వేల కోట్లు కొల్లగొడుతున్న పొంగులేటిని వెంటనే తొలగించాలి: గన్‌పార్క్‌ వద్ద బీజేపీ తీవ్ర నిరసన

వేల కోట్లు కొల్లగొడుతున్న పొంగులేటిని వెంటనే తొలగించాలి: గన్‌పార్క్‌ వద్ద బీజేపీ తీవ్ర నిరసన

Ponguleti Srinivas Reddy land scam allegations spark intense BJP protest at Gun Park
  • 22ఏ పేరుతో సాగుతున్న భూదందా వెనుక పొంగులేటి ఉన్నారన్న ఏలేటి మహేశ్వర్ రెడ్డి
  • భూ కుంభకోణంపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్
  • రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా అమలు కావడం లేదని మండిపాటు

రాష్ట్రంలో సెక్షన్ 22ఏ నిషిద్ధ భూముల పేరుతో సాగుతున్న భారీ భూదందా వెనుక మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హస్తముందని, ఈ అక్రమాల ద్వారా ఆయన వేల కోట్ల రూపాయలు వెనకేస్తున్నారని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. 


శాసనసభ సమావేశాల ప్రారంభం సందర్భంగా గన్‌పార్క్‌లోని అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించిన అనంతరం, బీజేపీ ఎమ్మెల్యేలతో కలిసి కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా ఫ్లకార్డులతో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన మహేశ్వర్ రెడ్డి... రాష్ట్రంలో అసలు రూల్ ఆఫ్ లా అనేది అమలు కావడం లేదని, దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే ప్రజలకు జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు.


22ఏ నిషిద్ధ భూముల జాబితా పేరుతో పేద, మధ్యతరగతి ప్రజల న్యాయమైన భూములను నిలిపివేసి వారిని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. తక్షణమే ఆ భూములకు రక్షణ కల్పించి రిజిస్ట్రేషన్లు పునరుద్ధరించాలని కోరారు. 22ఏ భూకుంభకోణంపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో సమగ్ర విచారణ జరిపించాలని, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి పొంగులేటిని బర్తరఫ్ చేయడంతో పాటు ఆయన రాజీనామాను ఆమోదించాలని పట్టుబట్టారు. 


రాబోయే శాసనసభ సమావేశాలను కనీసం 15 రోజుల పాటు నిర్వహించాలని అన్నారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ పెండింగ్ బకాయిలు, పోలీస్ నోటిఫికేషన్లు, ధరణి, భూభారతి అక్రమాలపై అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తామని హెచ్చరించారు.

Advertisement
Ponguleti Srinivas Reddy
Aleti Maheshwar Reddy
Section 22A land scam
Telangana BJP protest
Hyderabad Gun Park
Congress land corruption

More Telugu News