కల్వకుంట్ల కవితకు కౌంటర్ ఇచ్చిన వేముల ప్రశాంత్ రెడ్డి
- కవిత చర్యల వల్ల కేసీఆర్ మనోవేదనకు గురవుతున్నారన్న ప్రశాంత్ రెడ్డి
- కేసీఆర్, కవితలను కలపడానికే తాను ప్రయత్నించానని వెల్లడి
- కవిత మధ్యలో వచ్చి మధ్యలోనే వెళ్లిపోయారని ఎద్దేవా
కష్టకాలంలో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ వెంట ఉన్నది ఎవరో కవిత తెలుసుకోవాలని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఘాటుగా వ్యాఖ్యానించారు. తనపై కవిత చేసిన ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. కవిత చర్యల వల్ల తండ్రి కేసీఆర్ ఎంతటి మనోవేదనకు గురవుతున్నారో ఆమె ఆలోచించుకోవాలని... తాను ఎప్పుడూ కేసీఆర్-కవితలను కలపడానికే ప్రయత్నించాను తప్ప విడగొట్టడానికి కాదని స్పష్టం చేశారు.
తాను, తన తండ్రి వేముల సురేందర్ రెడ్డి 2001లో పార్టీ ఆవిర్భావానికి ముందే కేసీఆర్ వెంటే ఉన్నామని, తాము టీఆర్ఎస్ (బీఆర్‌ఎస్) వ్యవస్థాపక సభ్యులమని గుర్తుచేశారు. "బీఆర్‌ఎస్ అంటేనే ప్రశాంత్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి అంటేనే బీఆర్‌ఎస్" అని పేర్కొన్న ఆయన... కవిత మధ్యలో వచ్చి మధ్యలోనే వెళ్లిపోయారని ఎద్దేవా చేశారు. పార్టీ లైన్ దాటినందుకే ఆమెపై చర్యలు తీసుకున్నారని తెలిపారు.
అసెంబ్లీ లోపలా బయటా రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై నిరంతరం పోరాడుతున్నది ఎవరో ప్రజలందరికీ తెలుసన్నారు. తాను కాంగ్రెస్ నాయకులతో ఎలాంటి మంతనాలు జరపలేదని యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సన్నిధానంలో ప్రమాణపూర్వకంగా చెప్పగలనని... మరి కాంగ్రెస్‌తో కవిత రహస్య మంతనాలు జరపలేదని ఆమె చెప్పగలరా? అని నిలదీశారు.
కేసీఆర్‌కు అత్యంత ఆప్తులుగా, బలంగా ఉన్న నాయకులపై నిరాధార ఆరోపణలు చేస్తూ... పార్టీని బలహీనపరిచి పరోక్షంగా అధికార కాంగ్రెస్ పార్టీకి కవిత లబ్ధి చేకూరుస్తున్నారని ఆరోపించారు. సభలో ఆమె కన్నీళ్లు పెట్టుకోవడం కేవలం రాజకీయం కోసం, సానుభూతిని పొందేందుకేనని విమర్శించారు. కవితను రెండుసార్లు ఎమ్మెల్సీని చేయడంలో తన పాత్ర ఏంటో కేసీఆర్‌కు స్పష్టంగా తెలుసని, నిన్నటి వరకు ఆమెపై ఉన్న గౌరవాన్ని తన వ్యాఖ్యలతో కవిత స్వయంగా పోగొట్టుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.