Advertisement

ఎప్పుడు ఎన్నికలు జరిగినా కూటమికి తిరుగులేదు.. అందుకే ఆ పార్టీ భయపడుతోంది: మొగల్తూరులో చంద్రబాబు

Chandrababu Naidu says NDA alliance is unstoppable and opposition is afraid of elections in Mogalturu
  • మొగల్తూరులో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
  • ప్రజావేదిక సభలో చంద్రబాబు ప్రసంగం
  • స్థానిక ఎన్నికల్లో ఓటమి భయంతో కోర్టుల్లో కేసులు వేస్తున్నారని ఆగ్రహం 
  • ఏకగ్రీవాలను ప్రభుత్వమే ప్రోత్సహించిందని వెల్లడి
  • కానీ ఏకగ్రీవం అయితే టికెట్ ఇవ్వబోమని గొడ్డలి పార్టీ బెదిరిస్తోందని విమర్శలు
రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఎన్డీఏ కూటమికి తిరుగులేదని, అందుకే ‘గొడ్డలి పార్టీ’ ఓటమి భయంతో వణికిపోతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. స్థానిక సంస్థల ఎన్నికలు జరగకుండా అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో మంగళవారం జరిగిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, లబ్ధిదారులకు పింఛన్లు అందజేసి ప్రసంగించారు. చిత్తుచిత్తుగా ఓడిపోతామనే భయంతోనే గొడ్డలి పార్టీ కోర్టుల్లో కేసులు వేస్తూ ఎన్నికలను అడ్డుకోవాలని చూస్తోందని ఆరోపించారు.

స్థానిక ప్రభుత్వాలు ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుందని, అవి లేకపోతే కేంద్రం నుంచి నిధులు కూడా రావని చంద్రబాబు అన్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు సర్పంచులు, వార్డు సభ్యులు ఉండటం ప్రజాస్వామ్యానికి ఎంతో కీలకమని అభిప్రాయపడ్డారు. గ్రామాల్లో గొడవలు కాదని, ఐకమత్యమే ముఖ్యమని, అందుకే ఏకగ్రీవాలను తమ ప్రభుత్వం ప్రోత్సహించిందని గుర్తుచేశారు. కానీ గొడ్డలి పార్టీ నాయకులు మాత్రం ఏకగ్రీవం అయితే ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వమని బెదిరిస్తున్నారని విమర్శించారు. 

బీసీల రిజర్వేషన్లను 34 శాతం నుంచి తగ్గించిన ఆ పార్టీ, ఇప్పుడు తాము తిరిగి రిజర్వేషన్లు అమలు చేస్తుంటే కోర్టులకు వెళ్లి అడ్డుపడిందని మండిపడ్డారు. ఓటర్ల జాబితా సవరణ పూర్తయ్యే వరకు ఎన్నికలు వద్దంటూ కేసులు వేయడమే వారి ఓటమి భయానికి నిదర్శనమని పేర్కొన్నారు. ఆయారాం-గయారాం రాజకీయాలకు తెరదించుతూ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో చైర్మన్, మేయర్ల ఎన్నికను ప్రత్యక్ష పద్ధతిలో ఐదేళ్ల కాలానికి తాము తీసుకొచ్చామని వివరించారు.

31 ఏళ్ల క్రితం ఇదే రోజున తాను తొలిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశానని గుర్తు చేసుకున్న చంద్రబాబు, అప్పటి నుంచి ప్రజా చైతన్యం కోసం, రాష్ట్ర పునర్నిర్మాణం కోసం పనిచేస్తూనే ఉన్నానని తెలిపారు. 2019 తర్వాత విధ్వంసమైన రాష్ట్రాన్ని, మళ్లీ గాడిలో పెట్టేందుకు ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించారని, కేంద్ర సహకారంతో డబుల్ ఇంజన్ సర్కార్‌గా సమర్థవంతమైన పాలన అందిస్తున్నామని చెప్పారు. కేవలం రెండేళ్లలో సంక్షేమం కోసం రూ.1.50 లక్షల కోట్లు ఖర్చు చేశామని, ఎన్టీఆర్ భరోసా కింద రూ.73,507 కోట్లను పేదలకు అందించామని తెలిపారు. బటన్ నొక్కడం కాదని, ఇంటింటికీ వెళ్లి గౌరవంగా పెన్షన్ అందిస్తున్న ఘనత తమ ప్రభుత్వానిదేనని అన్నారు.

మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తున్నామని, డ్వాక్రా సంఘాలతో పొదుపు ఉద్యమానికి నాంది పలికి వారిని ఎంఎస్‌ఎంఈలుగా తీర్చిదిద్దుతున్నామని వివరించారు. దీపం 2.0 ద్వారా ఏటా మూడు ఉచిత సిలిండర్లు, స్త్రీశక్తి పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్నామని గుర్తుచేశారు. వడ్డెర్లకు మైనింగ్‌లో, గీత కార్మికులకు మద్యం దుకాణాల్లో రిజర్వేషన్లు కల్పించామని, మత్స్యకారులకు వేట నిషేధ సమయంలో రూ.20 వేల ఆర్థిక సాయం అందిస్తున్నామని తెలిపారు. ఎస్సీ వర్గీకరణను అమలు చేసి దశాబ్దాల కలకు సాకారం చేశామని పేర్కొన్నారు.

అభివృద్ధి విషయంలోనూ తమ ప్రభుత్వం పరుగులు పెడుతోందని చంద్రబాబు అన్నారు. వెలిగొండ ప్రాజెక్టు ద్వారా కరవు నేలకు నీరందించామని, నల్లమల కొండల్లో సొరంగాలు తవ్వి మార్కాపురం చెన్నకేశవ స్వామి పాదాలకు శ్రీశైలం జలాలు చేర్చడం తన జీవితంలో మర్చిపోలేని అనుభూతినిచ్చిందని తెలిపారు. త్వరలో గోదావరి జలాలను ఉత్తరాంధ్రకు తరలించి ఆ ప్రాంత చరిత్రను మార్చబోతున్నామని, నదుల అనుసంధానంతో రాష్ట్రంలో నీటి కష్టాలు తీరుస్తామని ధీమా వ్యక్తం చేశారు. 

మెగా డీఎస్సీ ద్వారా 16 వేల ఉపాధ్యాయ ఉద్యోగాలు ఇస్తుంటే, గొడ్డలి పార్టీ 350 కేసులు వేసి అడ్డుకుందని ఆరోపించారు. గత పాలకులు పరిశ్రమలను తరిమికొట్టి యువత భవిష్యత్తును నాశనం చేశారని, అందుకే తాము పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షిస్తున్నామని చెప్పారు. సమాజంలో ఆర్థిక అసమానతలను తొలగించి, ప్రతి ఒక్కరూ గౌరవంగా జీవించేలా చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని, గొడ్డలి పార్టీ లాంటి కలుషిత రాజకీయాలను ప్రజలు కడిగేయాలని ఆయన పిలుపునిచ్చారు.
Advertisement
Chandrababu Naidu
Andhra Pradesh Local Body Elections
NTR Bharosa Pension Scheme
NDA Alliance Andhra Pradesh
YSRCP Election Fear
Mogalturu Public Meeting

More Telugu News