36 వేల కి.మీ ఎత్తు నుంచి భారత్‌పై నిఘా.. ఈఓఎస్‌-05తో ఇస్రో భారీ ప్రయోగం!

ISRO Massive Launch with EOS-05 for Surveillance over India from 36000 km Altitude
  • సెప్టెంబర్‌ 4న ఈఓఎస్‌-05 ప్రయోగం
  • తెల్లవారుజామున 2.55 గంటలకు లాంచ్‌
  • జీఎస్‌ఎల్‌వీ-ఎప్‌17తో ఉపగ్రహ ప్రయోగం
  • దాదాపు 36 వేల కి.మీ. ఎత్తులో నిఘా
  • సరిహద్దులు, తీరాలపై నిఘాకు ఉపయోగం
దాదాపు ఎనిమిది నెలల విరామం తర్వాత ఇస్రో మరో కీలక ప్రయోగానికి సిద్ధమైంది. వరుసగా రెండు పీఎస్‌ఎల్‌వీ ప్రయోగాలు విఫలమైన నేపథ్యంలో.. ఈసారి జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్17తో ప్రతిష్ఠాత్మక మిషన్‌ను చేపట్టనుంది. సెప్టెంబర్‌ 4న తెల్లవారుజామున 2.55 గంటలకు శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ నుంచి రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లనుంది.

ఈ మిషన్‌లో ఈఓఎస్‌-05 ఎర్త్‌ అబ్జర్వేషన్‌ శాటిలైట్‌ను అంతరిక్షంలోకి పంపనున్నారు. భూమికి దాదాపు 36 వేల కిలోమీటర్ల ఎత్తులో పనిచేసే ఈ ఉపగ్రహం.. భారత్‌కు ఆకాశం నుంచి నిరంతర నిఘా సామర్థ్యాన్ని అందించనుంది. దేశ భూభాగం, తీరప్రాంతాలు, వాతావరణ వ్యవస్థలు, విపత్తులకు గురయ్యే ప్రాంతాలను ఎప్పటికప్పుడు గమనించేందుకు ఇది ఉపయోగపడుతుంది. హై రిజల్యూషన్‌ కెమెరా ద్వారా సరిహద్దుల భద్రతకు కూడా తోడ్పడనుంది.

ఈఓఎస్‌-05ను సబ్‌-జియోసింక్రోనస్‌ ట్రాన్స్‌ఫర్‌ ఆర్బిట్‌లోకి ప్రవేశపెట్టేలా మిషన్‌ను రూపొందించారు. జియోసింక్రోనస్‌ ఆర్బిట్‌ నుంచి పనిచేసే తొలి భారతీయ ఇమేజింగ్‌ శాటిలైట్‌గా ఈఓఎస్‌-05 ప్రత్యేకత సాధించనుంది. దీని ప్రయోగ బరువు సుమారు 2,367 కిలోలు.

ఈ ప్రయోగానికి ఉపయోగిస్తున్న జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌17 రాకెట్‌ 51.7 మీటర్ల ఎత్తు ఉంటుంది. లిఫ్టాఫ్‌ సమయంలో దాని బరువు 420.5 టన్నులు. మూడు దశలతో రూపొందిన ఈ రాకెట్‌లో 4 మీటర్ల వ్యాసం ఉన్న పేలోడ్‌ ఫెయిరింగ్‌ ఉంటుంది.

మొదటి దశలో భారీ ఎస్‌-139 ఘన ఇంధన మోటార్‌తో పాటు నాలుగు ద్రవ ఇంధన బూస్టర్లు పనిచేస్తాయి. ఎస్‌-139లోనే 138 టన్నుల ఘన ఇంధనం ఉంటుంది. నాలుగు బూస్టర్లలో కలిపి సుమారు 170 టన్నుల యూహెచ్‌25, నైట్రోజన్‌ టెట్రాక్సైడ్‌ ఇంధనాలు ఉంటాయి.

రెండో దశలో ద్రవ ఇంధన సాంకేతికతను ఉపయోగించారు. ఇందులో 42 టన్నుల యూహెచ్‌25, డైనైట్రోజన్‌ టెట్రాక్సైడ్‌ ఉంటాయి. చివరి దశలో భారతీయ క్రయోజెనిక్‌ అప్పర్‌ స్టేజ్‌ సీయూఎస్‌-5 కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులో లిక్విడ్‌ హైడ్రోజన్‌, లిక్విడ్‌ ఆక్సిజన్‌తో కలిపి 15 టన్నుల క్రయోజెనిక్‌ ఇంధనం ఉంటుంది.

చివరి దశ తన పని పూర్తిచేసిన తర్వాత ఈఓఎస్‌-05 ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెడుతుంది. ఆ తర్వాత భూమిపైకి నిరంతర నిఘా అందించే ఈ ‘హాక్‌ ఐ’ తన అసలు పని మొదలుపెట్టనుంది.
Advertisement
ISRO
EOS 05
GSLV F17
Sriharikota
Earth Observation Satellite
Satellite Launch

More Telugu News