కొండా సురేఖను తొలగించారు.. పొంగులేటి సంగతి ఏమిటి?: హరీశ్ రావు

Harish Rao asks why Ponguleti Srinivas Reddy is not removed like Konda Surekha
  • రేవంత్ ను వ్యక్తిగతంగా విమర్శించారనే కొండా సురేఖపై వేటు వేశారన్న హరీశ్
  • 22ఏ పేరుతో రైతులను పీడిస్తున్న పొంగులేటిపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్న
  • భూముల చుట్టూనే రేవంత్ రెడ్డి తిరుగుతున్నాడని మండిపాటు

తనను వ్యక్తిగతంగా విమర్శించారనే కారణంతోనే కొండా సురేఖను సీఎం రేవంత్ రెడ్డి మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేశారని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. సురేఖపై చర్యలు తీసుకున్న రేవంత్... 22ఏ నిషేధిత భూముల పేరిట రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలను, రైతులను పట్టి పీడిస్తున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు. రేవంత్ రెడ్డికి, పొంగులేటికి మధ్య ఉన్న రహస్య ఒప్పందం ఏమిటో ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేశారు. పేదల పట్టా భూములను ఆదరాబాదరాగా నిషేధిత జాబితాలో చేర్చి తీవ్ర ఇబ్బందులకు గురిచేసిన పొంగులేటిని అసెంబ్లీకి రాకుండా నిషేధించాలని డిమాండ్ చేశారు.


సూర్యుడి చుట్టూ భూమి తిరిగితే... కాంగ్రెస్ పాలనలో భూముల చుట్టూనే రేవంత్ రెడ్డి తిరుగుతున్నారని హరీశ్ రావు ధ్వజమెత్తారు. సీఎం రేవంత్ రెడ్డి ఇల్లు కూడా 22ఏ పరిధిలోనే ఉందని, తన ఇల్లు జాబితాలో పడగానే రాత్రికి రాత్రే ఆంక్షలు తొలగించుకున్న రేవంత్ రెడ్డి... పేద ప్రజల భూములకు వచ్చేసరికి ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని ప్రశ్నించారు. ఒక్క కాగజ్‌నగర్ నియోజకవర్గంలోనే ఏకంగా 42,867 ఎకరాల రైతుల పట్టా భూములను 22ఏ జాబితాలో బందీ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి నిషేధిత జాబితాలోని పేదల భూములను విడుదల చేయాలని, లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులతో కలిసి అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు.


భూ సమస్యలపై ప్రశ్నిస్తున్న రైతులను కబ్జాదారులు అని సంబోధిస్తూ అవమానించిన రేవంత్ రెడ్డి తక్షణమే బేషరతుగా క్షమాపణ చెప్పాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. భూములు 22ఏ జాబితాలోకి వెళ్లడంతో బ్యాంకులు రుణాలు ఇవ్వకుండా రైతులను ఇబ్బందులు పెడుతున్నాయని మండిపడ్డారు. ఇది ఇందిరమ్మ రాజ్యమా లేక కబ్జాల రాజ్యమా అని నిలదీశారు.

Advertisement
Harish Rao
Revanth Reddy
Ponguleti Srinivas Reddy
Konda Surekha
22A Land Issue
Telangana Politics

More Telugu News