జోగు రామన్న అరెస్ట్.. ఆదిలాబాద్‌లో ఉద్రిక్తత
- బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అరెస్ట్ కు నిరసనగా ఆదిలాబాద్‌లో బీఆర్ఎస్ నిరసన
- జోగు రామన్న నేతృత్వలో రోడ్డుపై బైఠాయించి ధర్నా
- అరెస్టులకు భయపడేదే లేదన్న జోగు రామన్న
అసెంబ్లీ వద్ద బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను అక్రమంగా అరెస్ట్ చేశారని ఆరోపిస్తూ... మాజీ మంత్రి జోగు రామన్న ఆధ్వర్యంలో ఆదిలాబాద్ పట్టణంలో బీఆర్‌ఎస్ శ్రేణులు భారీ రాస్తారోకో చేపట్టాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపాయి. సమాచారం అందుకున్న పోలీసులు జోగు రామన్నతో పాటు ఇతర నేతలను అదుపులోకి తీసుకునేందుకు యత్నించగా... బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య తీవ్ర తోపులాట చోటుచేసుకుంది.
జోగు రామన్నను అరెస్టు చేసి వాహనంలోకి తరలిస్తుండగా, బీఆర్‌ఎస్ కార్యకర్తలు పోలీసు వాహనానికి అడ్డంగా నిలబడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దెత్తున నినాదాలు చేశారు. పోలీసులు శ్రేణులను పక్కకు నెట్టి వాహనాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు యత్నించినా పలుమార్లు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
ఈ సందర్భంగా జోగు రామన్న మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, హామీలను నెరవేర్చాలని నిరసన తెలుపుతున్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలపై పోలీసులు దాడి చేయడం, దౌర్జన్యాలకు పాల్పడటం ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టని మండిపడ్డారు. అరెస్టులకు భయపడేది లేదని, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే వరకు బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగిస్తామని హెచ్చరించారు.