మెగా డీఎస్సీపై ఆరోపణలు నిరాధారం.. వేధిస్తే కఠిన చర్యలు: ఏపీ ప్రభుత్వం

మెగా డీఎస్సీపై ఆరోపణలు నిరాధారం.. వేధిస్తే కఠిన చర్యలు: ఏపీ ప్రభుత్వం

AP Mega DSC 2025 allegations baseless government warns of strict action against harassment
  • మెగా డీఎస్సీ 2025 నియామకాలపై ఆరోపణలను ఖండించిన ప్రభుత్వం
  • స్పోర్ట్స్ కోటా ఎంపికలు పారదర్శకంగా జరిగాయన్న క్రీడా ప్రాధికార సంస్థ (శాప్)
  • ఉపాధ్యాయులను వేధిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక
  • టెట్ అర్హతలపై పలువురు అభ్యర్థుల విషయంలో స్పష్టత ఇచ్చిన అధికారులు
ఏపీ మెగా డీఎస్సీ 2025 నియామకాలపై గత పది రోజులుగా సోషల్ మీడియా, ఇతర మాధ్యమాల్లో వస్తున్న ఆరోపణలను రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. స్పోర్ట్స్ కోటా సహా ఇతర నియామకాల్లో ఎలాంటి అక్రమాలు జరగలేదని, మొత్తం ప్రక్రియ అత్యంత పారదర్శకంగా జరిగిందని స్పష్టం చేసింది. అమరావతిలోని విద్యాభవన్ లో పాఠశాల విద్యాశాఖ కమిషనర్ తమీమ్ అన్సారియా, రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) వైస్ ఛైర్మన్ అండ్ ఎండీ భరణి సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించి పూర్తి వివరాలు వెల్లడించారు. ఉపాధ్యాయులను లక్ష్యంగా చేసుకుని వేధింపులకు పాల్పడితే కఠినమైన క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

స్పోర్ట్స్ కోటా నియామకాలు పారదర్శకం: శాప్

స్పోర్ట్స్ కోటా ఎంపికలు కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగానే జరిగాయని శాప్ ఎండీ భరణి తెలిపారు. తుది జాబితాకు ముందు 1:5 నిష్పత్తిలో అభ్యర్థుల జాబితాను విడుదల చేసి, 2025 ఆగస్టు 8 నుంచి 14 వరకు అభ్యంతరాలకు అవకాశం కల్పించామని, ఆ సమయంలో జూడో సర్టిఫికెట్లపై ఎలాంటి ఫిర్యాదులు రాలేదని వివరించారు. 

ప్రస్తుతం హైకోర్టులో ఉన్న ప్రజాప్రయోజన వ్యాజ్యం (PIL No. 170) కూడా డీఎస్సీ నియామకాలు పూర్తయిన ఏడాది తర్వాత దాఖలైందని, దాని పరిధి 2018 నుంచి జరిగిన అన్ని క్రీడా కోటా నియామకాలపై ఉందని తెలిపారు. స్పోర్ట్స్ కోటాలో రాత పరీక్ష మార్కులతో సంబంధం లేకుండా క్రీడాకారుల ప్రతిభకే తొలి ప్రాధాన్యత ఉంటుందని, ఇది రాష్ట్ర, జాతీయ స్థాయిలో సాధారణ ప్రక్రియ అని స్పష్టం చేశారు.

కొందరు క్రీడాకారులపై వచ్చిన ఆరోపణలను కూడా అధికారులు ఖండించారు. జాతీయ స్థాయి బాక్సర్ పెద్ద అప్పల రాజు విషయంలో ఆన్‌లైన్‌లో పొరపాటున సోదరుడి సర్టిఫికెట్ అప్‌లోడ్ చేసినా, తర్వాత సరిదిద్దుకున్నారని.. ఆయన పత్రాలన్నీ నిజమైనవేనని వీడియో ఫుటేజ్‌తో సహా నిర్ధారించుకున్నామని తెలిపారు. అలాగే, సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడిగా టీడీపీ ఎమ్మెల్యే కోన రవికుమార్ సంతకం చేయడంపై మాట్లాడుతూ.. జాతీయ సమాఖ్య అధికారికంగా అనుమతి ఇచ్చినందునే ఆయన సంతకం చేశారని, ఇది నిబంధనలకు విరుద్ధం కాదని స్పష్టం చేశారు.

టెట్ అర్హతలపై పూర్తి స్పష్టత

టెట్ అర్హత మార్కుల విషయంలో వచ్చిన ఆరోపణలపై విద్యాశాఖ కమిషనర్ తమీమ్ అన్సారియా వివరణ ఇచ్చారు. కర్నూలుకు చెందిన అభ్యర్థి ప్రభాకర్ (బీసీ) టెట్‌లో 77 మార్కులు సాధించి అర్హత పొందారని, దీనిపై మరింత స్పష్టత కోసం సెప్టెంబర్ 5న త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేశామని తెలిపారు. 

అదేవిధంగా, జంపాల ఉష (బీసీ) 2012లోనే టెట్‌లో 80 మార్కులతో అర్హత సాధించారని, అప్పట్లో లాంగ్వేజ్ పండిట్లకు ప్రత్యేక టెట్ లేదని, ఆ సర్టిఫికెట్ చెల్లుబాటు అవుతుందని స్పష్టం చేశారు. మిగిలిన అభ్యర్థుల అర్హతలు కూడా నిబంధనల ప్రకారమే ఉన్నాయని వెల్లడించారు. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ల జారీ రెవెన్యూ శాఖ పరిధిలోని అంశమని, అనుమానం ఉన్న సర్టిఫికెట్లను పునఃపరిశీలన కోసం జిల్లా కలెక్టర్లకు పంపామని తెలిపారు.

Advertisement
AP Mega DSC 2025
School Education Commissioner Tamim Ansariya
SAAP MD Bharani
AP DSC Sports Quota Recruitment
TET Qualification Marks Andhra Pradesh
SAAP Sports Certificate Verification

More Telugu News