నెల్లూరు సర్వేపల్లి కాలువ కట్టవాసుల 60 ఏళ్ల నిరీక్షణకు తెర

Nellore Sarvepalli Canal bund residents 60 year wait ends as AP government grants house pattas
  • నెల్లూరు సర్వేపల్లి కాలువ కట్టవాసులకు ఇళ్ల పట్టాల మంజూరు
  • 60 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న సమస్యకు పరిష్కారం
  • 1,215 పేద కుటుంబాలకు లబ్ధి చేకూర్చేలా కేబినెట్ నిర్ణయం
  • మంత్రి నారాయణ చొరవతో సీఎం చంద్రబాబు ఆమోదం
  • త్వరలో సీఎం చేతుల మీదుగా పట్టాల పంపిణీకి ఏర్పాట్లు
నెల్లూరు నగరంలో ఆరు దశాబ్దాలుగా నలుగుతున్న తీవ్రమైన సమస్యకు ఏపీప్రభుత్వం పరిష్కారం చూపింది. సర్వేపల్లి కాలువ కట్టపై నివసిస్తున్న సుమారు 1,215 నిరుపేద కుటుంబాలకు శాశ్వత నివాస హక్కు కల్పిస్తూ ఇళ్ల పట్టాలు మంజూరు చేసేందుకు రాష్ట్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. దశాబ్దాల తరబడి అభద్రతాభావంతో జీవిస్తున్న పేదల సొంతింటి కలను నెరవేరుస్తూ ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది.

ఏళ్ల తరబడి ఎదురుచూపులు.. 
గత 60 ఏళ్లుగా సర్వేపల్లి కాలువ కట్టపై వేలాది మంది నిరుపేదలు నివాసముంటున్నారు. అయితే, ఆ స్థలాలకు వారికి చట్టబద్ధమైన హక్కులు లేవు. కాలువ పోరంబోకు భూమి కావడంతో, ఎప్పుడు తమ నివాసాలు ఖాళీ చేయిస్తారోనన్న భయంతోనే వారు జీవనం సాగిస్తున్నారు. గతంలో ఎన్నో ప్రభుత్వాలు పట్టాలు ఇస్తామని హామీలు ఇచ్చినా, అవి కార్యరూపం దాల్చలేదు. దీంతో అక్కడి ప్రజల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.

మంత్రి నారాయణ చొరవతో పరిష్కారం.. 
ప్రస్తుత ప్రభుత్వంలో మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నారాయణ, ఈ దీర్ఘకాలిక సమస్యపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. కాలువ కట్ట వాసుల ఇబ్బందులను, వారి ఆవేదనను ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి, సమస్య పరిష్కారానికి కృషి చేశారు. ఇటీవల భగత్ సింగ్ కాలనీ వాసుల సమస్యను పరిష్కరించిన స్ఫూర్తితో, ఈ అంశాన్ని కూడా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది.

కేబినెట్ సమావేశంలో ఈ అంశంపై చర్చించి, మొత్తం 62.70 ఎకరాల భూమిలో 22.31 ఎకరాలను కెనాల్ పోరంబోకు నుంచి 'ఏడబ్ల్యూ డ్రై'గా వర్గీకరణ మార్చేందుకు ఆమోదం తెలిపారు. ఈ ప్రక్రియలో కాలువ నిర్వహణ హక్కులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ నిర్ణయంతో 1,215 కుటుంబాలకు అధికారికంగా ఇళ్ల పట్టాలు పొందేందుకు మార్గం సుగమమైంది.

ప్రభుత్వ నిర్ణయం పట్ల మంత్రి నారాయణ హర్షం వ్యక్తం చేశారు. 60 ఏళ్ల కలను నిజం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. త్వరలోనే ముఖ్యమంత్రి చేతుల మీదుగా లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేస్తామని ప్రకటించారు. కేబినెట్ నిర్ణయంతో సర్వేపల్లి కాలువ కట్ట వాసులు సంబరాలు చేసుకుంటున్నారు. తమ చిరకాల స్వప్నాన్ని నెరవేర్చిన సీఎం చంద్రబాబు, మంత్రి నారాయణలకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
Advertisement
Minister Narayana
Nellore Sarvepalli Canal
AP Cabinet house pattas
Chandrababu Naidu
Sarvepalli Canal residents
Nellore housing rights

More Telugu News