దాడులు చేసేవారిని కాపాడటమేనా ఇందిరమ్మ రాజ్యం?: టీబీజేపీ నేతల అరెస్ట్‌పై బండి సంజయ్ ఆగ్రహం
- రాంచందర్ రావు అరెస్ట్‌పై బండి సంజయ్ మండిపాటు
- పరామర్శకు వెళుతున్న నేతలను అరెస్ట్ చేయడం దివాళాకోరుతనమని వ్యాఖ్య
- అరెస్ట్ చేసిన నేతలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్
బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు అరెస్ట్‌పై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బాధితులను పరామర్శించేందుకు, నిరసన తెలిపేందుకు వెళ్తున్న నాయకులను అడ్డుకుని అరెస్టులు చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ దివాళాకోరుతనానికి నిదర్శనమని మండిపడ్డారు.
నల్లొండ జిల్లా బీజేపీ అధ్యక్షుడి ఇంటిపై దాడి చేసి ధ్వంసం చేసిన నిందితులపై ఇప్పటివరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అదేవిధంగా హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై దాడికి పాల్పడిన యూత్ కాంగ్రెస్ నేతలను పోలీసులు ఎందుకు అరెస్ట్ చేయడంలేదని నిలదీశారు. దాడులు చేసేవారిని కాపాడుతూ, ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలిపే వారిపై అణచివేతకు దిగడమేనా కాంగ్రెస్ చెబుతున్న 'ఇందిరమ్మ రాజ్యం' అని ధ్వజమెత్తారు. పోలీసులను అడ్డం పెట్టుకుని కాంగ్రెస్ నేతలు రాష్ట్రంలో విధ్వంసకర రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు.
అక్రమంగా అరెస్ట్ చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావుతో పాటు ఇతర నాయకులను వెంటనే భేషరతుగా విడుదల చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. లేనిపక్షంలో మున్ముందు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని, జరిగే ప్రతీ సంఘటనకు కాంగ్రెస్ ప్రభుత్వంతో పాటు పోలీసులే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వానికి పట్టిన గతే త్వరలోనే కాంగ్రెస్ పార్టీకి కూడా పడుతుందని జోస్యం చెప్పారు.