‘కేసీఆర్‌ను చంపే కుట్ర జరుగుతోంది’.. కేటీఆర్‌ సంచలన ఆరోపణలు

‘కేసీఆర్‌ను చంపే కుట్ర జరుగుతోంది’.. కేటీఆర్‌ సంచలన ఆరోపణలు

KTR alleges sensational conspiracy to kill KCR by Congress workers
  • కాంగ్రెస్‌ చేపట్టిన ఎర్రవల్లి ఫాంహౌస్‌ ముట్టడి కార్యక్రమంపై కేటీఆర్‌ ధ్వజం
  • కాంగ్రెస్‌ శ్రేణులు అరాచకానికి పాల్పడ్డాయని విమర్శ
  • ప్రభుత్వంపై డైవర్షన్‌ రాజకీయాల ఆరోపణ
  • అసెంబ్లీలో ప్రజా సమస్యలపై చర్చించాలని డిమాండ్‌
  • దళిత, గిరిజన హామీలు అమలు చేయాలని డిమాండ్‌
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కాంగ్రెస్‌ శ్రేణులు కుట్రపూరితంగా హత్యాయత్నం చేశాయని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సంచలన ఆరోపణలు చేశారు. ఎర్రవల్లి ఫాంహౌస్‌ ముట్టడి పేరుతో కాంగ్రెస్‌ శ్రేణులు అరాచకానికి పాల్పడ్డాయని మండిపడ్డారు. ఫాంహౌస్‌కు వెళుతున్న తమను అరెస్ట్‌ చేసి బోయిన్‌పల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించిన సందర్భంగా కేటీఆర్‌ మీడియాతో మాట్లాడారు.

కేసీఆర్‌ నివాస ప్రాంగణం వరకు కాంగ్రెస్‌ కార్యకర్తలను పోలీసులు ఎలా అనుమతించారని కేటీఆర్‌ ప్రశ్నించారు. తమ సొంత ఇంటికి తాము వెళుతుంటే పోలీసులు ఎందుకు అడ్డుకుంటున్నారో డీజీపీ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ శ్రేణుల దాడులను పట్టించుకోకుండా బీఆర్‌ఎస్‌ నేతలను మాత్రమే పోలీసులు లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆరోపించారు.

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తోందని కేటీఆర్‌ విమర్శించారు. ప్రజల దృష్టిని ప్రభుత్వ వైఫల్యాల నుంచి మళ్లించేందుకే డైవర్షన్‌ రాజకీయాలకు తెరలేపారని అన్నారు. ‘‘డైవర్షన్‌, డిస్ట్రక్షన్‌, డిస్ట్రాక్షన్‌ తప్ప రేవంత్‌రెడ్డికి మరో విద్య తెలియదు’’ అని వ్యాఖ్యానించారు.

అసెంబ్లీ సమావేశాల సమయాన్ని ప్రజా సమస్యలపై ఉపయోగించాలని కేటీఆర్‌ సూచించారు. కేసీఆర్‌, బీఆర్‌ఎస్‌ నేతలను విమర్శించేందుకు సభను ఉపయోగించుకోవడం సరికాదన్నారు. ఇందుకోసం ఒక రోజు కేటాయించి.. మిగిలిన రోజుల్లో ప్రజా సమస్యలపై చర్చించాలని డిమాండ్‌ చేశారు.

దళితులపై ప్రభుత్వానికి నిజమైన ప్రేమ ఉంటే దళిత, గిరిజన డిక్లరేషన్‌ హామీలను వెంటనే అమలు చేయాలని కేటీఆర్‌ కోరారు. దళితబంధు కింద ఒక్కొక్కరికి రూ.12 లక్షలు ఇస్తామని చెప్పి.. కనీసం రూ.12 పైసలు కూడా ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ నిర్ణేతలని.. సరైన సమయం వచ్చినప్పుడు ఈ ప్రభుత్వానికి ప్రజలే సమాధానం చెబుతారని కేటీఆర్‌ అన్నారు.
Advertisement
KTR
KCR
Congress Party Telangana
Erravelli Farmhouse
Revanth Reddy
BRS Party

More Telugu News