సింగపూర్‌లో భారతీయులపై ద్వేషపూరిత వ్యాఖ్యలు.. విచారణకు ఆదేశించిన సింగపూర్ ప్రభుత్వం
- భారత సంతతి ప్రజలు లక్ష్యంగా సింగపూర్‌లో జాత్యహంకార వ్యాఖ్యలు
- ఈ వ్యాఖ్యలు ఏ మాత్రం సహించరానివన్న మంత్రి షణ్ముగం
- పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని పోలీసులకు ఆదేశం
సింగపూర్‌లో స్థానిక భారతీయులను, భారత సంతతి ప్రజలను లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో సాగుతున్న జాత్యహంకార, ద్వేషపూరిత వ్యాఖ్యలపై ఆ దేశ ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇటీవల చైనా-నేపాల్ సరిహద్దుల్లో సంభవించిన ప్రకృతి వైపరీత్యంలో పలువురు సింగపూర్ పౌరులు గల్లంతైన ఘటనలతో పాటు, ఎయిర్ ఇండియాల్లో సింగపూర్ ఎయిర్‌లైన్స్ పెట్టుబడుల వ్యవహారాన్ని ముడిపెడుతూ కొంతమంది ఆన్‌లైన్‌లో భారతీయులపై తీవ్ర స్థాయిలో ద్వేషాన్ని చిమ్మడంపై సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్, సీనియర్ మంత్రులు కే. షణ్ముగం, లీ సీన్ లూంగ్‌లు తీవ్రంగా స్పందించారు.
ఈ జాత్యహంకార వ్యాఖ్యలను "అత్యంత సిగ్గుచేటు, హేయం, ఎంతమాత్రం సహించరానివి"గా అభివర్ణించిన సీనియర్ మంత్రి కె.షణ్ముగం, వీటిపై పూర్తిస్థాయి దర్యాప్తు జరపాలని పోలీసు యంత్రాంగాన్ని ఆదేశించారు. సమాజంలో మత, జాతిపరమైన సామరస్యానికి భంగం కలిగించే ఈ పోస్టులను వెంటనే తొలగించాలని డిజిటల్ అభివృద్ధి, సమాచార మంత్రిత్వ శాఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను కోరింది. ఏ ఒక్క వర్గంపైనా ద్వేషాన్ని సాధారణ అంశంగా మారనివ్వబోమని, తప్పు చేసిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని సింగపూర్ ప్రభుత్వం స్పష్టం చేసింది.