కేసీఆర్ పేరు వింటేనే రేవంత్ రెడ్డి వణికిపోతున్నారు: జగదీశ్ రెడ్డి
- రాష్ట్రంలో నీటి ఎద్దడి ఉన్నా ప్రభుత్వ పెద్దలు పట్టించుకోవడం లేదన్న జగదీశ్ రెడ్డి
- అవినీతి సొమ్మును లెక్కించుకోవడంలో నిమగ్నమయ్యారని విమర్శ
- ప్రభుత్వ వైఫల్యాలపై పోరుబాట ప్రారంభిస్తున్నామని వెల్లడి
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పేరు వింటేనే ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి అనుక్షణం భయంతో వణికిపోతున్నారని, ఆ భయం కారణంగానే ప్రతిరోజూ అనుచిత మాటలు మాట్లాడుతున్నారని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి ధ్వజమెత్తారు. సూర్యాపేటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రంలో తీవ్రమైన నీటి ఎద్దడి తలెత్తుతున్నా, ప్రజలు తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వ పెద్దలు పట్టించుకోవడం లేదని జగదీశ్ రెడ్డి మండిపడ్డారు. ప్రజా సమస్యలను పూర్తిగా పక్కనబెట్టి అవినీతి సొమ్మును లెక్కించుకోవడంలో నిమగ్నమయ్యారని ఆరోపించారు. ప్రతిరోజూ కేసీఆర్‌ను గుర్తుచేసుకోవడంలో రేవంత్ రెడ్డే ప్రథమ స్థానంలో ఉంటారని ఎద్దేవా చేసిన ఆయన... "కేసీఆర్‌ను నేరుగా ఎదుర్కొనే ధైర్యం నీకుందా?" అని రేవంత్‌ను ప్రశ్నించారు.
ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రేవంత్ సచివాలయానికి ఎన్నిసార్లు వచ్చారో సమాధానం చెప్పాలని నిలదీశారు. ఆంధ్రప్రదేశ్‌కు అక్రమంగా నదీ జలాలు తరలిపోతుంటే అడ్డుకోలేకపోవడం ప్రభుత్వ అసమర్థతకు, అవినీతికి నిదర్శనమని మండిపడ్డారు. తనకు రాజకీయంగా జన్మనిచ్చిన ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు సీఎం ద్రోహం చేయడం వల్ల మళ్లీ అక్కడ వలసలు ప్రారంభమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, వ్యవసాయ సంక్షోభంపై రేపు బీఆర్‌ఎస్ పోరుబాట ప్రారంభించనుందని ప్రకటించారు. ఇందులో భాగంగా మిర్యాలగూడలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో భారీ రైతు సభను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా మిర్యాలగూడ రైతు సభను నిర్వహించి తీరుతామని, రైతులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదని జగదీశ్ రెడ్డి స్పష్టం చేశారు.