కేంద్రంగా మారొచ్చని.. న్యూయార్క్‌, లాస్‌ ఏంజెల్స్‌ ప్రాధాన్యం తగ్గొచ్చని అన్నారు.

అయితే ఇవన్నీ జియాంగ్‌ జ్యూకిన్‌ చేసిన అంచనాలు మాత్రమే. వాటికి కచ్చితమైన ఆధారాలు ఉన్నాయని చెప్పలేం. భవిష్యత్తులో అవే పరిణామాలు జరుగుతాయని నిర్ధారించేందుకు ప్రస్తుతం ఎలాంటి ఆధారం లేదు. అందుకే ఈ వ్యాఖ్యలను విశ్లేషణలు, అంచనాలుగానే చూడాలి.
Advertisement
Jiang Xueqin
Donald Trump
China Nostradamus
US Civil War
American Balkanization
US Economic Crisis

More Telugu News