రుత్విక్ - విశాఖ ధీమాన్ జంటగా నటించిన సినిమానే 'రాజా ది రాజా'. ఈ ఇద్దరికీ ఇదే మొదటి సినిమా కావడం విశేషం. అనిల్ బోయిడపు దర్శకత్వం వహించిన ఈ సినిమా, జులై 17వ తేదీన థియేటర్లకు వచ్చింది. థియేటర్స్ వైపు నుంచి పెద్దగా మెప్పించలేకపోయిన ఈ సినిమా, ఆగస్టు 21వ తేదీ నుంచి 'అమెజాన్ ప్రైమ్'లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతో పాటు ఇతర భాషల్లోను అందుబాటులోకి వచ్చింది. ఈ సినిమా కథేమిటనేది ఇప్పుడు చూద్దాం.
విశాఖపట్నంలో సత్యం (నరేశ్) ఒక డాక్టర్ గా చిన్న క్లినిక్ నడుపుతుంటాడు. భార్య .. కొడుకు 'రాజా' ( రుత్విక్) ఇదే అతని ఫ్యామిలీ. తన కొడుకు రాజా పెద్ద డాక్టర్ గా పేరు తెచ్చుకోవాలనేది ఆయన ఆశ. అయితే రుత్విక్ కి ఫ్యాషన్ డిజైనర్ కావాలనే కోరిక బలంగా ఉంటుంది. ఆ విషయాన్ని తండ్రికి చెబితే ఒప్పుకోడని భావించిన ఆయన, మెడికల్ కాలేజ్ కి వెళ్లి వస్తున్నట్టుగా నటిస్తుంటాడు. ఫ్యాషన్ డిజైనర్ గా జాబ్ సంపాదించి ఆ దిశగా ముందుకు వెళుతుంటాడు.
తాను డిజైన్ చేసిన డ్రెస్ లతో ఫ్యాషన్ షోలో పాల్గొనే ఒక అందమైన అమ్మాయి కోసం ఆయన అన్వేషిస్తూ ఉంటాడు. ఈ నేపథ్యంలోనే ఆయనకి 'ఆద్య' అనే ఒక యువతి తారసపడుతుంది. తన సహాయకురాలైన కుమారితో కలిసి, కొత్తగా ఆమె వైజాగ్ వచ్చిందనే విషయం రాజాకి అర్థమవుతుంది. తాము వచ్చింది 'మహీగఢ్' అనే ప్రాంతం నుంచి అంటూ ఆమె ఒక యువరాణిలా మాట్లాడినప్పటికీ, రాజా పెద్దగా పట్టించుకోడు. 'ఆద్య'ను ఫ్యాషన్ షోకి ఒప్పించాలనే విషయంపైనే అతని దృష్టి ఉంటుంది.
ఈ విషయంపై ఆద్యా చుట్టూ తిరుగుతూనే ఆమెపై రాజా మనసు పారేసుకుంటాడు. ఆమె కూడా అతని వ్యక్తిత్వం పట్ల ఆకర్షితురాలవుతుంది. ఇలాంటి పరిస్థితులలోనే రాజా తనని మోసం చేశాడనే విషయం సత్యానికి తెలుస్తుంది. అతనికి డాక్టర్ కావాలనే ఆలోచన లేదనీ, ఫ్యాషన్ డిజైనర్ గా స్థిరపడాలనే ఆలోచన చేస్తున్నాడని అర్థమవుతుంది. అదే సమయంలో 'ఆద్య' ఒక ద్వీపానికి చెందిన యువరాణీ అనీ, బయట ప్రపంచం నిజంగానే ఆమెకి కొత్త అనే సంగతి రాజాకి తెలుస్తుంది. దాంతో అతను ఆద్యాను వెతుక్కుంటూ వెళ్లి ఆమె రాజ్యంలో అడుగుపెడతాడు. అక్కడ అతనికి ఎదురయ్యే అనుభవాలు ఎలాంటివి? అనేదే కథ.
ఆధునీకతకు అందకుండా ఒక ద్వీపంలో హాయిగా జీవిస్తున్న 'ఆద్య', తన సహాయకురాలుతో కలిసి వైజాగ్ నగరానికి వస్తుంది. అక్కడ తనకి పరిచయమైన రాజాతో ప్రేమలో పడుతుంది. అతను కూడా ఆమె పట్ల ఆకర్షితుడవుతాడు. ఆమె కనిపించకుండా పోయిన తరువాతనే ఆమె ఎవరనేది అతనికి తెలుస్తుంది. దాంతో ఆమెను అన్వేషిస్తూ అతను ఆ ద్వీపానికి చేరుకుంటాడు. అక్కడ చోటుచేసుకునే సన్నివేశాల చుట్టూ దర్శకుడు ఈ కథను అల్లుకుంటూ వెళ్లాడు.
