చంద్రబాబు కేవలం తెలుగుదేశం ఆస్తి కాదు.. యావత్ తెలుగుజాతి ఆస్తి: మంత్రి పయ్యావుల

చంద్రబాబు కేవలం తెలుగుదేశం ఆస్తి కాదు.. యావత్ తెలుగుజాతి ఆస్తి: మంత్రి పయ్యావుల

Chandrababu is not just TDP asset but asset of all Telugu people says Minister Payyavula
  • టీడీపీ నేతల సమావేశంలో స్వర్ణాంధ్ర విజన్ 2047పై మంత్రి పయ్యావుల ప్రజెంటేషన్
  • చంద్రబాబు ముందు, తర్వాత అని ఏపీ అభివృద్ధిని చూడాలన్న ఆర్థిక మంత్రి
  • పట్టిసీమతో 200 సార్లు ప్రకాశం బ్యారేజీ నింపిన ఘనత చంద్రబాబుదేనని ప్రశంస
  • నియోజకవర్గాల విజన్ ప్లాన్లతో ఏపీకి జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చిందని వెల్లడి
ముఖ్యమంత్రి చంద్రబాబు కేవలం తెలుగుదేశం పార్టీ ఆస్తి కాదని, యావత్ తెలుగు జాతి ఆస్తి అని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అభివర్ణించారు. టీడీపీ లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో భాగంగా 'స్వర్ణాంధ్ర విజన్ 2047' డాక్యుమెంట్‌పై ఆయన ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయకత్వ దార్శనికతను, ఆయన రూపొందించిన విధానాల వల్ల కలిగిన ప్రయోజనాలను ఉదాహరణలతో వివరించారు. ప్రతినిధుల హర్షధ్వానాల మధ్య ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

"వాట్ చంద్రబాబు థింక్స్ టుడే, నేషన్ థింక్స్ టుమారో (చంద్రబాబు ఈరోజు ఆలోచించింది, దేశం రేపు ఆలోచిస్తుంది)" అనేది అక్షర సత్యమని పయ్యావుల అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు చంద్రబాబు రూపొందించిన 'విజన్-2020' దేశంలోనే తొలి విజన్ డాక్యుమెంట్ అని, దానిని చూశాకే అనేక రాష్ట్రాలు తమ విజన్ పత్రాలను తయారు చేసుకున్నాయని గుర్తుచేశారు. నాడు విజన్-2020ని కొందరు అవహేళన చేసినా, అదే రాష్ట్రానికి దిక్సూచిగా మారిందని తెలిపారు.

చంద్రబాబు దూరదృష్టికి ఐటీ రంగం అభివృద్ధి ఒక నిదర్శనమని పయ్యావుల పేర్కొన్నారు. హైటెక్ సిటీ ఏర్పాటుకు ముందే వందల సంఖ్యలో ఇంజనీరింగ్ కాలేజీలను ఏర్పాటు చేసి మానవ వనరులను సిద్ధం చేశారని, అందుకే ఇంజనీరింగ్ పూర్తిచేసిన యువతకు ఐటీ ఉద్యోగాలు వెంటనే లభించాయని వివరించారు. ఆయన ప్రణాళన వల్లే నేడు ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు ఐటీ నిపుణులుగా అత్యధిక ఆదాయం ఆర్జిస్తున్నారని అన్నారు.

జలవనరుల నిర్వహణలో చంద్రబాబును 'వాటర్ మ్యాన్'గా అభివర్ణించారు. పట్టిసీమ ద్వారా 500 టీఎంసీల గోదావరి జలాలను కృష్ణా డెల్టాకు తరలించి, ప్రకాశం బ్యారేజీని 200 సార్లు నింపిన ఘనత చంద్రబాబుదేనని ప్రశంసించారు. 2024లో విధ్వంసానికి గురైన రాష్ట్రాన్ని తిరిగి వికాసం వైపు నడిపిస్తున్నారని అన్నారు. నియోజకవర్గాల వారీగా విజన్ ప్లాన్‌లను అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీ అని, ఈ విషయంలో నీతి ఆయోగ్‌తో కలిసి పనిచేస్తూ జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకున్నామని పయ్యావుల తెలిపారు. నేతలంతా ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడమే లక్ష్యంగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.

Advertisement
Chandrababu Naidu
Payyavula Keshav
Swarnandhra Vision 2047
Andhra Pradesh Development
Telugu Desam Party
Vision 2020 Document

More Telugu News