ఎన్టీఆర్ భరోసా: కొత్త లబ్ధిదారులకు అవకాశం.. నేటి నుంచి దరఖాస్తులు

ఎన్టీఆర్ భరోసా: కొత్త లబ్ధిదారులకు అవకాశం.. నేటి నుంచి దరఖాస్తులు

NTR Bharosa Applications for New Beneficiaries Start Today in Andhra Pradesh
  • కొత్త పింఛన్లకు సెప్టెంబర్ 16 వరకు దరఖాస్తుల స్వీకరణ
  • అక్టోబర్ 1 నుంచి కొత్త లబ్ధిదారులకు పింఛన్ల పంపిణీ
  • స్వర్ణగ్రామ, స్వర్ణవార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలి
  • ఆరు అంచెల తనిఖీ తర్వాత అర్హులను ఎంపిక చేయనున్న ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్‌లో అర్హులైన కొత్త లబ్ధిదారులకు ‘ఎన్టీఆర్ భరోసా’ పథకం కింద పింఛన్లు మంజూరు చేసే ప్రక్రియకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ మేరకు నూతన మార్గదర్శకాలను విడుదల చేసింది. సోమవారం నుంచి సెప్టెంబర్ 16 వరకు గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తులను స్వీకరించనున్నారు. దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను పూర్తి చేసి, అక్టోబర్ 1వ తేదీ నుంచి కొత్త లబ్ధిదారులకు పింఛన్ల పంపిణీని ప్రారంభించనున్నారు.

దరఖాస్తులను నేరుగా సచివాలయాల్లో సమర్పించవచ్చు లేదా అధికారిక వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 2019లో జారీ చేసిన జీవో నెం. 174 ప్రకారం నిర్దేశించిన ఆరు అంచెల తనిఖీ విధానం ద్వారానే అర్హులను ఎంపిక చేస్తారు. దరఖాస్తుల స్వీకరణ, ఆన్‌లైన్ నమోదు, ఈ-కేవైసీ ప్రక్రియ సెప్టెంబర్ 16తో ముగియనుంది. అనంతరం సెప్టెంబర్ 17 నుండి 24 వరకు క్షేత్రస్థాయి పరిశీలనతో పాటు ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్ల పర్యవేక్షణలో తనిఖీలు నిర్వహిస్తారు. సెప్టెంబర్ 26 నాటికి తుది జాబితాను ఆమోదించి, బడ్జెట్ కేటాయింపులను పూర్తి చేయనున్నారు.

లబ్ధిదారులు తమ దరఖాస్తులతో పాటు ఆధార్ కార్డు, రైస్ కార్డు లేదా ఆదాయ ధ్రువీకరణ పత్రాలను తప్పనిసరిగా జతచేయాలి. వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, చేనేత, మత్స్యకార వృత్తులకు చెందిన వారు ఆయా కేటగిరీలకు సంబంధించిన ధ్రువపత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తు ఆమోదం పొంది, ఉత్తర్వులు జారీ అయిన నెల నుంచే లబ్ధిదారులకు పింఛను అందజేస్తారు.

ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సుమారు 61.92 లక్షల మంది పింఛను పొందుతుండగా, దీనికోసం ప్రభుత్వం ప్రతి నెలా రూ. 2,694 కోట్లను వెచ్చిస్తోంది. పెంచిన నిబంధనల ప్రకారం వృద్ధాప్య, వితంతు పింఛను కింద నెలకు రూ. 4,000, దివ్యాంగులకు రూ. 6,000 చొప్పున అందజేస్తున్నారు. ఈ కొత్త పింఛన్ల ఎంపిక ప్రక్రియ మొత్తం జిల్లా కలెక్టర్ల ప్రత్యక్ష పర్యవేక్షణలో పారదర్శకంగా సాగనుంది.
Advertisement
NTR Bharosa
Andhra Pradesh Pensions
New Pension Applications
AP Government Schemes
NTR Bharosa Eligibility
Social Security Pensions AP

More Telugu News