ఆధునీకులను అడుగైనా పెట్టనీయని ద్వీపం నుంచి వచ్చిన నాయిక, హీరోతో ప్రేమలో పడటం ఫస్టాఫ్ గా నడుస్తుంది. ఆమె ఎవరో .. ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకుని హీరో అక్కడికి బయల్దేరడంతో సెకండాఫ్ కొనసాగుతుంది. కథ మొత్తంగా చూసుకుంటే పాతదే .. పాతదారిలో నడుస్తూ వెళ్లేదే. ఎక్కడా కొత్తదనం కనిపించదు. లవ్ .. రొమాన్స్ చాలా పల్చగా అనిపిస్తాయి. యాక్షన్ .. ఎమోషన్స్ అంత బలంగా అనిపించవు.
సంస్థానానికి సంబంధించిన యువరాణి నగరంలోకి రావడం .. ఒక సాధారణ యువకుడిని లవ్ చేయడం .. ఆమెను వెతుక్కుంటూ వెళ్లిన హీరో, ఆమెను సొంతం చేసుకోవడానికి గాను కొన్ని పరీక్షలలో నెగ్గవలసి రావడం వంటి రోటీన్ సన్నివేశాలతోనే ఈ కథ కదులుతూ ఉంటుంది. హీరోయిన్ ఆమె స్నేహతురాలు వేరే ద్వీపం నుంచి రావడం, ఆ తరహా సినిమాలు కొన్నిటిని గుర్తుచేస్తుంది. ఇక సెకండాఫ్ 'ఆదిత్య 369'కి సంబంధించిన సన్నివేశాల తరహాలో సాగుతాయి. రాజులు .. మంత్రులు .. సైన్యాధిపతుల కుట్రలు వంటి సన్నివేశాలు మామూలే.
హీరోయిన్ .. ఆమె సహాయకురాలు ఇద్దరూ వచ్చింది వేరే ద్వీపం నుంచే. కానీ వేరే లోకం నుంచి వచ్చినట్టుగా ప్రవర్తిస్తారు. మనుషులు.. వాళ్ల స్వభావాలు తెలియనట్టుగా వ్యవహరిస్తారు. ఈ తరహా కథలకు కొంత కామెడీ అవసరం. అలాగే హీరోలకు మాస్ ఇమేజ్ కూడా అవసరం. ఇక ఇక్కడ ఉన్నది కొత్త హీరో కాబట్టి, అతనిపై ఆడియన్స్ కి ఎలాంటి అంచనాలు ఉండవు. అలాంటి అంచనాలు కలిగించే ప్రయత్నాలు జరగలేదు.
ఫొటోగ్రఫీ బాగుంది .. ముఖ్యంగా పాటల చిత్రీకరణ కూడా ఆకట్టుకుంటుంది. సంగీతం కూడా ఫరవాలేదు. ఎడిటింగ్ ఓ మాదిరిగా అనిపిస్తుంది. హీరో - హీరోయిన్ కి ఇదే మొదటి సినిమా. ఆ కొత్తదనం తెలిసిపోతూనే ఉంది. నరేశ్ .. సాయికుమార్ .. రాజేశ్వరీ నాయర్ అంతా బాగానే చేశారు. కథాకథనాలు రొటీన్ కి భిన్నంగా లేకపోవడం, కంటెంట్ పై అవసరమైనంత కసరత్తు చేయకపోవడం లోపంగా కనిపిస్తుంది.
'రాజా ది రాజా' (అమెజాన్ ప్రైమ్) మూవీ రివ్యూ!
Raja The Raja Review
Movie Details
Movie Name: Raja The Raja
Genre: Drama
Release Date: 2026-07-24
Cast: Ruthwik, Vishakha, Sai Kumar, Naresh, Rajeshwari Nair, Manju Bhargavi
Director: Anil Boyidapu
PRO: -
Music: Mark K Robin
Banner: Vrindavan Creations
Review By: Peddinti
Disclaimer:
This review is based on the reviewer’s individual perspective. Audience opinions may vary.
Trailer