కార్యకలాపాలు సున్నా.. విరాళాలు వేల కోట్లు.. గుజరాత్ పార్టీల వింత తీరు!

కార్యకలాపాలు సున్నా.. విరాళాలు వేల కోట్లు.. గుజరాత్ పార్టీల వింత తీరు!

Zero activity thousands of crores in donations strange behavior of Gujarat parties
  • గుజరాత్‌లోని 6 చిన్న పార్టీలకు రూ.1700 కోట్ల విరాళాలు
  • ప్రముఖ జాతీయ, ప్రాంతీయ పార్టీలను మించిపోయిన వసూళ్లు
  • కార్యకలాపాలు నామమాత్రం.. నిధులపై బలపడుతున్న అనుమానాలు
  • బీజేపీ నేత స్థాపించిన పార్టీకి అత్యధికంగా రూ.620 కోట్ల నిధులు
  • నిధుల మళ్లింపునకు డొల్ల పార్టీల వినియోగమంటూ గతంలోనే సీబీడీటీ ఆందోళన
దేశ రాజకీయాల్లో పెద్దగా పరిచయం లేని కొన్ని పార్టీలు విరాళాల సేకరణలో మాత్రం జాతీయ పార్టీలనే మించిపోతున్నాయి. చురుకైన రాజకీయ కార్యకలాపాలు ఏవీ నిర్వహించకపోయినా, వీటికి వందల కోట్లలో నిధులు వచ్చిపడుతుండటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తాజాగా 2023-24 ఆర్థిక సంవత్సరంలో గుజరాత్‌ కేంద్రంగా పనిచేస్తున్న ఆరు చిన్న పార్టీలకు ఏకంగా రూ.1,700 కోట్ల విరాళాలు అందినట్లు ఓ మీడియా సంస్థ అధ్యయనంలో వెల్లడైంది. ఈ పరిణామం రాజకీయ నిధుల పారదర్శకతపై తీవ్ర సందేహాలను రేకెత్తిస్తోంది.

గుజరాత్‌కు చెందిన ఆమ్ జన్మత్ పార్టీకి రూ. 620 కోట్లు, సత్యవాది రక్షక్ పార్టీకి రూ. 330.55 కోట్లు, స్వతంత్రత అభివ్యక్తి పార్టీకి రూ. 219.69 కోట్లు అందాయి. వీటితో పాటు న్యూ ఇండియా యునైటెడ్ పార్టీకి రూ. 200.69 కోట్లు, భారతీయ నేషనల్ జనతాదళ్‌కు రూ. 191.61 కోట్లు, గరీబ్ కల్యాణ్ పార్టీకి రూ. 138 కోట్ల చొప్పున భారీగా విరాళాలు వచ్చాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ ఆరు పార్టీలు కలిసి 2024 లోక్‌సభ ఎన్నికల్లో కేవలం 15 స్థానాల్లోనే అభ్యర్థులను నిలబెట్టాయి. అత్యధికంగా రూ.620 కోట్లు అందుకున్న ఆమ్ జన్మత్ పార్టీ, రూ. 330 కోట్లు స్వీకరించిన సత్యవాది రక్షక్ పార్టీ చెరొక అభ్యర్థినే బరిలో దింపడం గమనార్హం.

ఇదే సమయంలో దేశంలోని ప్రధాన పార్టీలకు అందిన విరాళాలతో పోల్చి చూస్తే ఈ వ్యత్యాసం స్పష్టంగా కనిపిస్తుంది. 2023-24లో కాంగ్రెస్‌కు రూ.281.48 కోట్లు, బీఆర్‌ఎస్‌కు రూ.85 కోట్లు, డీఎంకేకు రూ.15.24 కోట్లు, ఆమ్ ఆద్మీ పార్టీకి రూ.10.15 కోట్లు, సీపీఎంకు రూ.7.64 కోట్లు మాత్రమే విరాళాలుగా అందాయి.

అనుమానాలకు తావిస్తున్న అంశాలు
అత్యధిక విరాళాలు పొందిన ఆమ్ జన్మత్ పార్టీని 2020లో పట్నాలో స్థాపించారు. దీని వ్యవస్థాపకురాలు అనామిక పాశ్వాన్ ప్రస్తుతం బిహార్ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా ఉన్నారు. అయితే పార్టీ కార్యాలయాన్ని గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు మార్చినప్పుడే తాను అధ్యక్ష పదవికి రాజీనామా చేశానని ఆమె స్పష్టం చేశారు. ఈ పార్టీకి 2022-23లోనూ రూ. 216 కోట్లు అందాయి. క్షేత్రస్థాయిలో పరిశీలించగా, ఈ పార్టీల కార్యాలయాలు చాలావరకు మూసి ఉండగా, బాధ్యులు కూడా అందుబాటులో లేరని తెలిసింది.

అయితే, సత్యవాది రక్షక్ పార్టీ మాత్రం తమకు వచ్చిన రూ. 330 కోట్లలో రూ. 316 కోట్లను సామాజిక సంక్షేమ కార్యక్రమాలకు, రూ.8.48 కోట్లను ఎన్నికల ప్రచారానికి ఖర్చు చేసినట్లు ఎన్నికల సంఘానికి సమర్పించిన ఆడిట్ నివేదికలో పేర్కొంది. దీంతో, ఎన్నికల్లో ఉనికి కూడా లేని ఈ పార్టీలకు ఇంత భారీగా నిధులు ఎందుకు వస్తున్నాయి? అవి ఎవరికి చేరుతున్నాయి? నల్లధనాన్ని తెల్లధనంగా మార్చేందుకే ఈ డొల్ల పార్టీలను వాడుకుంటున్నారా? అనే సందేహాలు బలపడుతున్నాయి.

దేశంలో 2,800కు పైగా నమోదిత, గుర్తింపులేని పార్టీలు ఉండగా, వాటిలో 73 శాతం తమ ఆర్థిక వివరాలను వెల్లడించడం లేదని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) గతంలోనే తెలిపింది. రాజకీయ కార్యకలాపాలు నిర్వహించని కొన్ని పార్టీలను నిధుల మళ్లింపునకు ఉపయోగిస్తున్నారని ఆదాయపన్ను శాఖకు చెందిన సీబీడీటీ సైతం గతంలో ఆందోళన వ్యక్తం చేసింది. తాజా పరిణామాలు ఆ ఆందోళనలకు బలం చేకూరుస్తున్నాయి.
Advertisement
Aam Janmat Party
Gujarat Political Parties
Political Donations India
Satyawadi Rakshak Party
Election Commission of India
Political Funding Transparency

More Telugu News