దమ్ముంటే హరీశ్ రావు భార్య నాపై పోటీ చేయాలి: కవిత
- తనపై ఎవరు పోటీ చేసినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానన్న కవిత
- తాను సీఎం కావాలని కోరుకుంటున్నానని వెల్లడి
- బీజేపీతో హరీశ్ రహస్య ఒప్పందాలు చేసుకుంటున్నారని ఆరోపణ
తెలంగాణలో రాజకీయ ప్రత్యర్థుల మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లు తీవ్ర స్థాయికి చేరాయి. నూతనంగా తెలంగాణ రక్షణ సేన పార్టీని స్థాపించిన కల్వకుంట్ల కవిత... బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు లక్ష్యంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే ఎన్నికల్లో ధైర్యముంటే హరీశ్‌రావు తన భార్యను తనపై పోటీకి దింపాలని బహిరంగ సవాల్ విసిరారు.
తనపై ఎవరు పోటీ చేసినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన కవిత... హరీశ్‌రావు నేరుగా బరిలోకి రాకుండా తెరవెనుక రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. అవసరమని భావిస్తే రాజకీయాలను పక్కనపెట్టి ఆయన తన భార్యను బరిలోకి దించవచ్చని, ఆమె తనపై పోటీ చేసినా స్వాగతిస్తానని స్పష్టం చేశారు. గతంలో సిద్దిపేట నుంచి హరీశ్‌రావుపై పోటీ చేస్తానని చెప్పిన మాటను గుర్తు చేసిన కవిత... వచ్చే ఎన్నికల్లో తాను సిద్దిపేట లేదా బోధన్ నియోజకవర్గాల నుంచి పోటీ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్లు సంకేతాలిచ్చారు.
ఇదే సమయంలో ముఖ్యమంత్రి పదవిపై తన ఆకాంక్షను కవిత బహిరంగంగా వెల్లడించారు. తాను సీఎం కావాలని అనుకుంటున్నానని, ఆ పదవికి హుందాతనం, గౌరవం చాలా ముఖ్యమని వ్యాఖ్యానించారు. హరీశ్‌రావు బీజేపీతో రహస్య ఒప్పందాలు చేసుకుంటున్నారని ఆరోపించారు.