Advertisement

విద్యార్థుల జీవితాలతో కాంగ్రెస్ ప్రభుత్వం ఆటలాడుతోంది: తలసాని శ్రీనివాస్ యాదవ్

Talasani Srinivas Yadav Slams Congress Government For Playing With Students Lives
  • విద్యార్థుల భవిష్యత్తును కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందన్న శ్రీనివాస్ యాదవ్
  • రూ. 11 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను పెండింగ్‌లో పెట్టారని మండిపాటు
  • విద్యార్థుల పోరాటానికి బీఆర్ఎస్ అండగా ఉంటుందని వెల్లడి

తెలంగాణలోని లక్షలాది మంది విద్యార్థుల ఉన్నత చదువులను, వారి భవిష్యత్తును కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. విద్యార్థుల సమస్యలపై పోరాటం చేస్తున్న నాయకులు, విద్యార్థులు వెస్ట్ మారేడ్‌పల్లిలోని క్యాంప్ కార్యాలయంలో తలసానిని కలసి, ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌ బకాయిలను వెంటనే విడుదల చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని వినతిపత్రం సమర్పించారు.


ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ... పేద విద్యార్థులు ఆర్థిక ఇబ్బందుల వల్ల ఉన్నత విద్యకు దూరం కాకూడదనే సదుద్దేశంతో నాడు వైఎస్ రాజశేఖరరెడ్డి ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని తెచ్చారని... ఆ తర్వాత కేసీఆర్ హయాంలో కూడా సకాలంలో నిధులు విడుదల చేశారని గుర్తుచేశారు. కానీ, ప్రస్తుత రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏకంగా రూ. 11,000 కోట్ల బకాయిలను పెండింగ్‌లో పెట్టి విద్యార్థుల జీవితాలతో ఆటలాడుతోందని ధ్వజమెత్తారు. ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో కళాశాల యాజమాన్యాలు కోర్సులు పూర్తయిన విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని, దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.


సెప్టెంబర్ 7వ తేదీ నుంచి ప్రారంభమయ్యే శాసనసభ సమావేశాల్లో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల చెల్లింపుపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తామని, బీఆర్‌ఎస్ పార్టీ విద్యార్థుల పోరాటానికి సంపూర్ణ అండగా ఉంటుందని తలసాని హామీ ఇచ్చారు. నీట్ పేపర్ లీకేజీపై ‘జెన్ జీ’ యువత జరిపిన నిరసనలతో కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా దిగొచ్చిందో, అదే స్ఫూర్తితో కాంగ్రెస్ ప్రభుత్వంపై కూడా విద్యార్థులు గట్టి పోరాటానికి సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు.

Advertisement
Talasani Srinivas Yadav
Telangana Fee Reimbursement
Revanth Reddy Government
BRS Party Telangana
Student Scholarship Arrears
Telangana Assembly Sessions

More Telugu News