ఇమ్రాన్ ఖాన్, బుష్రా బీబీలకు భారీ ఊరట.. ఏకాంత నిర్బంధాన్ని నిలిపివేయాలని పాకిస్థాన్ హైకోర్టు ఆదేశం
- జైలు నిబంధనల ప్రకారం సాధారణ సదుపాయాలు కల్పించాలని ఇస్లామాబాద్ హైకోర్టు ఆదేశం
- వీరిని కుటుంబ సభ్యులు కలిసేందుకు అమతించాలన్న హైకోర్టు
- కుమారులతో ఫోన్లో ఇమ్రాన్ మాట్లాడేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశం
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, ఆయన భార్య బుష్రా బీబీలకు ఇస్లామాబాద్ హైకోర్టు నుంచి పెద్ద ఎత్తున ఊరట లభించింది. రావల్పిండిలోని అడియాలా జైల్లో ఖైదులో ఉన్న వీరిని ఏకాంత నిర్బంధంలో ఉంచరాదని జైలు అధికారులను హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు జస్టిస్ ఖాదిమ్ హుస్సేన్ సోమ్రో నేతృత్వంలోని ధర్మాసనం ఈ తీర్పు వెలువరించింది. ఇమ్రాన్ ఖాన్, బుష్రా బీబీలను ఏకాంత నిర్బంధంలో ఉంచుతున్నారంటూ దాఖలైన పిటిషన్లను విచారించిన న్యాయస్థానం ఈ ఆదేశాలు జారీ చేసింది.
కోర్టు తీర్పులోని ప్రధానాంశాలు:
ఏకాంత నిర్బంధానికి స్వస్తి: ఇమ్రాన్ ఖాన్ దంపతులను ఒంటరిగా ఉంచే పద్ధతికి స్వస్తి పలికి, జైలు నిబంధనల ప్రకారం సాధారణ సదుపాయాలు కల్పించాలి. ఇమ్రాన్, బుష్రా సమావేశం అయ్యేందుకు అవకాశం కల్పించాలి.
సకాలంలో కుటుంబసభ్యుల భేటీలు: జైలు నిబంధనల ప్రకారం కుటుంబ సభ్యులు ఇమ్రాన్‌ను కలిసేందుకు అనుమతించాలి. ఆయన కుమారులతో ఫోన్లో మాట్లాడేందుకు తగిన ఏర్పాట్లు చేయాలి.
పుస్తకాలు, పత్రికలు, వైద్యం: ప్రతిరోజూ క్రమం తప్పకుండా వార్తాపత్రికలు, పుస్తకాలు అందజేయడంతో పాటు, జైలు నిబంధనలకు అనుగుణంగా సరైన వైద్య సదుపాయాలు కల్పించాలి.
ఈ ఆదేశాల అమలుపై పూర్తి నివేదికను 15 రోజుల్లోగా సమర్పించాలని అడియాలా జైలు సూపరింటెండెంట్‌ను కోర్టు ఆదేశించింది.
అవినీతి కేసుల్లో సుదీర్ఘ కాలంగా శిక్ష అనుభవిస్తున్న ఇమ్రాన్ ఖాన్, బుష్రా బీబీలకు జైల్లో సరైన వసతులు కల్పించడం లేదంటూ ఆయన కుటుంబ సభ్యులు కొద్దికాలంగా ఆందోళన వ్యక్తం చేస్తున్న తరుణంలో... హైకోర్టు నుంచి ఈ సానుకూల తీర్పు వెలువడటం గమనార్హం.