మాజీ సీఎం పినరయి విజయన్ పై కేసు నమోదు చేయాలని డీజీపీకి ఈడీ లేఖ
- సీఎంఆర్ఎల్ లంచాల వ్యవహారం కేసు
- విజయన్ కుమార్తె కంపెనీకి రూ. 2.78 కోట్లు చెల్లించినట్టు ఆరోపణలు
- రాజకీయ కక్షసాధింపు చర్యలేనన్న పినరయి విజయన్
కొచ్చిన్ మినరల్స్ అండ్ రుటైల్ లిమిటెడ్ (CMRL) కేసుతో ముడిపడి ఉన్న లంచాల వ్యవహారం కేరళ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. నిధుల అక్రమ మళ్లింపు వ్యవహారంలో కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్, ఆయన కుమార్తె టి. వీణ, అల్లుడు పి.ఎ. మహమ్మద్ రియాస్‌లతో పాటు పలువురిపై తక్షణమే ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని రాష్ట్ర డీజీపీకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారికంగా లేఖ రాసింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టంలోని సెక్షన్ 66 నిబంధనల ప్రకారం... తమ వద్ద ఉన్న పక్కా ఆధారాల ప్రాతిపదికన ఈ సమాచారాన్ని కేరళ పోలీసులకు బదిలీ చేసినట్లు దర్యాప్తు వర్గాలు వెల్లడించాయి.
ఈ కేసుకు సంబంధించి వీణకు చెందిన, ప్రస్తుతం మూతపడిన 'ఎక్సాలాజిక్ సొల్యూషన్స్' ఐటీ సంస్థకు సీఎంఆర్‌ఎల్ కంపెనీ ఎలాంటి సేవలు తీసుకోకుండానే ఐటీ కన్సల్టెన్సీ పేరుతో రూ. 2.78 కోట్లు చెల్లించిందని ఈడీ ఆరోపిస్తోంది. గత జూన్ మాసంలో తిరువనంతపురంలోని వీరి నివాసంలో సోదాలు నిర్వహించి విచారించిన అనంతరం, ఆగస్టులో జరిపిన తనిఖీల్లో దుబాయ్‌కి అక్రమ నిధుల బదిలీకి సంబంధించిన చేతిరాత ప్రతులు కూడా దొరికినట్లు ఈడీ స్పష్టం చేసింది.
ఈ చర్యలపై తీవ్రంగా స్పందించిన వీణ భర్త మహమ్మద్ రియాస్ ఈడీ కేసులను రాజకీయంగా, చట్టపరంగా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. సీపీఐ(ఎం) కేరళ కార్యదర్శి ఎం.వి. గోవిందన్ స్పందిస్తూ... ప్రతిపక్ష నేతలను దెబ్బతీసేందుకే ఈడీని వాడుకుంటున్నారని మండిపడ్డారు. కాగా, తన కుమార్తెపై వచ్చిన ఆరోపణలు, ఈడీ లేఖ కేవలం కేంద్ర ప్రభుత్వ 'రాజకీయ కక్షసాధింపు చర్య' మాత్రమేనని పినరయి విజయన్ కొట్టిపారేశారు.