హైదరాబాద్ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. త్వరలో మెట్రో, ఆర్టీసీకి ఒకే పాస్

హైదరాబాద్ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. త్వరలో మెట్రో, ఆర్టీసీకి ఒకే పాస్

Good news for Hyderabad commuters soon common pass for Metro and RTC
  • హైదరాబాద్ మెట్రో, ఆర్టీసీ బస్సులకు ఉమ్మడి పాస్ జారీకి ఆదేశం
  • నెలవారీ, రోజువారీ పాస్‌లు అందుబాటులోకి తేవాలని సీఎస్ సూచన
  • పాతబస్తీ మెట్రో, ఎలివేటెడ్ కారిడార్ పనులు వేగవంతం చేయాలని ఆదేశం
  • బేగంపేట నుంచి ప్యారడైజ్ వరకు మెట్రోలో ప్రయాణించిన సీఎస్ సంజయ్ జాజు
  • ప్రాజెక్టులకు సీఎం రేవంత్ రెడ్డి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని వెల్లడి
నగర ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌లో మెట్రో రైలు, ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేందుకు వీలుగా ఒకే కామన్ పాస్‌ను వెంటనే అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు. ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా నెలవారీ, రోజువారీ పాస్‌లను జారీ చేయాలని ఆయన స్పష్టం చేశారు.

ఆదివారం రసూల్‌పురాలోని మెట్రో రైల్ భవన్‌లో హెచ్‌ఎంఆర్‌ఎల్, ఆర్టీసీ, విద్యుత్, మెట్రో వాటర్ వర్క్స్ అధికారులతో ఆయన ఉన్నతస్థాయి సమన్వయ సమావేశం నిర్వహించారు. ఉమ్మడి పాస్ జారీకి సాంకేతికంగా సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా అధికారులు సీఎస్‌కు వివరించారు. హైదరాబాద్ మెట్రో మొదటి, రెండో దశల్లో చేపట్టిన పనుల పురోగతిని మెట్రో రైల్ ఎండీ సర్ఫరాజ్ అహ్మద్ సీఎస్‌కు తెలియజేశారు.

ఈ సమావేశం అనంతరం సీఎస్ నగరంలో క్షేత్రస్థాయి పర్యటన చేపట్టారు. బేగంపేట నుంచి ప్యారడైజ్ వరకు మెట్రోలో ప్రయాణించి, స్టేషన్లలోని వాణిజ్య సముదాయాలు, పార్కింగ్ వసతులను పరిశీలించారు. హైదరాబాద్ పాతబస్తీలో 7.5 కిలోమీటర్ల మెట్రో కారిడార్ విస్తరణ పనుల పురోగతిని సమీక్షించి, వాటిని మరింత వేగవంతం చేయాలని ఆదేశించారు. అనంతరం ఎన్‌హెచ్-44పై ప్యారడైజ్ జంక్షన్ నుంచి డెయిరీ ఫామ్ రోడ్ వరకు నిర్మిస్తున్న 5.40 కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్ పనులను కూడా ఆయన పరిశీలించారు.

ఈ ప్రాజెక్టుల అమలులో ఎదురవుతున్న భూసేకరణ, బేగంపేట విమానాశ్రయం వద్ద సొరంగం నిర్మాణ అనుమతులు, రక్షణ శాఖ భూముల సేకరణ వంటి పెండింగ్ అంశాలపై అధికారులతో చర్చించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ప్రాజెక్టులకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారని, అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సంజయ్ జాజు స్పష్టం చేశారు.
Advertisement
Hyderabad Metro Rail
TSRTC
Common Mobility Pass
Sanjoy Jaju
Old City Metro Expansion
Hyderabad Metro Phase 2

More Telugu News