మద్యం మత్తులో మహిళపై అత్యాచారయత్నం.. కామాంధుడికి బుద్ధి చెప్పిన వీధికుక్క.. సీసీటీవీలో రికార్డైన షాకింగ్ దృశ్యం!

Stray dog saves woman from attempted sexual assault in Coimbatore shocking CCTV video goes viral
  • మ‌తిస్థిమితం లేని మ‌హిళ‌పై లైంగిక దాడికి యత్నించిన మైనర్
  • అడ్డుకుని, నిందితుడిని కరిచి తరిమిన వీధికుక్క
  • కోయంబత్తూరులో సీసీటీవీ ఫుటేజ్‌తో వెలుగులోకి వచ్చిన ఘటన
  • నిందితుడిని అరెస్ట్ చేసి అబ్జర్వేషన్ హోంకు పంపిన పోలీసులు
తమిళనాడులోని కోయంబత్తూరులో జరిగిన ఓ ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మ‌తిస్థిమితం లేని మ‌హిళ‌పై ఓ మైనర్ బాలుడు లైంగిక దాడికి ప్రయత్నించగా, వీధికుక్క అడ్డుకుని ఆమెను కాపాడింది. విశ్వాసానికి ప్రతీకగా నిలిచిన ఈ శునకం చర్య, అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డ్ కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారి, ఆ శునకంపై ప్రశంసల వర్షం కురిపిస్తోంది.

వివరాల్లోకి వెళితే.. కోయంబత్తూరు సమీపంలోని తుడియలూరు వద్ద ఉన్న రైల్వే ఓవర్‌బ్రిడ్జి సర్వీస్ రోడ్డులో గురువారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. మ‌తిస్థిమితం లేని ఓ మహిళ రోడ్డు పక్కన వీధికుక్క దగ్గర కూర్చుని ఉంది. అదే సమయంలో, మద్యం మత్తులో ఉన్న 17 ఏళ్ల బాలుడు అక్కడికి వచ్చాడు. మొదట ఆ కుక్కను అక్కడి నుంచి తరిమేందుకు ప్రయత్నించాడు. ఆ తర్వాత మహిళపై లైంగిక దాడికి ఒడిగట్టడంతో ఆమె గట్టిగా కేకలు వేసింది.

ఆమె అరుపులు విన్న వెంటనే ఆ కుక్క స్పందించింది. అది ఒక్కసారిగా ఆ బాలుడిపై దాడి చేసి, అతని కాళ్లను కరిచింది. దాని దాడికి భయపడిన నిందితుడు అక్కడి నుంచి పరుగులు పెట్టగా, అది అతడిని కొంత దూరం వరకు తరిమింది. ఈ దృశ్యాలన్నీ సమీపంలోని సీసీటీవీ కెమెరాలో స్పష్టంగా నమోదయ్యాయి.

ఈ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. నిందితుడిని అదే రోజు గుర్తించి అరెస్ట్ చేశారు. అనంతరం అతడిని కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం అబ్జర్వేషన్ హోంకు తరలించింది. ఈ ఘటనపై పోలీసులు తదుపరి విచారణ జరుపుతున్నారు.

కాగా, ఈ వీడియో ఆన్‌లైన్‌లో వైరల్ కావడంతో నెటిజన్ల నుంచి తీవ్ర స్పందన వస్తోంది. అబల అని కూడా చూడకుండా దాడికి యత్నించిన యువకుడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, నిస్సహాయురాలైన మహిళను కాపాడిన శునకంపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వీధికుక్కలు కూడా సమాజానికి ఎంతగా ఉపయోగపడతాయో ఈ ఘటనే నిదర్శనమని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రజా భద్రత, వీధి జంతువుల పట్ల వ్యవహరించాల్సిన తీరుపై కూడా విస్తృతమైన చర్చ జరుగుతోంది.
Advertisement
Stray Dog
Coimbatore
Tamil Nadu
Woman Safety
CCTV Viral Video
Minor Arrested

More Telugu News