ఇది దుశ్శాసన సభ.. మహిళా నేతల జుట్టు పట్టుకుని ఈడ్చేస్తారా?: కేటీఆర్
- శాంతియుతంగా నిరసన తెలిపేందుకు వెళితే ఉక్కుపాదం మోపారన్న కేటీఆర్
- తాము ఎలాంటి అన్‌పార్లమెంటరీ భాష మాట్లాడలేదని వెల్లడి
- ఈ దాడి వెనుక రేవంత్ రెడ్డి కుట్ర ఉందని ఆరోపణ
ప్రజా సమస్యలపై ప్రశ్నించేందుకు అసెంబ్లీకి వెళ్లిన ప్రతిపక్ష సభ్యులపై పోలీసులు అత్యంత కిరాతకంగా వ్యవహరించారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను విస్మరించి 1000 రోజులుగా పాలన సాగిస్తోందని, దీనిపై శాంతియుతంగా నిరసన తెలిపేందుకు వెళ్తే తమపై ఉక్కుపాదం మోపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ పార్లమెంట్‌లో నిరసన తెలిపినట్లే తాము కూడా నిరసన తెలిపేందుకు యత్నించామని, తాము ఎలాంటి అన్‌పార్లమెంటరీ, నికృష్టమైన భాష మాట్లాడలేదని స్పష్టం చేశారు.
గతంలో వైఎస్సార్, కిరణ్‌కుమార్ రెడ్డి కేబినెట్లలో మంత్రులుగా, మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా పనిచేసిన అత్యంత అనుభవజ్ఞురాళ్లు, సౌమ్యులైన సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిల పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరు దారుణం అంటూ కేటీఆర్ తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేశారు. "ఒకవైపు రాహుల్ గాంధీ ఢిల్లీలో 'స్మాష్ ది పాట్రియార్కీ' అంటూ మహిళా సాధికారతపై గొప్పలు చెప్తారు. కానీ ఇక్కడ రాహుల్ గాంధీ రాజకీయాల్లోకి రాకముందే మంత్రులుగా పనిచేసిన సీనియర్ మహిళా నేతల జుట్టు పట్టుకుని, గొంతు పిసికే ప్రయత్నం చేశారు" అని నిలదీశారు.
పోలీసులు సునీతా లక్ష్మారెడ్డి చీర పట్టుకుని లాగుతుంటే... కోవ లక్ష్మి అడ్డుకోకపోయి ఉంటే తీవ్ర ప్రమాదం జరిగి ఉండేదని, ఈ ఘటనతో సునీతమ్మ కంటనీరు పెట్టుకోవడం చూస్తే ఇది శాసనసభలా కాకుండా దుశ్శాసన సభలా మారిందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సీనియర్ నాయకురాళ్ల పట్ల జరిగిన ఈ దాడి, అనాగరిక ప్రవర్తన వెనుక స్పష్టంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుట్ర ఉందే తప్ప మరొకటి కాదని కేటీఆర్ ఆరోపించారు.