రాహుల్ గాంధీపై ఎఫ్‌ఐఆర్‌ను తక్షణమే రద్దు చేయాలి: వరంగల్ క్రాస్‌రోడ్ వద్ద కాంగ్రెస్ పార్టీ భారీ నిరసన
- అణగారిన వర్గాల హక్కుల కోసం రాహుల్ గళమెత్తుతున్నారన్న తుంబూరు దయాకర్ రెడ్డి
- ప్రతిపక్షాల గొంతును కేంద్రం అణచివేస్తోందని మండిపాటు
- దర్యాప్తు సంస్థలను, చట్టాలను దుర్వినియోగం చేస్తోందని ఆగ్రహ్రం
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను వెంటనే రద్దు చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయ ఇన్‌చార్జ్, కాంగ్రెస్ నేత తుంబూరు దయాకర్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీపై అక్రమ ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడాన్ని నిరసిస్తూ ఈరోజు వరంగల్ క్రాస్‌రోడ్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ధర్నా, నిరసన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా తుంబూరు దయాకర్‌రెడ్డి మాట్లాడుతూ... దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ, సామాజిక న్యాయం, అణగారిన వర్గాల హక్కుల కోసం నిరంతరం గళమెత్తుతున్న రాహుల్ గాంధీపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడం ప్రజాస్వామ్య విలువలకు పూర్తిగా విరుద్ధమని విమర్శించారు. ప్రజా సమస్యలను నిలదీసే ప్రతిపక్ష నాయకుల గొంతును అణచివేసేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను, చట్టాలను దుర్వినియోగం చేస్తూ కక్షసాధింపు రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం తన నియంతృత్వ వైఖరిని మార్చుకుని ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయకపోతే ప్రజల తరఫున మరింత పెద్ద ఎత్తున దేశవ్యాప్త ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.
ఈ నిరసన కార్యక్రమానికి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు నల్ల బ్యాడ్జీలు ధరించి భారీ సంఖ్యలో తరలివచ్చారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రూరల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తోట వీరభద్రం, ఏదులాపురం టౌన్ అధ్యక్షుడు కిశోర్ నాయక్, మున్సిపాలిటీ చైర్‌పర్సన్ కోకపర్తి అనిత, వైస్ చైర్మన్ నవీన్, వివిధ విభాగాల ప్రతినిధులు, కౌన్సిలర్లు, సర్పంచులు, స్థానిక కాంగ్రెస్ నాయకులు మరియు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.