భారత్ చేతిలో ఘోర ఓటమి.. అయినా మేమే బెస్ట్: పాక్ కోచ్ వహాబ్ రియాజ్

Wahab Riaz says Pakistan is the best team despite crushing defeat to India
  • మహిళల ఆసియా కప్‌లో భారత్ చేతిలో చిత్తుగా ఓడిన పాకిస్థాన్
  • కేవలం 55 పరుగులకే కుప్పకూలిన పాక్ మహిళల జట్టు
  • అయినా టోర్నీలో మేమే ఉత్తమ జట్టన్న కోచ్ వహాబ్ రియాజ్
  • జట్టు ఎంపికపై కెప్టెన్ సనా మీర్ తీవ్ర అసంతృప్తి.. కోచ్‌తో విభేదాలు
  • కెప్టెన్ అభిప్రాయాన్ని తోసిపుచ్చిన కోచ్.. భవిష్యత్తు కోసమే మార్పులన్న వహాబ్
మహిళల ఆసియా కప్ 2026లో భాగంగా నిన్న‌ భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టు ఘోర పరాజయాన్ని చవిచూసింది. అయితే, ఈ ఓటమి తర్వాత పాక్ మహిళల జట్టు కోచ్ వహాబ్ రియాజ్ చేసిన వ్యాఖ్యలు క్రీడా వర్గాలను విస్తుపోయేలా చేశాయి. టీమిండియా చేతిలో చిత్తుగా ఓడినప్పటికీ, ఈ టోర్నీలో తమ జట్టే అత్యుత్తమమైనదని ధీమా వ్యక్తం చేశాడు.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్, భారత బౌలర్ల ధాటికి కేవలం 18.1 ఓవర్లలో 55 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్లు మునీబా అలీ, షావల్ జుల్ఫికర్ మినహా మరే బ్యాటర్ కూడా రెండంకెల స్కోరు చేయలేకపోయారు. భారత బౌలర్లలో శ్రీ చరణి 3, దీప్తి శర్మ 2, ప్రేమ రావత్ 2 వికెట్లతో పాక్ పతనాన్ని శాసించారు. అనంతరం 56 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని టీమిండియా కేవలం 8.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి సునాయాసంగా ఛేదించింది.

మ్యాచ్ అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడిన వహాబ్ రియాజ్.. "మా జట్టులోని క్రీడాకారిణులంతా ఎంతో నైపుణ్యం ఉన్నవారు. వారు తమను తాము నమ్మాలి. భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో చేసిన తప్పులపై చర్చిస్తాం. వాటిని పునరావృతం చేయకుండా చూసుకుంటాం. ఈ ఆసియా కప్‌లో ట్రోఫీ గెలవడానికి పాకిస్థానే అత్యుత్తమ జట్టు అని నేను ఇప్పటికీ నమ్ముతున్నాను. ఎందుకంటే ఇక్కడి పరిస్థితులు మాకు బాగా అనుకూలిస్తాయి" అని వ్యాఖ్యానించాడు.

కోచ్, కెప్టెన్ మధ్య విభేదాలు
అయితే, జట్టు కూర్పు విషయంలో కోచ్ వహాబ్ రియాజ్‌తో కెప్టెన్ సనా మీర్ పూర్తిగా విభేదించింది. ఆసియా కప్ కోసం ఏకంగా 7 మంది క్రీడాకారిణులను జట్టు నుంచి తొలగించడంపై ఆమె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కెప్టెన్ వ్యాఖ్యలపై వహాబ్ రియాజ్ స్పందిస్తూ.. "అది సనా మీర్ వ్యక్తిగత అభిప్రాయం. దానితో నాకు సంబంధం లేదు. మేము భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఈ మార్పులు చేశాం. గతంలో ఆడిన అమ్మాయిలు ఎన్నో ప్రపంచకప్‌లు, ఆసియా కప్‌లు ఆడినా ఫలితాలు రాలేదు. అందుకే కొత్త ముఖాలకు అవకాశం ఇచ్చి, రాబోయే టోర్నమెంట్ల కోసం జట్టును నిర్మించాల్సిన సమయం వచ్చింది" అని స్పష్టం చేశాడు.

జట్టు నుంచి తొలగించిన క్రీడాకారిణులు అస్సలు రాణించడం లేదని, అందుకే కొత్తవారికి అవకాశం ఇవ్వడమే సరైన నిర్ణయమని గట్టిగా సమర్థించుకున్నాడు. ఈ పరిణామాల నేపథ్యంలో సెమీఫైనల్ ఆశలు సజీవంగా ఉండాలంటే పాకిస్థాన్ తమ తదుపరి మ్యాచ్‌లో హాంకాంగ్‌పై తప్పనిసరిగా గెలవాల్సిన క్లిష్ట పరిస్థితి ఏర్ప‌డింది.
Advertisement
Wahab Riaz
India vs Pakistan Women Asia Cup 2026
Pakistan Womens Cricket Team
Sana Mir
Womens Asia Cup Highlights
India Women vs Pakistan Women

More Telugu News